శ్రీశైలం కబ్జా

శ్రీశైలం కబ్జా

కృష్ణాజలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్న తీరు శ్రుతి మించుతున్నది. కృష్ణా బోర్డు అండ చూసుకొని అడ్డగోలుగా రెచ్చిపోతున్నది. పోతిరెడ్డిపాడు ద్వారా ఇష్టానుసారంగా నీటిని తరలిస్తున్నా ఆ రాష్ట్రం జలదాహం మాత్రం తీరడం లేదు. మొత్తం శ్రీశైలం జలాశయాన్నే చెరబట్టి.. తెలంగాణ నీటి విడుదలను సైతం అడ్డుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా రెండురోజులుగా తెలంగాణకు విడుదల చేస్తున్న నీటిని వెంటనే నిలిపివేసేలా ఉత్తర్వులు జారీచేయాలంటూ ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ కృష్ణాబోర్డుకు లేఖ రాయడం వివాదాస్పదంగా మారింది. బోర్డు అనుమతి లేకుండా వంద టీఎంసీలకుపైగా నీటిని తరలించుకుపోవడమే కాకుండా తెలంగాణకు వాస్తవంగా రావాల్సిన నీటిని నిలిపివేయాలంటూ బోర్డుకు ఫిర్యాదు చేయడం చంద్రబాబు సర్కారు జల దౌర్జన్యానికి పరాకాష్టగా నిలిచిందని పలువురు పేర్కొంటున్నారు.

కృష్ణా యాజమాన్య బోర్డు ఈ నీటి సంవత్సరంలో ఇప్పటివరకు కృష్ణా జలాల పంపిణీలో వాటాలు తేల్చలేదు. అయినప్పటికీ ఇబ్బడిముబ్బడిగా నీటి విడుదల ఉత్తర్వులను జారీచేస్తూ తాత్కాలిక ప్రాతిపదికన ఏపీకి 66 శాతం, తెలంగాణకు 34 శాతం పంపిణీ చేస్తున్నామంటూ ప్రకటించింది. నీటి సంవత్సరం ప్రారంభమై నాలుగు నెలలైనా వాటాలు తేల్చకుండా కాగితాలపై తాత్కాలిక లెక్కలేస్తూ ఏపీతో కలిసి డ్రామాలాడుతున్నది. బోర్డు నిర్లక్ష్యాన్ని ఆసరా చేసుకుని ఏపీ జల వనరులశాఖ శ్రీశైలం నుంచి ఇష్టానుసారంగా నీటిని తరలించుకుపోతున్నది. వాస్తవంగా ఏపీకి కృష్ణాబోర్డు 129 టీఎంసీలకు అనుమతి ఇస్తే.. ఒక్క పోతిరెడ్డిపాడు నుంచే ఇప్పటివరకు 111.15 టీఎంసీలు తరలించింది. నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయం నుంచి బుధవారం వరకు 197.114 టీఎంసీలు వాడుకున్నది. కృష్ణాబేసిన్ మొత్తంలో ఆ రాష్ట్ర నీటి వినియోగం 235.217 టీఎంసీలుగా ఉంది. అదే సమయంలో తెలంగాణకు బోర్డు నుంచి అధికారికంగా 82.50 టీఎంసీలకు అనుమతి ఉండగా.. సాగర్, శ్రీశైలం జలాశయాల నుంచి బుధవారం నాటికి 44.228 టీఎంసీలు మాత్రమే వాడుకున్నది. నాలుగింట మూడొంతులకు పైగా నీటిని వాడుకున్న ఏపీ.. తెలంగాణ వాటాను అడ్డుకోవాలని చూడటం విడ్డూరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. నాగార్జునసాగర్‌లో 510 అడుగుల కంటే ఎగువన 153.941 టీఎంసీలు ఉన్నందున.. అవి రెండు రాష్ర్టాల వినియోగానికి సరిపోతాయంటూ ఏపీ ఈఎన్సీ.. కృష్ణాబోర్డు పక్షాన వకాల్తా పుచ్చుకోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు.

(Visited 43 times, 13 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *