ధ‌ర్మ‌యాత్రా ? తెలంగాణ మీద దండ‌యాత్రా ?

ధ‌ర్మ‌యాత్రా ? తెలంగాణ మీద దండ‌యాత్రా ?

కూట్ల రాయి తీయ‌లేనోడు ఏట్ల రాయి తీస్తన‌న్న‌డ‌ని ఓ సామెత‌. ఉన్న ఐదు స్థానాలు ఉంటాయో ? పోతాయో ? తెలియ‌ని బీజేపీ పార్టీ తెలంగాణలో ఏదో అల‌జ‌డి సృష్టించి ప్ర‌జ‌ల‌ను అయోమ‌యంలోకి నెట్టాల‌ని ఇంకా తాను న‌మ్ముకున్న అరిగిపోయిన రికార్డు హిందుత్వ భావ‌జాలాన్ని రెచ్చ‌గొట్టి ల‌బ్దిపొందాల‌ని ఆరాట‌ప‌డుతుంది. ఈ పార్టీకి తెలంగాణ‌లో బ‌ల‌ప‌డ‌డానికి మ‌రే అంశ‌మూ అందుబాటులో లేక‌పోవ‌డ‌మే దీనిని న‌మ్ముకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కే తెలియ‌ని రామ్ మాధ‌వ్ వ‌రంగ‌ల్ స‌భ‌లో మాట్లాడిన భాష చూస్తే వారు ఎంత‌క‌యినా దిగ‌జార‌డానికి సిద్ద‌మ‌య్యార‌ని తేలిపోయింది. ప్ర‌జ‌ల‌తో సంబంధాలు లేని ముర‌ళీధ‌ర్ రావు 2019లో అధికారం మాదే అంటాడు. ఆ పార్టీ అధ్య‌క్షుడు ల‌క్ష్మ‌ణ్ మ‌మ్మ‌ల్ని చూసి టీఆర్ఎస్ భ‌య‌పడుతుంద‌ని గాండ్రిస్తాడు. కేసీఆర్ తెలంగాణ‌లోని విప‌క్షాల‌కు ఉమ్మ‌డి శ‌తృవు కాబ‌ట్టి, ఇప్పుడు కేసీఆర్ ను స‌మిష్టిగా క‌లిసి ఎదుర్కోలేరు ? ఒక్కొక్క‌రు విడిగా నిల‌బ‌డ‌లేరు. ఈ దిక్కులేని ప‌రిస్థితుల‌లో ఉన్న వాళ్లు బీజేపీ రాజ‌కీయ క్రీడ‌ను ప‌రోక్షంగా ప్రోత్స‌హిస్తూ ఆనంద‌ప‌డుతున్నాయి.

తెలంగాణ ఉద్య‌మంలో ఇలాంటి అనేక కుట్ర‌లు తెలంగాణ మీద జ‌రిగాయి. క‌డుపులో క‌త్తులు పెట్టుకుని, పెద‌వుల మీద న‌వ్వులు పులుముకుని బీజేపీ తెలంగాణ అంశానికి మ‌ద్ద‌తు ఇచ్చింది. చివ‌రి నిమిషంలో పార్టీ ప‌రువు గంగ‌పాలు కాకుండా చిత్త‌శుద్ది గ‌ల సుష్మాస్వరాజ్, రాజ్ నాథ్ సింగ్ వంటి కొంద‌రు నేత‌లు ఆ పార్టీలో ఉండ‌బ‌ట్టి లోక్ స‌భ‌లో తెలంగాణ బిల్లు బ‌య‌ట‌ప‌డింది. ఆ త‌రువాత రాజ్య‌స‌భ‌లో అప్ప‌టి బీజేపీ నేత‌, ప్ర‌స్తుత ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు బిల్లును అడ్డుకునేందుకు ఎన్ని పిల్లిమొగ్గ‌లు వేశారో ? ఎన్ని విఫ‌ల‌యత్నాలు చేశారో ? అందరికీ తెలిసిందే. తెలంగాణ ఏర్ప‌డిన వెంట‌నే త‌ల్లిని సంపి పిల్ల‌ను బ‌తికించారు అంటూ తెలంగాణ గ‌డ్డ మీద మోడీ ఏడ్చిన ఏడ్పులను ప్ర‌జ‌లు తిర‌స్క‌రించి గుణ‌పాఠం చెప్పారు. అధికారం ద‌క్కిన వెంట‌నే ఏడు మండ‌లాల‌ను ఆంద్ర‌లో క‌లిపి తెలంగాణ ప్ర‌జ‌ల మీద క‌సి తీర్చుకుంది.

తెలంగాణ ఏర్ప‌డిన మ‌రుక్ష‌ణం నుండి ఇక్క‌డ ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళ ప‌రిచేందుకు, ప్ర‌భుత్వాన్ని అస్థిర‌ప‌రిచేందుకు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు చేశారు. కాకుంటే 14 ఏండ్ల ఉద్య‌మ‌కాలంలో అంద‌రి కుట్ర‌ల‌ను చీల్చుకుని తెలంగాణ రాష్ట్ర సాధ‌న‌తో ఆత్మ‌గౌర‌వాన్ని ఎలుగెత్తి చాటిన కేసీఆర్ నాయ‌క‌త్వం మూలంగా తెలంగాణ ఈ రోజు స‌గ‌ర్వంగా త‌లెత్తుకు తిరుగుతుంది. తెలంగాణ వ్య‌తిరేకశ‌క్తుల కుట్ర‌ల గురించి క్షుణ్ణంగా తెలుసుకాబ‌ట్టే కేసీఆర్ గ‌త నాలుగేళ్లుగా తెలంగాణ వీరి బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటూ వ‌స్తున్నారు. హైకోర్టును అడ్డుకోవ‌డం, కృష్ణా నీటి హ‌క్కుల మీద మెలిక‌లు, తెలంగాణ‌కు రావాల్సిన క‌రంటు ఇవ్వ‌కుండా రాద్దాంతం చేయ‌డం, విభ‌జ‌న హామీల‌ను తుంగ‌లో తొక్క‌డం జ‌రుగుతూనే ఉంది. ఎవ‌రు ఎన్ని విధాలుగా తెలంగాణ అభివృద్దిని ఆటంక‌ప‌ర‌చాల‌ని ప్ర‌య‌త్నించినా కేసీఆర్ తెలివితో యుక్తిగా రాజ్యాంగ‌బ‌ద్దంగా కేంద్రంతో సంప్ర‌దింపులు జ‌రుపుతూ త‌న ప‌ని తాను చేసుకుపోతున్నారు.

కేసీఆర్ ఎంత చిత్త‌శుద్దితో ప‌నిచేసినా ఆంధ్రా పార్టీల నాయ‌క‌త్వంలోని నేత‌లు ప్ర‌భుత్వం మీద బుర‌ద‌జ‌ల్ల‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. తెలంగాణ ఎదుగుద‌ల‌ను ఓర్వ‌లేని మీడియా కుట్ర‌రాత‌లు రాస్తూనే ఉంది. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ప‌లుచ‌న చేసేందుకు, తెలంగాణ ప్ర‌జ‌ల‌ను ఏమార్చేందుకు ఏ చిన్న అవ‌కాశం దొరికినా ఈ మీడియా వ‌దులుకోవ‌డం లేదు. అమ‌రావ‌తికి రావాల్సిన విభ‌జ‌న హామీలు, కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, ప్ర‌త్యేక‌హోదా గురించి కేంద్రం ఆంధ్ర‌ను మోసం చేస్తుంద‌ని, చంద్ర‌బాబు క‌ష్ట‌ప‌డుతున్నార‌ని క‌థ‌నాలు అమ్మే మీడియా అక్క‌డ బాబు అవినీతిని, అక్ర‌మాల‌ను ఎన్న‌డూ బ‌య‌ట‌పెట్టే ప్ర‌య‌త్నం చేయ‌లేదు. ఆంద్రావార్త‌ల‌ను తెలంగాణ ఎడిషన్ల‌లో వ‌డ్డించి, తెలంగాణ వార్త‌ల‌కు ఆంధ్రాలో అస‌లు చోటే ఇవ్వ‌ని ఈ మీడియా సంస్థ‌లు , తెలంగాణ ప్ర‌భుత్వ నాలుగేళ్ల విజ‌యాల‌ను తొక్కిప‌డుతున్నాయి. ఇక టీవీ ఛాన‌ళ్లు తెలంగాణ మీద క‌క్కుతున్న విషం అంతా ఇంతా కాదు.

ఎన్నిక‌లు ఏడాది మాత్ర‌మే ఉన్న నేప‌థ్యంలో ఉద్య‌మంలో తెలంగాణ ప్ర‌జ‌ల‌ను గంద‌ర‌గోళ‌ప‌రిచి ఆందోళ‌న‌కు, ఆవేద‌న‌కు, ఆత్పార్ప‌ణాల‌కు కార‌ణం అయిన మీడియా, రాజ‌కీయ పార్టీలు ఇప్పుడు తిరిగి అవే ప‌రిస్థితుల‌ను సృష్టించాల‌ని విఫ‌ల‌య‌త్నాలు చేస్తున్నాయి. వీరంతా తెలంగాణ‌ను ఓ ప్ర‌యోగ‌శాల‌గా చేస్తున్నారు. ఆంధ్రాకు చెందిన క‌త్తి మ‌హేష్ హిందువుల ఆరాధ్య‌దైవం శ్రీ‌రాముడిని కించ‌ప‌రిచాడు. అస‌లు క‌త్తి మ‌హేష్ అనే వ్య‌క్తికి ఈ గ‌డ్డ‌తో ఎలాంటి సంబంధంలేదు. కేవ‌లం వార్త‌ల్లో వ్య‌క్తిగా ఉండేందుకు ఆయ‌న ఎప్పుడూ టీవీ స్టూడియోల‌లో త‌ల‌తిక్క వాద‌న‌లు చేస్తుంటాడు. సామాజిక బాధ్య‌త క‌లిగిన మీడియా ఆయ‌న వ్యాఖ్య‌ల‌ను ఆయా టీవీ చ‌ర్చ‌ల‌లోనే ఖండించాలి. కానీ బాధ్య‌తార‌హితంగా ఆ వ్యాఖ్య‌ల‌నే ప‌దే ప‌దే ప్ర‌స్తావించి ప్ర‌చారం చేసి హిందువుల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశాయి. ఇక హిందు ధ‌ర్మ ప్ర‌చార‌క‌ర్త‌గా చెప్పుకునే ఆంధ్రాకు చెందిన ప‌రిపూర్ణానంద ఆ క‌త్తి మ‌హేష్ వ్యాఖ్య‌ల‌ను సాకుగా తీసుకుని ధ‌ర్మ‌యాత్ర అంటూ తెలంగాణ మీద దండ‌యాత్ర చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో ఏడాది క్రితం టీడీపీ ప్ర‌భుత్వం గుళ్ల‌ను కూల్చేసింది. విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ గుడి లో అక్ర‌మాలు, అకృత్యాలు చూస్తున్న‌వే. తిరుమ‌ల గుడిలో శ్రీ‌వారి న‌గ‌లు మాయం అయ్యాయ‌ని ఉన్న ఆరోప‌ణ‌లు తెలిసిందే. ఇక ర‌మ‌ణ‌దీక్షితులు మీద టీడీపీ పార్టీ చేస్తున్న దాడి అంతా ఇంతా కాదు. దీనికి తోడు కేంద్రం నుండి టీడీపీ తెచ్చుకున్న నిధుల‌కు లెక్క ఇవ్వ‌డం లేదు. పైగా కేంద్రంతో సంబంధాలు తెంచుకుని ఎదురుదాడి చేస్తున్న తీరునూ చూస్తున్నాం. అక్క‌డ బీజేపీ నేత‌ల మీద రోజుకో దాడి జ‌రుగుతుంది. ఇప్ప‌టికి అక్క‌డ పార్టీ అధ్య‌క్షుడు క‌న్నా లక్ష్మీనారాయ‌ణ మీద మూడు సార్లు దాడి జ‌రిగింది. తెలంగాణ బీజేపీ నేత‌లు దీనిని ఖండించిన దాఖ‌లాలు కూడా లేవు. తెలంగాణ‌లో బీజేపీ స్వేచ్చ‌గా మొన్న‌టి వ‌ర‌కూ తొలి విడ‌త యాత్ర చేశారు. కాంగ్రెస్ ఓ ద‌శ ముగించుకుంది. తెలంగాణ రాష్ట్రం ప్ర‌శాంతంగానే ఉంది. కానీ ప‌క్క రాష్ట్ర‌పు వ్య‌క్తి ఇక్క‌డి స్టూడియోలో కూర్చుని చేసిన వ్యాఖ్య‌ల పేరుతో ఇక్క‌డ ఆందోళ‌న‌కు ప‌రిపూర్ణానంద ద‌ర్మ‌యాత్ర అంటూ వ్య‌వ‌హారం ప‌క్క‌దారి ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు స్ప‌ష్టంగా క‌నిపిస్తుంది. నిజంగా ధ‌ర్మాన్ని ర‌క్షించాలి అనుకుంటే తిరుమ‌ల శ్రీ‌వారి గుడిలో అక్ర‌మాలు, విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ గుడిలో అక్ర‌మాల మీద ఈ స్వామి పోరాడాలి. అక్క‌డికి వెళ్లి మాట్లాడాలి. కానీ ఇక్క‌డ ఈ స్వామికి ఏం ప‌ని ?

నిజంగా క‌త్తి మహేష్ వ్యాఖ్య‌ల‌కు నిర‌స‌న‌గా ఆయ‌న యాత్ర చేయాల‌ని అనుకున్నాడ‌నుకుందాం. క‌త్తి మ‌హేష్ మీద రాజ్యాంగ‌బ‌ద్దంగా పోలీసుశాఖ త‌న ప‌రిధిలోని చ‌ర్య‌ల‌ను తీసుకుంది. ఇప్పుడు క‌త్తి మహేష్ ఆంధ్రాలో ఉన్నాడు .. ఆ రాష్ట్రంలో ఉండే అర్హ‌త‌లేద‌ని అక్క‌డి నుండి కూడా బ‌హిష్క‌రించాల‌ని పోరాడాలి. శాంతిభ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌లిగించే, స‌మాజంలో అల‌జ‌డులు సృష్టించే, ఒక వ‌ర్గం మ‌న‌సుల‌ను గాయ‌ప‌రిచే వ్యాఖ్య‌లు చేసే వారికి ఉన్న శిక్ష బ‌హిష్క‌ర‌ణ అస్త్రం. గ‌తంలో బీజేపీ అధ్య‌క్షుడు గుజ‌రాత్ నుండి బ‌హిష్క‌ర‌ణ‌కు గుర‌యితే ఢిల్లీలో రెండేళ్లు త‌ల‌దాచుకున్నాడు. ఇప్పుడు కూడా క‌త్తి మ‌హేష్ విష‌యంలో అదే జ‌రిగింది. చ‌ర్య తీసుకున్నందున ఓ స్వామిగా, శాంత‌స్వ‌భావిగా త‌న నిర్ణ‌యాన్ని, కార్య‌క్ర‌మాన్ని స‌మీక్షించుకోవాలి. కానీ రాజ‌కీయ నాయ‌కుడిలా ప‌ట్టుబ‌ట్టి రెచ్చ‌గొట్టి సాధించాలి అనుకుంటే దాని వెన‌క స‌మాజం ప‌ట్ల బాధ్య‌త‌కాదు .. మ‌రేదో ఇత‌ర కార‌ణాలు ఉన్నాయ‌ని అర్థం అవుతుంది. తెలంగాణ ఉద్య‌మంలో అనేక కుట్ర‌ల‌ను చూసిన తెలంగాణ స‌మాజం ఎంతో చైత‌న్య‌వంత‌మ‌యింది. సున్నిత‌మ‌యిన అంశాల‌ను ముందుపెట్టి రెచ్చ‌గొట్టి తాత్కాలిక ప్ర‌యోజ‌నం, సంతృప్తి పొంద‌వ‌చ్చేమో గానీ, ప్ర‌జ‌ల‌ను ఎల్ల‌కాల‌మూ మ‌భ్య‌పెట్ట‌లేరు. మ‌న‌సులో ఏదో పెట్టుకుని ధ‌ర్మ‌యాత్ర పేరుతో దండ‌యాత్ర చేయాల‌ని ప్ర‌య‌త్నిస్తే అభాసుపాలు కాక త‌ప్ప‌దు.

సందీప్ రెడ్డి కొత్త‌ప‌ల్లి

(Visited 373 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *