అడుగుపెడితే మూడేళ్ల జైలు

అడుగుపెడితే మూడేళ్ల జైలు

ఒకరిద్దరు వ్యక్తులు సమాజంలో అశాంతిని సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. కత్తి మహేశ్ నగర బహిష్కరణ వేటుపై డీజీపీ మహేందర్‌రెడ్డి మీడియాకు వివరణ ఇచ్చారు. కత్తి మహేశ్ అనే వ్యక్తి ఓ టీవీ చానెల్‌లో తను చేసిన వ్యాఖ్యల వల్ల మెజార్టీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఈ కామెంట్స్ కొన్ని వర్గాలకు ఆగ్రహం తెప్పించేలా ఉన్నాయి. భావ వ్యక్తీకరణతో ఇతరుల మనోభావాలు దెబ్బతీయొద్దు. కత్తి మహేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కౌంటర్ గ్రూప్స్ రంగంలోకి దిగాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే శాంతిభద్రతలు క్షీణించే అవకాశం ఉందని ప్రజలు గమనించాలి అని డీజీపీ సూచించారు.

ఇలాంటి సంఘటనలు ఇక నుంచి జరగ్గకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాం. కత్తి మమేశ్‌పై ఆరు నెలలు పాటు నగర బహిష్కరణ చేయడం జరిగింది. ఒక వేళ నగరంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తే మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని.. రాష్ట్రం నుంచి కూడా బహిష్కరించే అవకాశం ఉందన్నారు. జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని చర్యలు తీసుకుంటాం. సోషల్ మీడియాలో ఎక్కడి నుంచి పోస్టు చేసినా చర్యలు తప్పవు అని మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసు వ్యవస్థలు కలిసి పని చేస్తాయని డీజీపీ చెప్పారు. కత్తి మహేశ్‌ను స్వస్థలమైన చిత్తూరు జిల్లాకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

ఏ వ్యక్తి అయినా హైదరాబాద్‌లో ఉండొచ్చు. కానీ ఈ నగరంలో గ్రూపు తగదాలు, ప్రజల మధ్య చిచ్చుపెట్టడం వంటి అంశాలకు స్థానం ఇవ్వొద్దు. అలా ఎవరైనా చేస్తే తెలంగాణ పోలీసులు సీరియస్‌గా తీసుకుంటారని పేర్కొన్నారు. అలాంటి వ్యక్తులకు సహకరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

ఆ టీవీ చానెల్‌కు షోకాజ్ నోటీసులు
కత్తి మహేశ్‌ను తీసుకువచ్చి ఓ టీవీ చానెల్ చర్చ చేపట్టడం, అతని కామెంట్స్ పదేపదే స్క్రోల్ చేసిన ఆ చానెల్‌కు షోకాజ్ నోటీసులు ఇచ్చామని డీజీపీ తెలిపారు. కేబుల్ చట్టం ప్రకారం ఆ చానెల్‌పై చర్యలు తీసుకుంటామన్నారు. మీడియా కూడా కొన్ని విషయాల్లో నియంత్రణ పాటించాల్సిన అవసరం ఉందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలి. వివాదాస్పద వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో ఉండే వారు జాగ్రత్తగా ఉండాలి. చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు అన్నింటిని తీసుకుంటామని డీజీపీ స్పష్టం చేశారు.

గత నాలుగేళ్లలో చిన్న అలజడి కూడా జరగలేదు
గత నాలుగేళ్లలో శాంతి భద్రతలకు విఘాతం కలగలేదు. ఒక చిన్న అలజడి కూడా జరగలేదని డీజీపీ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శాంతిభద్రతలను పరిరక్షించడంలో తెలంగాణ పోలీసు వ్యవస్థ చిత్తశుద్ధితో పని చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతిభద్రతలకు విఘాతం కలగనివ్వమని పేర్కొన్నారు. గత మూడేళ్ల నుంచి ఉన్నత ప్రమాణాలు ఉన్న నగరంగా హైదరాబాద్ నెంబర్‌వన్‌గా నిలుస్తుంది. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయి. సమాజంలో శాంతిభద్రతలు రక్షించేందుకు ప్రతి క్షణం కృషి చేస్తున్నాం. శాంతిభద్రతలు అదుపులో ఉన్నందుకే ఇక్కడకు పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలివస్తున్నాయన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసులు మొదటి స్థానంలో ఉన్నారని డీజీపీ తెలిపారు.

(Visited 241 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *