అభివృద్దిని ఓర్వ‌లేవు .. ఆనందాన్ని పంచ‌లేవు

అభివృద్దిని ఓర్వ‌లేవు .. ఆనందాన్ని పంచ‌లేవు

నాలుగు కోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష .. 60 ఏండ్ల అలుపెర‌గ‌ని ఉద్య‌మం .. వంద‌ల‌కొద్దీ బ‌లిదానాలు.. కేసీఆర్ ప్రాణాలు ప‌ణంగా .. టీఆర్ఎస్ ప‌ద‌వీ త్యాగాల ఫ‌లితంగా ఏర్ప‌డ్డ‌ది తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్, బీజేపీ త‌దిత‌ర పార్టీలు తెలంగాణ ఏర్పాటు త‌మ వ‌ల్ల‌నే అని ఎంత వాదించినా ఉద్య‌మ స‌మ‌యంలో, పార్ల‌మెంటులో తెలంగాణ బిల్లు పెట్టిన స‌మ‌యంలో వారు వేసిన పిల్లిమొగ్గ‌లు, తెలంగాణ బిల్లు పార్ల‌మెంటు ఆమోదం పొంద‌కుండా వారు చేసిన విఫ‌ల‌య‌త్నాలు తెలంగాణ ప్ర‌జ‌లు అప్పుడే మ‌ర‌చిపోతార‌నుకోవ‌డం వారి అవివేకం. తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏండ్లు నిరంత‌రం శ్ర‌మించిన కేసీఆర్ వ‌చ్చిన తెలంగాణను ఎలా అభివృద్ది చేసుకోవాలి అని స్ప‌ష్ట‌మ‌యిన అవ‌గాహ‌న‌, ప్ర‌ణాళిక‌, ల‌క్ష్యంతో ముందుకు వెళ్తుండ‌డం తెలంగాణ వ్య‌తిరేకుల‌కు ఏ మాత్రం రుచించ‌డం లేదు అన్న‌ది గ‌త నాలుగేళ్ల ప‌రిణామాల‌ను ప‌రిశీలిస్తే స్ప‌ష్టంగా అవ‌గ‌తం అవుతుంది.

తెలంగాణ వ‌స్తే ఇక చీక‌టి బ‌తుకులే అని అప్ప‌టి ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి అంటే తెలంగాణ ఇచ్చింది మేమే ఇందులో కేసీఆర్ చేసింది ఏముంది అని తెలంగాణ కాంగ్రెస్ వాద‌న మొద‌లుపెట్టింది. వెంక‌య్య‌నాయుడి స‌హ‌కారంతో తెలంగాణ బిల్లు అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించిన బీజేపీలోని ఒక వ‌ర్గం తెలంగాణ ఏర్పాటు జీర్ణించుకోలేక పోల‌వరం ప‌రిధిలొని తెలంగాణ ఏడు గ్రామాల‌ను ఆంధ్రాలో చేర్పించుకుని త‌మ అహాన్ని సంతృప్తి ప‌రుచుకున్నాయి. రెండు కండ్లు, కొబ్బ‌రిచిప్ప‌ల సిద్దాంతం అంటూ తెలంగాణ అమ‌రుల ఉసురుపోసుకున్న చంద్ర‌బాబు నాయుడు వ‌చ్చిన తెలంగాణ‌ను విఫ‌ల రాష్ట్రంగా చిత్రీక‌రించేందుకు విభ‌జ‌న వాటా ప్ర‌కారం తెలంగాణ‌కు ఆంధ్ర నుండి రావాల్సిన నీళ్లు, క‌రంటు రాకుండా తెలంగాణ‌లో ఉన్న త‌న వంది మాగ‌ధుల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం మీద‌కు ఉసిగొలిపి ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేశాడు. 14 ఏండ్ల ఉద్య‌మంలో ఇలాంటి ఎన్నో ఎత్తుప‌ల్లాల‌ను చూసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ విజ‌యవంతంగా వీరి కుట్ర‌ల‌ను తిప్పికొట్టి ఆరునెల‌ల్లోనే తెలంగాణ‌లో 24 గంట‌ల క‌రంటును అందించి తెలంగాణ పాల‌నా ద‌క్ష‌త‌ను ప్ర‌పంచానికి చాటారు. ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే తెలంగాణ‌లో ఉంటూ తెలంగాణ విజ‌యాల‌ను ఆస్వాదించ‌లేని ఆంధ్రా మీడియా కుట్ర‌లు తెలంగాణ‌కు ఇప్ప‌టికీ, ఎప్ప‌టికీ చేటు చేసేవే.

ముఖ్యంగా ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి దిన‌ప‌త్రిక‌లు, టీవీ9, టీవీ5 వంటి ఛాన‌ళ్లు తెలంగాణ విజ‌యాల‌ను గాలికి వ‌దిలి తెలంగాణ మీద‌, తెలంగాణ ప్ర‌భుత్వం మీద ప్ర‌జ‌ల్లో ఆపోహాలు సృష్టించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాయి. గ‌త నాలుగేళ్ల‌లో ఎన్న‌డూ తెలంగాణ‌ను విజ‌యాల‌ను ఆస్వాదించ‌లేని ఈ మీడియా ఇక ముందు ఎన్నిక‌లు రానున్న నేప‌థ్యంలో మ‌రింత విషం క‌క్కే అవ‌కాశం ఉంటుంది. తెలంగాణ ఉద్య‌మంతో చైత‌న్యం అయిన తెలంగాణ ప్ర‌జ‌లు రానున్న కాలంలో ఈ మీడియా మీద ఓ క‌న్నేసి అవి చేస్తున్న ప్ర‌చారం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది.

స‌మైక్య రాష్ట్రంలో సాగు నీళ్లు లేక చ‌తికిలప‌డ్డ తెలంగాణ వ్య‌వ‌సాయానికి ఊతం ఇచ్చే విధంగా దేశంలో మ‌రే రాష్ట్ర ప్ర‌భుత్వం చేయ‌లేనటువంటి సాహ‌సోపేతంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ కాళేశ్వ‌రం, పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. శ‌ర‌వేగంగా కాళేశ్వ‌రం నిర్మాణం పూర్త‌వుతోంది. అయిదేళ్ల కాలంలో ఓ భారీ ప్రాజెక్టు పూర్త‌య్యే ద‌శ‌కు రావ‌డం భార‌త‌దేశ చ‌రిత్ర‌లో ఓ అద్భుతం. దేశం మొత్తం దీనిని అభినందిస్తుంటే తెలంగాణ‌లోని విప‌క్షాలు ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు అనేక ర‌కాల ప్ర‌య‌త్నాలు చేశాయి. ఆంధ్రా మీడియా అనేక క‌ట్టుక‌థ‌లు అల్లి ఆ ప్రాజెక్టు మీద ప్ర‌జ‌ల్లో ఆపోహాలు రేకెత్తించింది. ఆంధ్రాలో దిక్కు మొక్కు లేని పోల‌వ‌రం గురించి చంద్ర‌బాబు నాయుడు ఏదో చేసేశాడ‌ని చెప్పే ఈ మీడియా, ప‌ట్టిసీమ‌తో వంద‌ల కోట్లు దండుకున్న‌చంద్ర‌బాబు అవినీతిని ప్ర‌శ్నించ‌కుండా న‌దులు అనుసంధానం చేశాడ‌ని సంక‌లు గుద్దుకుని ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదారి ప‌ట్టించే ఈ మీడియా తెలంగాణ భ‌విష్య‌త్ స్వ‌రూపాన్ని మార్చే ప్రాజెక్టుల మీద విషం క‌క్క‌డం గ‌మ‌నించాల్సిన అంశం. ఆంధ్రా ప్రాజెక్టుల‌లో అవినీతిని ప్ర‌శ్నించే వైఎస్ జ‌గ‌న్ ను అభివృద్ది నిరోధ‌కుడు అని ప్ర‌చారం చేసే ఈ మీడియా తెలంగాణ ప్రాజెక్టుల‌కు అడ్డుప‌డే విప‌క్షాల గురించి నోరు మెద‌ప‌వు. ఈ ప్రాజెక్టుల మూలంగా తెలంగాణ‌కు జ‌ర‌గ‌బోయే మేలు గురించి చ‌ర్చించ‌వు. త‌మ ప‌త్రిక‌ల ద్వారా ప్ర‌జ‌ల‌కు వివ‌రించ‌వు. ఎవ‌రో అనామ‌కుడు తెలంగాణ ప్రాజెక్టుల మీద కేసు వేసినా .. దానికి చిన్న స్టే వ‌చ్చినా తెలంగాణ ప్ర‌భుత్వానికి చెంప‌పెట్టు అనే ఈ మీడియా ఆంధ్రాలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఏది జ‌రిగినా ఆంధ్రా అభివృద్దిని అడ్డుకుని చంద్ర‌బాబును ఇబ్బంది పెడుతున్నార‌ని క‌ట్టుక‌థ‌లు అల్లుతుంది.

స‌మైక్య‌పాల‌న‌లో తెలంగాణ వ్య‌వ‌సాయం అంతా బోరుబావుల మీద ఆధార‌ప‌డే దుస్థితి క‌ల్పించాయి 60 ఏండ్లు రాష్ట్రాన్ని ఏలిన ప్ర‌భుత్వాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన వెంట‌నే పెండింగ్ ప‌నుల‌ను పూర్తి చేసి పాల‌మూరు, న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం, వరంగ‌ల్, మెద‌క్, నిజామాబాద్, క‌రీంన‌గ‌ర్ త‌దిత‌ర జిల్లాల‌లో సాగు నీరు అందించింది ప్ర‌భుత్వం. పాల‌మూరు జిల్లాలో వెన‌క‌బ‌డ్డ న‌డిగ‌డ్డ (గ‌ద్వాల‌, అలంపూర్) ప్రాంతాలు ఆర్డీఎస్ ద్వారా నీళ్లు రాక రైతాంగం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ నేప‌థ్యంలో తుమ్మిళ్ల ఎత్తిపోత‌ల‌తో ఆర్డీఎస్ రైతాంగానికి న్యాయం చేసే ప్ర‌య‌త్నంతో పాటు తాజాగా గ‌ట్టు ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ శ్రీ‌కారం చుట్టారు. ఈ సంధ‌ర్భంగా తెలంగాణ‌కు, న‌డిగ‌డ్డ‌కు స‌మైక్య‌రాష్ట్రంలో జ‌రిగిన అన్యాయాన్ని కేసీఆర్ ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తే .. రైతుబంధు ప‌థ‌కం కౌలు రైతుల‌కు ఇవ్వాల‌న్న అంశం గురించి వివ‌ర‌ణ ఇస్తూ కిరాయిదారుడు ఎన్న‌టికీ య‌జ‌మాని కాలేడు .. కౌలు రైతుకు రైతుబంధు ప‌థ‌కం వ‌ర్తింప‌చేయ‌లేం అని చెప్పిన ఒక అంశానికి ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ ప్ర‌జ‌లు, ముఖ్యంగా భూమిలేని రైతులు కేసీఆర్ ప‌ట్ల త‌ప్పుడు ఆలోచ‌న‌ను ఏర్ప‌ర‌చుకునే విధంగా ఈనాడు దిన‌ప‌త్రిక మొద‌టిపేజీలో ఈ వార్త‌ను ప్ర‌చురించి అస‌లు ఆ రోజు శంకుస్థాప‌న చేసిన గ‌ట్టు ఎత్తిపోత‌ల ప‌థ‌కం ఉప‌యోగాన్ని వివ‌రించ‌కుండా ప‌క్క‌దారి ప‌ట్టించింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రాన్ని నంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నారు. నాలుగేండ్లలోనే తెలంగాణ ఇంతగా అభివృద్ధి చెందడం గొప్ప విషయం. దూరదృష్టితో ప్రారంభించిన అద్భుతమైన పథకాలు, పారిశ్రామిక విధానం.. దేశానికి ఆదర్శంగా నిలిచాయి. మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ, రైతుబంధు, ఆసరా పెన్షన్లు, అందరికీ ఇండ్లు, నిరంతర విద్యుత్ పంపిణీ వంటి పథకాలు అమోఘం. ఖాయిలాపడ్డ బిల్ట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణకు సహకరిస్తాం, ఇందుకు గల అవకాశాలను కచ్చితంగా పరిశీలిస్తాం నిన్న తెలంగాన ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ ఐటీసీ చైర్మన్ ఐ సీ దేవేశ్వర్ తెలంగాణ ప్ర‌భుత్వం మీద‌, కేసీఆర్ పాల‌న మీద‌, మంత్రిగా కేటీఆర్ విజ‌యాల మీద ప్ర‌శంస‌ల జ‌ల్లు కురింపించారు. దేశంలోనే ఐటీసీ అతి పెద్ద కంపెనీల‌లో ఒక‌టి. ఈ ఆంధ్రా మీడియాలో ఎక్క‌డా ఈ వార్త‌కు ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. ఏదో నామ‌మాత్రంగా లోప‌లి పేజీల‌లో ప‌డేశారు. ఇదే ఐటీసీ చైర్మ‌న్ ఆంద్రాలో ప‌ర్య‌టించి చంద్ర‌బాబుతో భేటీ అయిన‌ట్లు తెలిసినా ఈ ప‌త్రిక‌లు ఆయ‌న అనేవి, అన‌నివి క‌లిపి చంద్రబాబును ఆకాశానికెత్తి వార్త‌లు రాసేవారు.

నిత్యం ఆంధ్రా వార్త‌ల‌ను తెలంగాణ ఎడిష‌న్ల‌లో ప్ర‌చురిస్తూ త‌మ పైత్యాన్ని ప్ర‌ద‌ర్శించే ఆంధ్రా పత్రిక‌లు మొన్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ‌మ్మ మొక్కు తీర్చుకునేందుకు ఆంధ్రాకు వెళ్తే ఆ ప‌ర్య‌ట‌న‌ను ఆంధ్రా ఎడిష‌న్ల‌లో అప్రాధాన్యంగా సింగిల్ కాల‌మ్ వార్త‌ల్లో ప్ర‌చురించారు. తెలంగాణ ప్ర‌భుత్వం గ‌త నాలుగేళ్లుగా అమ‌లు చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ది ప‌థ‌కాలు ఆంధ్రా ప్ర‌జ‌ల మ‌న‌సులు చూర‌గొంటున్నాయి. కేసీఆర్ ఛ‌రీష్మా ఆంధ్రాలో బాగా పెరిగిపోయింది. అదే ఈ మీడియాకు రుచించ‌డం లేదు. ఇక కేసీఆర్ వార్త‌లు గానీ ఆంధ్రా ఎడిష‌న్ల‌లో ప్ర‌చురిస్తే రాబోయే ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఇచ్చే పిలుపుకు ఆక‌ర్షితుల‌య్యే ఆంద్రా ప్ర‌జ‌లతో చంద్ర‌బాబుకు న‌ష్టం త‌ప్ప‌ద‌ని భావించి ఈ కుట్ర‌ల‌ను కొన‌సాగిస్తున్నారు.

తెలంగాణ వ‌స్తే పాల‌న చేత‌గాక ప్ర‌జ‌లు ప్ర‌భుత్వాన్ని చీద‌రించుకుంటార‌ని, ఎందుకు రాష్ట్రం విడిపోయిందా .. ఎందుకు తెలంగాణ కోసం పోరాటం చేశారు అని కేసీఆర్ ను ప్ర‌జ‌లు నిల‌దీసే రోజులు రాక‌పోతాయా అని ఆంధ్రా మీడియా, ఆంధ్రా పెట్టుబ‌డిదారి వ‌ర్గం, ఆ పెట్టుబ‌డిదారి వ‌ర్గం మోచేతి నీళ్లు తాగే తెలంగాణ రాజ‌కీయ నాయ‌కులు ఎదురు చూశారు. వారి ఆశ‌ల మీద నీళ్లు చ‌ల్లుతూ, వాళ్ల కుట్ర‌లు చేధిస్తూ అన్ని రంగాల‌లో తెలంగాణ‌ను జాతీయ స్థాయిలో ఉన్న‌త స్థానంలో నిల‌బెట్టిన కేసీఆర్ విజ‌యాలు ఈ ఆంధ్రా మీడియాకు రుచించ‌డం లేదు. అందుకే తెలంగాణ‌లో అల‌జ‌డి సృష్టించేందుకు విప‌క్షాల‌తో స‌మానంగా త‌మ పాత్ర పోషిస్తున్నాయి. ఈ మీడియా ప‌ట్ల తెలంగాణ స‌మాజం ఎంతో జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. విజ్ఞుల‌యిన తెలంగాణ ప్ర‌జ‌లు దీనిని గ‌మ‌నిస్తార‌నే భావిద్దాం.

సందీప్ రెడ్డి కొత్త‌ప‌ల్లి

(Visited 269 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *