కుక్క‌తోక .. రాధాకృష్ణ‌

కుక్క‌తోక .. రాధాకృష్ణ‌

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో నాలుగేండ్ల అవినీతి, అస‌మ‌ర్ధ పాల‌న‌తో ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మైలేజీ పాతాళానికి అడుగంటిపోయింది. త‌న‌ను తాను పెద్ద మేధావిగా, సాంకేతిక నిపుణుడిగా ఊహించుకునే చంద్ర‌బాబు నాయుడు ఈ ప్ర‌పంచానికి సాంకేతిక‌త‌ను ప‌రిచ‌యం చేసింది తానేన‌న్న భ్ర‌మ‌ల్లో ఉంటాడు. అయితే ఆయ‌న అడుగుల‌కు మ‌డుగులొత్తే మీడియా కూడా అయ‌న అధికారంలో ఉన్న ప్ర‌తిసారి ఆయ‌న ఏది చేసినా రైట్ అన్న భ్ర‌మ‌ల్లోనే ఉంచుతుంది. జ‌నం ఈడ్చిత‌న్ని ఓడిస్తే .. కొన్నాల్లు ఆగి చంద్ర‌బాబును ఓడించి త‌ప్పు చేశామ‌ని ప్ర‌జ‌లు ప‌శ్చాత్తాప ప‌డుతున్నార‌ని ఈ మీడియా ప్ర‌చారం చేస్తుంది. అంతే కానీ ఎన్న‌డు కూడా చంద్ర‌బాబు నాయుడు త‌న త‌ప్పిదాల‌ను స‌మీక్షించుకునే అవ‌కాశం ఈ మీడియా ఇవ్వ‌దు. ఈ దేశంలో, ఈ ప్ర‌పంచంలో ఏం జ‌రిగిన ఆంద్రాలోని అమ‌రావ‌తికి, చంద్ర‌బాబుకు అంట‌గ‌ట్టి వార్త‌ను వండి వ‌డ్డించ‌డం ఈ మీడియా విధి. ఈనాడుకు ఈ జాడ్యం ఎక్కువ‌గా ఉండేది. ఇప్ప‌టికీ దానికి ఆ రోగం ఉంది. అయితే ఈ సారి ఆంధ్రాలో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఆంధ్ర‌జ్యోతి ఎడిట‌ర్ రాధాకృష్ణ‌కు ఆ రోగం గ‌జ్జిని మించిన రోగంగా అంటుకుంది.

గ‌త నాలుగేల్లుగా ఆంధ్ర‌లో చంద్ర‌బాబు నాయుడు కేంద్రం నుండి అనేక రూపాల‌లో నిధులు దండుకుని అవినీతికి పాల్ప‌డి అందినంత వెన‌కేసుకోవ‌డం త‌ప్ప అభివృద్ది విష‌యంలో అడుగుముందుకు తీసుకెళ్లింది లేదు. గ‌త నాలుగేళ్లుగా ఆంధ్రాలో చంద్ర‌బాబు పాల‌న‌ను, కేంద్రంలో మోడీ పాల‌న‌ను ఆహా ఓహో అని జ‌య‌జ‌య‌ద్వానాలు చేసిన ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ తాజాగా చంద్ర‌బాబు నాయుడు మోడీతో తెగ‌దెంపులు చేసుకుని బీజేపీకి దూరంకావ‌డంతో ఆంద్రాలో స‌క‌ల అన‌ర్ధాల‌కు కేంద్రంలోని బీజేపీ అని బూచిగా చూపి చంద్ర‌బాబుకు ఏ సంబంధం లేద‌ని క‌ల‌రింగ్ ఇచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ప్ర‌త్యేక‌హోదా వ‌ద్ద‌ని చంద్ర‌బాబు అన్న‌ప్పుడు నిజ‌మే బాబు చెప్పింది అని వార్త‌ల‌ను క‌థ‌లు, క‌థ‌లుగా వండి వార్చిన రాదాకృష్ణ‌, మ‌ళ్లీ ప్ర‌త్యేక హోదా అని బాబు అన‌గానే దానికి అనుకూలంగా క‌థ‌నాలు రాసిపెట్టాడు. ఆంధ్రాలో పాల‌న‌, ఎంత‌కాద‌న్న రాధాకృష్ణ చంద్ర‌బాబు భ‌క్తుడు, ఆ ప‌త్రిక మ‌నుగ‌డ‌, రాధాకృష్ణ బ‌తుకు టీడీపీ, చంద్రబాబు మీద‌నే ఆధార‌ప‌డి ఉన్నాయి కాబ‌ట్టి అది ఆయ‌నిష్టం.

కానీ ఆంధ్రాలో వైఫ‌ల్యాల‌కు, ఆంధ్రాకు ప్ర‌త్యేక‌హోదాకు తెలంగాణ‌కు, ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు ముడిపెట్టి క‌థ‌నాలు అల్ల‌డం చిల్ల‌ర‌వ్య‌వ‌హారంగా ఉంది. కొత్త‌ప‌లుకు పేరుతో ప్ర‌తివారం చెత్త‌ప‌లుకులు రాసుకుంటూ తెలంగాణ మీద విషం క‌క్కే రాధాకృష్ణ ఈ రోజు రాసిన ఎడిటోరియ‌ల్ చూస్తే రాధాకృష్ణ ఎంత దిగ‌జారిపోయాడు .. చంద్ర‌బాబు వైఫ‌ల్యాల‌ను ఎలా తెర‌మ‌రుగు చేయాల‌ని చూస్తున్నాడు .. ఆంధ్రా ప్ర‌జ‌ల‌ను ఎలా త‌ప్పుదారి ప‌ట్టించాల‌ని చూస్తున్నాడు .. తెలంగాణ‌లో ఎలా విష‌బీజాలు నాటాల‌ని అనుకుంటున్నాడు అన్న‌ది స్ప‌ష్టంగా బోధ‌ప‌డుతుంది. ఈ క‌థ‌నంలో రాధాకృష్ణ జొప్పించిన కొన్ని వ్యాఖ్య‌లు మ‌రీ ఆశ్చ‌ర్యం క‌లిగిస్తాయి.

తెలంగాణ ముఖ్య‌మంత్రిని ద‌గ్గ‌ర‌కు తీసుకుని మోడీ తెలివిగా చంద్ర‌బాబును కేసీఆర్ ను క‌ల‌వ‌కుండా విభ‌జించి పాలించు సిద్దాంతంతో ముందుకు వెళ్తున్నాడ‌ని పేర్కొంటాడు. ఇది కేసీఆర్ కే న‌ష్ట‌మ‌ని, చంద్ర‌బాబుతో కేసీఆర్ క‌లిసి రావాల‌ని అంటాడు. చంద్ర‌బాబు మోడీతో విడిపోవాలి అనుకున్న‌ప్పుడు మోడీ అలా చేస్తే నీవు జ‌గ‌న్ కు అధికారం అప్ప‌గించిన‌ట్లేన‌ని అంటే మీతో ఉంటేనే అధికారం జ‌గ‌న్ కు పోతుంద‌ని చంద్ర‌బాబు చెప్పార‌ని రాధాకృష్ణ రాసేశాడు. నీతి అయోగ్ మీటింగుకు వెళ్లిన చంద్ర‌బాబును ఆల్ ఈజ్ వెల్ అని మోడీ అడిగితే ఆల్ ఈజ్ నాట్ వెల్ అని చంద్ర‌బాబు అన్నార‌ని, దానికి మోడీ చంద్ర‌బాబు వీపు మీద గ‌ట్టిగా కొట్టాడ‌ని, ఆ దెబ్బ గ‌ట్టిగా త‌గ‌ల‌డంతో త‌న మీద మోడీకి ఎంత కోపం ఉందో చంద్ర‌బాబు త‌న స‌హ‌చ‌రుల‌కు చెప్పుకున్నాడ‌ని రాధాకృష్ణ ఈ క‌థ‌నంలో పేర్కొన్నాడు.

అస‌లు చంద్ర‌బాబు నాయుడు ఆంధ్రాలో అధికారంలోకి వ‌చ్చిందే అభివృద్ది నినాదంతో కానీ కేంద్రం ఇచ్చిన నిధుల‌న్నీ తాత్కాలిక ప‌థ‌కాల‌కు, అవినీతికి అవ‌కాశం ఉన్న వాటికి వాడుకుని కేంద్రం ఇచ్చిన నిధుల‌కు లెక్క‌లు అడుగుతుంటే అవి చెప్ప‌కుండా న‌న్నే లెక్క‌లు అడుగుతారా అంటూ త‌ప్పించుకు తిరుగుతున్న చంద్ర‌బాబు వ్య‌వ‌హారం గురించి నిల‌దీయ‌కుండా, నిజాలు బ‌య‌ట‌పెట్ట‌కుండా రాధాకృష్ణ కాక్ అండ్ బుల్ స్టోరీలు చెప్ప‌డం విడ్డూరంగా ఉంది. బాబు వైఫ‌ల్యాల‌ను తెలంగాణ‌కు, కేసీఆర్ కు అంట‌గ‌ట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం మ‌రీ దారుణం. కుక్క‌తోక వంక‌ర అన్న‌ట్లు తెలంగాణ విష‌యంలో ఎప్పుడూ విషం క‌క్కే రాధాకృష్ణ త‌న వెన‌క‌టి గుణాన్ని మాత్రం మానుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. ఇలాంటి వారిని ప‌క్క‌న‌పెట్టుకుని చంద్ర‌బాబు త‌న‌నెత్తిన తానే భ‌స్మాసుర‌హ‌స్తాన్ని ఉంచుకుంటున్నాడు.

 

 

(Visited 507 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *