పాత చెప్పునే నెత్తికెత్తుకుంటున్నారు

పాత చెప్పునే నెత్తికెత్తుకుంటున్నారు

ఏ దిక్కూ లేకుంటే అక్క‌మొగుడే దిక్క‌ని మోటు సామెత‌. తెలంగాణ‌లో ఉన్న ప‌దిమంది నాయ‌కులు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం, పీసీసీ అధ్య‌క్ష్య పీఠం కోసం కొట్టుకోవ‌డ‌మే స‌రిపోయింది. ఉన్నోళ్లు స‌రిపోలేదు .. ఏదో ఊడ‌బొడుస్తాడ‌ని ఓటుకునోటు దొంగ రేవంత్ రెడ్డిని కూడా కాంగ్రెస్ ప‌డ‌వ‌లోకి ఎక్కించుకున్నారు. ఎక్కి ఏడాది తిరగ‌క ముందే న‌న్ను ప‌ట్టించుకోవ‌డం లేదు .. నా సేవ‌లు వాడుకోవ‌డం లేద‌ని రేవంత్ రెడ్డి రాగాలు తీస్తున్నాడు. ఇక ఆంధ్రాలో అడుగంటిపోయిన కాంగ్రెస్ పార్టీని తిరిగి నిల‌బెట్టాల‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తున్న కాంగ్రెస్ క‌న్ను మాజీ ముఖ్య‌మంత్రి, స‌మైక్యాంద్ర పార్టీ పెట్టి ఎన్నిక‌ల‌కు వెళ్లి క‌నుమ‌రుగ‌యిన కిర‌ణ్ కుమార్ రెడ్డి మీద ప‌డింది.

ఇటీవ‌లే ఆంధ్ర‌ప్ర‌దేశ్ కాంగ్రెస్ వ్య‌వ‌హారాల ఇంఛార్జిగా నియ‌మించ‌బ‌డ్డ ఉమెన్ చాందీ కొన్నాల్లుగా కిర‌ణ్ ను పార్టీలోకి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. ఈ రోజు కొంద‌రు కాంగ్రెస్ నేత‌ల‌తో క‌లిసి ఆయ‌న‌ను క‌ల‌వ‌డం కూడా జ‌రిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకే కాకుండా, యావత్ దేశానికే కీలక సమయం. విభేదాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరూ దేశం కోసం ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్ ను వీడిన నేతలందరినీ మళ్లీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం అని ఉమెన్ చాందీ అన్నారు. అయితే తాను కాంగ్రెస్ చేరుతున్నాన‌ను అనేది కేవ‌లం వార్త‌లేన‌ని, స‌మ‌యం వ‌చ్చిన‌ప్పుడు అన్ని చెబుతాను అని కిర‌ణ్ కుమార్ రెడ్డి అన్నారు.

2009లో వైఎస్ మ‌ర‌ణం త‌రువాత రోశ‌య్య స్థానంలో కొత్త‌వారిని, స‌మ‌ర్ధుడిని ముఖ్య‌మంత్రిని చేయాల‌నుకున్న కాంగ్రెస్ అధిష్టానం అనూహ్యంగా కిర‌ణ్ కుమార్ రెడ్డిని ముఖ్య‌మంత్రిని చేసింది. తెలంగాణ ఉద్య‌మాన్ని అణ‌చేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసి విఫ‌లం అయిన కిర‌ణ్ కాంగ్రెస్ ను ముంచ‌డంలో మాత్రం స‌ఫ‌ల‌మ‌య్యాడు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింద‌న్న కోపంతో స‌మైక్యాంధ్ర పార్టీ పెట్టి జోడు చెప్పుల గుర్తుతో ఎన్నిక‌ల‌కు వెళ్లిన కిర‌ణ్ కుమార్ రెడ్డి స్వ‌యంగా తాను ఓడ‌డ‌మే కాకుండా, కాంగ్రెస్ ఒక్క స్థానంలో గెల‌వ‌కుండా నిండాముంచాడు. తెలంగాణ వ‌స్తే తెలంగాణ క‌రంటు లేక చీక‌ట్లో మ‌గ్గాలి అన్న కిర‌ణ్ ఆ త‌రువాత క‌నిపించ‌కుండా క‌నుమ‌రుగు అయ్యాడు. కాంగ్రెస్ ను ఆంద్ర‌లో క‌నుమ‌రుగు చేసిన పాత‌చెప్పునే ఇప్పుడు నెత్తికి ఎత్తుకుంటున్నార‌ని కాంగ్రెస్ వ‌ర్గాలు చెవులు కొరుకుంటున్నాయి.

(Visited 247 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *