హ‌ర‌గోపాల్ గారి నిదుర‌లేని రాత్రులు !

హ‌ర‌గోపాల్ గారి నిదుర‌లేని రాత్రులు !

రాజ‌శేఖ‌ర్ రెడ్డి లాంటి రాయ‌ల‌సీమ రాజకీయాల నుండి వ‌చ్చినాయ‌న‌ అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తి రోజూ ఉద‌యం త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన వారిని ఖ‌చ్చితంగా క‌లుసుకునేవారు. నిజానికి ఈ చ‌ర్చ ఇలా జ‌ర‌గ‌డానికి, చ‌ర్చ‌లో ఉద్రిక్త‌త‌ల‌కు ప్ర‌జాస్వామ్య ప‌రిస్థితులు తెలంగాణ‌లో లేక‌పోవ‌డం కార‌ణం. ఈ నాలుగేళ్ల‌లో ఈ ప‌రిస్థితి లేక‌పోవ‌డం మూలంగా చాలా మంది ఈ వేదిక మీద చెప్పుకుంటున్నారు. ఉద్య‌మ‌నేత ముఖ్య‌మంత్రి అయ్యారు. కానీ క‌రీంన‌గ‌ర్ గ‌డీ సంస్కృతిని న‌డిపిస్తున్నారు. ఎవ‌రొచ్చినా వారు చెప్పే మాట‌లు వినాల‌ని ముఖ్య‌మంత్రికి చెబుతున్నాను. ఓ ప్రైవేటు టీవీ ఛాన‌ల్ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ అన్న మాట‌లివి. నిజంగా ఆయ‌న మాట‌లు పూర్తిగా వింటే ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలి అన్న దానికంటే కేసీఆర్ త‌మ‌ను క‌ల‌వ‌లేదు ..త‌మ అడుగుల‌లో న‌డిచే సంఘాల‌ను క‌ల‌వ‌డం లేదు అన్న ఆవేద‌న‌, ఆగ్ర‌హం ప్ర‌స్పుటంగా క‌నిపించింది.

అస‌లు చ‌ర్చ‌ను మొద‌లుపెడుతూ వైఎస్ లాంటి వ్య‌క్తే మ‌మ్మ‌ల్ని క‌లిశాడు అని చెప్పుకోవ‌డం ఆశ్చ‌ర్య‌క‌రం. అదే స‌మ‌యంలో అదే వైఎస్ స్థానంలో ఈ రోజు ముఖ్య‌మంత్రిగా ఉన్న కేసీఆర్ క‌ల‌వ‌లేదు అని చెప్ప‌డం కంటే వైఎస్ స్థాయి క‌న్నా కేసీఆర్ స్థాయి చిన్న‌ది అనే భావ‌న ఆయ‌న మాట‌ల‌లో దొర్లింది. అదే స‌మ‌యంలో ఉద్యోగ‌, ఉపాధ్యాయ, కుల, విద్యార్థి సంఘాల‌ను కేసీఆర్ క‌ల‌వ‌డం లేదు అన్న‌ది హ‌ర‌గోపాల్ గారి వాద‌న‌. వైఎస్ హ‌యాంలో ప్ర‌జాద‌ర్భార్ పేరుతో ప్ర‌తి ఉదయం జ‌రిగే ప్ర‌జ‌ల‌ను క‌లిసే తంతులో 99 శాతం మంది అక్క‌డికి వ‌చ్చేది ఆరోగ్య‌శ్రీ‌, ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి నుండి సాయం అభ్య‌ర్థించ‌డం కోసం మాత్ర‌మే అన్న‌ది వంద శాతం నిజం. మిగిలిన ఒక శాతం హ‌ర‌గోపాల్ గారు చెబుతున్న వివిధ సంఘాల నేత‌లు, వ్య‌క్తిగ‌త అవ‌స‌రాలు, పైర‌వీల కోసం వ‌చ్చిన వారు అన్న‌ది ప‌చ్చి నిజం. మ‌రి కేవ‌లం ఆరోగ్య‌శ్రీ‌, ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి అవ‌సరాల కోసం రాష్ట్రంలోని ప్ర‌జ‌లు హైద‌రాబాద్ లోని ముఖ్య‌మంత్రి ఇంటి ముందుకు రావాల్సిన అవ‌స‌రం, అఘాయిత్యం కోరుకోవ‌డం ఎంత‌వ‌ర‌కు స‌మంజ‌సం.

గ‌త స‌మైక్య రాష్ట్రంలో అందిన ముఖ్య‌మంత్రి స‌హాయ‌నిధి, ఆరోగ్య‌శ్రీ స‌హాయాల‌కంటే అధికంగా తెలంగాణ రాష్ట్రంలో అందుతున్న‌ది వాస్త‌వం. ఇప్పుడు ఏ అభాగ్యుడు ముఖ్య‌మంత్రి స‌హాయనిధి కోసం హైద‌రాబాద్ రావాల్సిన అవ‌స‌రం స్థానికంగా త‌మ స‌ర్పంచ్ నుండి ఎమ్మెల్యే వ‌ర‌కు ఎవ‌రికి ధ‌ర‌ఖాస్తు ఇచ్చినా తిరిగి నేరుగా వారి ఇంటి వ‌ద్ద‌కు, లేదా స్థానిక నేత వ‌ద్ద‌కు చెక్కులు వ‌స్తున్నాయి. అధికార‌ప‌క్షమే కాదు ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు ప్ర‌తి రోజు చెక్కుల‌ను సంబంధిత ల‌బ్ధిదారుల ఇళ్ల వ‌ద్ద‌కే వెళ్లి ఇస్తున్నారు. ఇది గ‌మ‌నించాల్సిన విష‌యం. ఇక‌పోతే ఉద్యోగ‌సంఘాల మూలంగానే స‌మ‌స్య‌లు ప‌రిష్కారం కావాలి అన్న నిబంధ‌న ఏం లేదు. చాలా సంఘాల నేత‌లు ఈ ప‌ద‌వుల‌ను పైర‌వీల‌కు, త‌మ రాజ‌కీయ భ‌విష్య‌త్ కు వాడుకుంటున్నారు అన్న‌ది నిష్టుర స‌త్యం. ప్ర‌భుత్వ‌మే స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని ప‌రిష్కారాల‌ను వెతుకుతున్న‌ప్పుడు ఈ సంఘాల‌తో చ‌ర్చ‌లు, వాద‌న‌లు స‌మ‌యం వృధాకే త‌ప్ప మ‌రేం కాదు. ప్ర‌తీ సారీ పీఆర్సీ అంటే సంఘాలు వెళ్లాలి. ముఖ్య‌మంత్రి వారితో మాట్లాడాలి. వీరు 60 శాతం అడుగుతారు .. ముఖ్య‌మంత్రి 20 అంటారు. కాదు 45కు త‌గ్గం అని ఉద్యోగ సంఘాలు లేచిరావాలి. మ‌రుస‌టి రోజు ముఖ్య‌మంత్రి మంత్రుల బృందాన్ని పంపాలి. ముఖ్య‌మంత్రి 30 అంటారు. వీరు ఆఖ‌రుకు 33 అని అంటే ముఖ్య‌మంత్రి ఓకె చెబితే ప‌ట్టుబ‌ట్టి సాధించాం అని సంబ‌రాలు చేసుకోవాలి. అనాదిగా వ‌స్తున్న ఆచారం అన్న‌ట్లు ఈ ప్ర‌హ‌స‌నం ఎందుకు ? అవ‌స‌ర‌మా ? అన్న‌ది గ‌మ‌నించాలి. వాస్త‌వంగా ఇంత ఇస్తే చాలు అని ప్ర‌తి ఉద్యోగికి ఉంటుంది. దానికన్నా ఒక‌శాతం ఎక్కువ ఇస్తే సంబ‌ర‌ప‌డ‌తారు. దానికి ఓ లేఖ‌ను ప్ర‌భుత్వానికి రాస్తేనే .. ఇస్తేనో స‌రిపోతుంది. ప్ర‌భుత్వం దాన్ని గ‌మ‌నించి ఆమోదిస్తే స‌రిపోతుంది. ఇలాంటి స‌మ‌స్య‌ల కోసం ముఖ్య‌మంత్రి సంఘాల‌ను క‌ల‌వ‌డం ఎందుకో హ‌ర‌గోపాల్ లాంటి పెద్ద‌వారికే తెలియాలి.

ఈ విష‌యం ప‌క్క‌న పెడితే కేజీ టు పీజీ ఉచిత విద్య గురించి మాట్లాడారు. ఈ సంధ‌ర్భంగా ప్ర‌భుత్వ ఉద్యోగుల పిల్ల‌లు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌లోనే చ‌ద‌వాలి .. చ‌దివించ‌కుంటే ఆ చ‌దివించ‌ని వారి పిల్ల‌ల‌కు ప్రైవేటులో ఎంత ఫీజు క‌డుతున్నారో ఆ మొత్తం ప్ర‌భుత్వ స్కూళ్ల‌లో ఖ‌ర్చుపెట్టాలి అని అల‌హాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకించారు ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్. అదే స‌మ‌యంలో ఆ వేదిక మీద‌, వేదిక కింద ఎంత మంది త‌మ పిల్ల‌ల‌ను ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌లో చ‌దివించారు ? చ‌దివిస్తున్నారు ? అని అడిగి అక్క‌డే తెలుసుకుంటే హ‌ర‌గోపాల్ గారి వాద‌న‌కు, హైకోర్టు తీర్పుకు మ‌ద్ద‌తు .. బ‌య‌ట ఒక‌టి .. లోప‌ల ఒక‌టి చెప్పేవాళ్ల వ్య‌వ‌హారం బ‌య‌ట‌ప‌డేది.

అదే స‌మ‌యంలో కేజీ టు పీజీ అని చెప్పి ప్ర‌భుత్వం ఒక విధానం ప్ర‌క‌టించ‌లేదు. 550 గురుకులాలు పెడితే ల‌క్ష‌న్న‌ర మంది పిల్ల‌ల‌కు సీట్లు వ‌స్తాయి. మిగ‌తా వాళ్లు తెలంగాణ వాళ్లు కారా ? ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల‌ను ఎత్తేస్తున్నారు అని ప్ర‌శ్నించారు. గ‌త 60 ఏండ్ల‌లో 200 పైచిలుకు గురుకులాలు ఉంటే ఈ నాలుగేళ్ల‌లో 550 కొత్త‌గా తెరిచారు అంటేనే ప్ర‌భుత్వ చిత్త‌శుద్ది ఏంటో గ‌మ‌నించాలి. ఇక ఇద్ద‌రు, న‌లుగురు ఉన్న పాఠ‌శాల‌ల‌లో ఇద్ద‌రేసి ఉపాధ్యాయులను పెట్టి న‌డిపించ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బో హ‌ర‌గోపాల్ లాంటి పెద్ద‌లే సెలవియ్యాలి. ఇక జ‌పాన్, చైనా, కొరియా దేశాల విద్యావిధానం 20 నుండి 30 శాతం విద్య‌మీద‌నే ఖ‌ర్చు పెడుతున్న విష‌యాన్ని గుర్తు చేశారు. దేశంలోని 29 రాష్ట్రాల‌లో కొత్త‌గా ఏర్ప‌డిన తెలంగాణ రాష్ట్రంలో గ‌త నాలుగేళ్లుగా విద్యావిధానంలో వ‌స్తున్న మార్పుల‌ను ప్ర‌శంసించ‌కుండా జ‌పాన్, చైనా, కొరియా దేశాల గురించి మాట్లాడ‌డం .. ఆ దేశాల నిర్ణ‌యాల‌ను ఇక్క‌డి రాష్ట్ర ప్ర‌భుత్వంతో ముడిపెట్ట‌డం భావ్యం కాద‌నే చెప్పాలి. ఇక 1986 నుండి మేము దేశ‌వ్యాప్తంగా చేసిన పోరాటం మూలంగా కేసీఆర్ కేజీటుపీజీ విద్య అన్నాడ‌ని, అదే విష‌యం తాము ఇత‌ర రాష్ట్రాల‌లో, జాతీయ స‌ద‌స్సులో చెప్పుకున్నామ‌ని హ‌ర‌గోపాల్ అన్నారు. మ‌రి 1986 నుండి 2014 వ‌ర‌కు ఏ ముఖ్య‌మంత్రిని ఈ విష‌యంలో ఎందుకు ఒప్పించ‌లేదన్న‌ది హ‌ర‌గోపాల్ గారే సెల‌వియ్యాలి.

అదే స‌మ‌యంలో భూమినే న‌మ్ముకుని బ‌తుకులీడుస్తున్న రైతాంగం వ్య‌వ‌సాయ సంక్షోభంలో కూరుకుపోయిన నేప‌థ్యంలో నైరాశ్యంలో ఉన్న ప‌రిస్థితుల‌లో ఏడాదికి రూ. 25 వేల కోట్లు కేటాయించి సాగునీటి ప్రాజెక్టుల‌ను శ‌ర‌వేగంగా నిర్మిస్తున్న‌ది, ఏండ్ల త‌ర‌బ‌డి గ‌త ప్ర‌భుత్వాలు ప‌నులు చేయ‌కుండా వ‌దిలేసిన పెండింగ్ ప్రాజెక్టుల‌ను పూర్తి చేసి సాగునీరు ఇస్తున్న విష‌యాన్ని గ‌మ‌నించ‌లేదా ? డిండి ప్రాజెక్టు క‌ట్టిన త‌రువాత తొలిసారి దేవ‌ర‌కొండ ప‌రిధిలోని చందంపేట మండ‌లానికి సాగునీళ్లు వ‌చ్చిన విష‌యం దృష్టికి రాలేదా ? క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల ప‌థ‌కం నుండి పాల‌మూరు జిల్లాలోని వ‌న‌ప‌ర్తి, నాగ‌ర్ క‌ర్నూలు, అచ్చంపేట‌, క‌ల్వ‌కుర్తి ప్రాంతాల‌కు నీళ్లు తీసుకురావ‌డం తెలంగాణ విజ‌యం కాదా అన్న‌ది తేల్చాలి. విద్య‌కు ప్రాధాన్యం ఇవ్వాల‌న‌డం స‌బ‌బే. అంత‌క‌న్నా ప్ర‌ధాన‌రంగం, ఎక్కువ‌మంది ఆధార‌ప‌డిన వ్య‌వ‌సాయ‌రంగానికి ఇన్ని వేల కోట్లు కేటాయించి ప‌నిచేస్తున్న రాష్ట్రం తెలంగాణ ఒక్క‌టే అన్న‌ది హ‌ర‌గోపాల్ లాంటి వారు ఎందుకు గుర్తించ‌లేక‌పోతున్నారు ?

చివ‌ర‌గా మాట్లాడుతూ ఓ ధ‌ర్నా చౌక్ ఎత్తేయ‌డం మూలంగానే ఈ స‌మ‌స్య‌లు బ‌య‌ట‌కు రావ‌డం లేద‌ని అన్నారు. తెలంగాణ వ‌చ్చిన‌ప్పుడు రాత్రంతా నిద్ర‌పోకుండా నిద్ర‌లేని రాత్రి అని వ్యాసం రాశాన‌ని, ఇప్పుడు తెలంగాణ వ‌చ్చాక‌, ఓ స్వ‌ప్నం సాకారం అయ్యాక మ‌రోసారి నిదుర‌లేని రాత్రి అనే వ్యాసం రాయ‌బోతున్నాన‌ని, దానికి తాను ఎంతో బాధ‌ప‌డుతున్నాన‌ని ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ గారు అన్నారు. సుధీర్ఘకాలం ప్ర‌జాసంఘాల‌లో ప‌నిచేసి ఎన్నో ప్ర‌భుత్వాల‌ను చూసి చేధు అనుభ‌వాలు మిగుల్చుకున్న వారు .. ఏనాడు ప్ర‌జ‌ల సంక్షేమం కోసం పాటుప‌డ‌ని ప్ర‌భుత్వాల‌ను గ‌మ‌నించిన వారు ఈ నాలుగేళ్ల‌లో తెలంగాణ సాధించిన విజ‌యాల‌ను గుర్తించ‌క‌పోవ‌డం విచార‌క‌రం. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ నాలుగేళ్ల‌లో అంద‌రినీ సంతృప్తి ప‌ర‌చ‌క‌పోవ‌చ్చు .. అలా సంతృప్తి ప‌ర‌చ‌డం ఏ ప్ర‌భుత్వానికి సాధ్యం కాదు అన్న‌ది హ‌ర‌గోపాల్ లాంటి వారికి తెలియ‌నిది కాదు. నాలుగేళ్ల‌లో తెలంగాణ విజ‌యాల‌ను ప్ర‌శంసించి .. వైఫ‌ల్యాల‌ను గుర్తించి   ప్ర‌భుత్వం ముందుకు తీసుకువ‌చ్చి న‌డిపిస్తేనే  ప్ర‌జ‌లు హ‌ర‌గోపాల్ లాంటి పెద్ద‌ల మాట‌ల‌ను స్వీక‌రిస్తారు అన్న‌ది నిజం. అలా కాకుండా ఎన్ని నిదుర‌లేని రాత్రులు గ‌డిపినా తెలంగాణ స‌మాజానికి ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌దు.

సందీప్ రెడ్డి కొత్త‌ప‌ల్లి

(Visited 395 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *