రైతుబంధుతో కొన్ని పార్టీలు దివాళా

రైతుబంధుతో కొన్ని పార్టీలు దివాళా

ఇది పక్కా రైతు పక్షపాత ప్రభుత్వం. రైతు సంక్షేమం కోరి రైతుబంధు, రైతుబీమా పథకం అమలు చేస్తున్నాం. రైతుబంధు ప‌థ‌కంతో కొన్ని రాజ‌కీయ పార్టీలు దివాళా తీశాయి. పేరుకే పెద్ద రైతు.. వెనక్కి తిరిగి చూస్తే అన్ని అప్పులే. రైతుకు కులం లేదు. ఎవరికి భూమి ఉంటే వారే రైతు. అందరికీ అన్నం పెట్టే రైతు చల్లగా ఉండాలి. రైతు క్షేమంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. రైతుబంధు పథకంతో రాష్ట్ర రైతాంగమంతా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి రైతుబీమా పథకం అమలు చేయబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. హెచ్‌ఐసీసీ వేదికగా రైతుబీమాపై ప్రభుత్వం, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్రసంగించారు.

ప్రపంచంలోనే అతి పెద్ద బీమా సంస్థ ఎల్‌ఐసీతో రైతుబీమా పథకం కోసం ఒప్పందం కుదుర్చుకోవడం సంతోషంగా ఉంది. తెలంగాణ రైతుల తరపున ఎల్‌ఐసీకి కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎల్‌ఐసీ చాలా నమ్మకమున్న సంస్థ అని సీఎం పేర్కొన్నారు. ఎల్‌ఐసీ విశ్వసనీయ, విస్తృతి ఉన్న సంస్థ అని కొనియాడారు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయసున్న రైతులందరికీ ఈ రైతుబీమా పథకం వర్తిస్తుందని, రైతు దురదృష్టవశాత్తు మరణిస్తే 10 రోజుల్లో పాలసీ క్లెయిమ్ అవుతుంది. ఆగస్టు 15లోపు పత్రాలన్నీ నింపి ఎల్‌ఐసీకి అందజేయాలని అన్నారు. వ్యవసాయ అధికారులు మాత్రమే రైతులకు బీమా పత్రాలు పూర్తి చేసి ఇవ్వాలి. నామినీ వివరాలను రైతులు చెప్పిన ప్రకారమే నింపాలి. రైతులు తమ పేరును పూర్తిగా రాయాలి. ఇంటిపేరు, పూర్తిపేరు, మహిళా రైతులు అయితే భర్త పేరు రాయాలి. వ్యవసాయ అధికారులకు ఐప్యాడ్‌లు అందజేస్తాం. రైతులందరి పేర్లు ఐప్యాడ్‌లలో ఉండాలి అని సూచించారు.

రైతులతో కలిసిమెలిసి ఉండి.. వారి ఇండ్లలోనే తినే పరిస్థితిరావాలన్నారు. డిమాండ్ ఉన్న పంటలనే పండించాలి. వరి నాటే యంత్రాలను సబ్సిడీపై అందజేస్తాం. వీలైనంత త్వరగా రైతు వేదికలను నిర్మించాలని ఆదేశించారు. రైతుల్లో ఐక్యత సాధించాలి. తెలంగాణ రైతాంగం తరపున ఒక మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారు. రైతుబంధు పథకంలో అధిక ఆదాయం ఉన్నవాళ్లను డబ్బులు తీసుకోవద్దని కోరాను .. నాతో పాటు చాలా మంది డబ్బులు తీసుకోలేదు. కానీ రైతుబీమా నేను తీసుకుంటా.. కచ్చితంగా అందరూ తీసుకోవాలని సీఎం సూచించారు. రైతుల కోసం బడ్జెట్‌లో పెట్టిన నిధులు రైతులకే ఖర్చు చేస్తామని స్ప‌ష్టం చేశారు.

రైతుబంధు పథకం అమలుతో రాష్ట్రంలో 89 శాతం మంది రైతులు సంతోషంగా ఉన్నారని హిందూ దినపత్రిక రిపోర్టు చేసిందని, రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులున్నరు. చిన్న, సన్నకారు రైతులకు లబ్ధి చేకూరిందని కేసీఆర్ వెల్ల‌డించారు. ఒకటి, రెండు ఎకరాలు ఉన్న రైతులు 32 లక్షల మంది ఉన్నారు. రైతుబంధు పథకంతో కొన్ని పార్టీలు దివాళా తీశాయన్నారు. రాష్ట్రంలో రెప్పపాటు కాలం కూడా విద్యుత్ కోత ఉండదన్నారు. నీళ్లు లేని చోట కొంత సమస్య వచ్చినా.. నీళ్లు ఉన్న చోట పంట బాగా వచ్చిందని గుర్తు చేశారు. వచ్చే ఏడాది జూన్ 19 దాటితో రైతు ఆకాశానికి ముఖం పెట్టి చూడడు అని పేర్కొన్నారు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా చెరువులు నింపుతున్నామని, 365 రోజులు ఈ ప్ర‌క్రియ కొనసాగుతుంద‌ని తెలిపారు.

రైతుల బాధలు చూడలేక ఎన్నోసార్లు ఏడ్చినం. రైతు సంక్షేమం కోరి రైతుబంధు, రైతుబీమా పథకం అమలు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు. రైతు పెట్టుబడి కోసం వెతుక్కునే దుస్థితి రావొద్దు. నాణ్యమైన కరెంట్.. కడుపునిండా నీళ్లు.. మద్దతు ధర ఉంటే రైతులకు ఎలాంటి కష్టాలురావు. పంటకు మద్దతు ధర నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

(Visited 120 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *