స‌క‌ల జ‌నుల సంక్షేమ‌మే తెలంగాణ‌

స‌క‌ల జ‌నుల సంక్షేమ‌మే తెలంగాణ‌

“సంపద సృష్టించాలి. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి’’ అనే సూత్రం ప్రాతిపదికగా తెలంగాణ ప్రభుత్వం పురోగమిస్తున్నది. సకలజనుల సంక్షేమానికి పాటుపడుతున్నది అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకల సందర్భంగా సీఎం ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను.

తెలంగాణ అవతరించి నేటికి నాలుగు సంవత్సరాలు. మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ నాలుగేళ్లలో బలమైన అడుగులు వేయగలిగాం. ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రణాళికలు సత్ఫలితాలనిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దారుణమైన అణచివేతకు, దోపిడీకి గురైంది. అన్ని రంగాల్లో తీవ్రమైన వెనుకబాటుతనం ఆవహించింది. బతుకుమీదనే ఆశను కోల్పోయేంతగా నిరాశ నిస్పృహలు ఆవరించాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తప్ప తమ తలరాత మారదనె వాస్తవం గ్రహించి, ఉవ్వెత్తున ఉద్యమించి స్వరాష్ట్రం సాధించుకున్నాం. ఈ క్రమంలో తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, కడగండ్లు, వాటి కారణాలు, పరిష్కారాలను స్పష్టంగా అర్థం చేసుకోగలిగాం.

ఆ ఆలోచన పునాదుల మీదనే మానిఫెస్టోను రూపొందించి, ఎన్నికల్లో ఘనవిజయం సాధించాం. ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచి మానిఫెస్టోలోని అంశాలను వెంటవెంటనే అమలు చేస్తున్నాం. విస్తృత ప్రజా ప్రయోజనం కలిగిన కొత్త పథకాలనెన్నింటినో ప్రవేశపెట్టా౦. ఒకవైపు ప్రజల్లో మానసిక స్థైర్యాన్ని కలిగిస్తూ, మరోవైపు నిరంతర ప్రగతిశీల రాష్ట్రంగా తెలంగాణ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా చేశాం. ఇది దశాబ్దాల కాలం మనం చేసిన పోరాటానికి దక్కిన సార్థకతగా నేను భావిస్తున్నాను. నేడు తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న విజయాలు తెలంగాణ బిడ్డలుగా మనందరికీ గర్వకారణాలు.

అనతికాలంలోనే రాష్ట్రం అద్భుత విజయాలను సాధించిందని చెప్పడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. దేశంలో మరే రాష్ట్రం అమలుచేయని ఎన్నో కార్యక్రమాలకు నాంది పలకడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది. పలు రాష్ట్రాల ప్రతినిధులు, అధికారులు ఇక్కడికి వచ్చి మన పథకాలు, కార్యక్రమాలను పరిశీలించి, ఆయా రాష్ట్రాలలో అమలుచేసేందుకు పూనుకోవడమే ఇందుకు నిదర్శనం. అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలకు తెలంగాణ రోల్ మోడల్ అనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతుండడం మనందరికీ గర్వకారణం. 21 శాతం ఆదాయాభివృద్ధి రేటు కలిగిన ధనిక రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది అని సీఎం పేర్కొన్నారు.

(Visited 35 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *