మొఖం చాటేసిన కాంగ్రెస్

మొఖం చాటేసిన కాంగ్రెస్

మ‌న ప‌క్కింట్ల ఏద‌యినా ఇబ్బంది అయితే వెళ్లి ఏం జ‌రుగుతుంద‌ని ఆరాతీస్తాం .. అవ‌స‌రం అయితే మ‌న‌కు చేత‌న‌యిన సాయం చేస్తాం .. మ‌న ఇంట్లో ఏద‌యినా శుభం జ‌రిగితే ఇరుగూ పొరుగూ పిలుచుకుని సంతోషాన్ని పంచుకుంటాం. మ‌న ప‌క్కిళ్లు ఆనందంగా ఉంటే మ‌న‌మూ ఆనందంగా ఉంటాం. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుల వ్య‌వ‌హారం మాత్రం ఊరంతా ఒక చింత ఉంటే ఊసుకండ్లోడికి దోమ‌ల చింత అన్న‌ట్లు ఉంది. గ‌త నాలుగేళ్లుగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాజెక్టుల చేప‌ట్టినా, సాగునీళ్లు ఇచ్చినా, మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ ఇప్పుడు రైతుబంధు ఏ ప‌థ‌కం చేప‌ట్టినా దానిని విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా కాంగ్రెస్ పార్టీ ప‌నిచేస్తున్న‌ది. ఫ‌లానా ప‌థ‌కంలో ఫ‌లానా మార్పులు, ఫ‌లానా ప‌థ‌కం బాగుంది అని నోరు తెరిచి చెప్పిన దాఖ‌లాలు లేవు.

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన వినూత్న ప‌థ‌కం రైతుబంధు చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మం తెలంగాణ వ్యాప్తంగా అట్ట‌హాసంగా కొన‌సాగుతుంది. 75 ఏళ్ల దేశ చ‌రిత్రలో ఎన్న‌డూ ఎక్క‌డా ఏ నాయ‌కుడు ఊహించ‌ని, ఆలోచించ‌ని ప‌థ‌కంతో నైరాశ్యంలో ఉన్న రైతులోకానికి వెన్నెముక‌గా నిలుస్తానంటూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంట‌ల పెట్టుబ‌డిని అందిస్తున్నారు. ఎక‌రాకు రూ.4 వేలు ఇస్తుండ‌డంతో వాటిని అందుకున్న రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అయితే ఈ రైతుబంధు చెక్కుల పంపిణీ కార్య‌క్ర‌మాల‌కు త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌లో మొక్కుబ‌డిగా ఒక‌సారి మాత్ర‌మే కాంగ్రెస్ నాయ‌కులు హాజ‌ర‌య్యారు. చిన్నారెడ్డి, డీకె అరుణ‌, సంప‌త్ కుమార్, జీవ‌న్ రెడ్డి, రామ్మోహ‌న్ రెడ్డి, చ‌ల్లా వంశీచంద్ రెడ్డిలు హాజ‌రుకాగా మిగ‌తా కాంగ్రెస్ నేత‌లు అస‌లు ప‌త్తాలేరు. ఇక స‌భ‌ల‌కు హాజ‌ర‌యిన వారిలో చిన్నారెడ్డి రైతులు తీసుకుంటున్న‌ది పాప‌పు సొమ్ము అన‌డంతో రైతులు తిర‌గ‌బ‌డే స‌రికి అక్క‌డి నుండి జారుకున్నారు. డీకె అరుణ త‌న‌కు ప్ర‌భుత్వం నుండి వ‌చ్చిన‌ చెక్కులు, ప‌ట్టాదారు పాసుబుక్కులు తీసుకుని ఎవ‌రి సొమ్ము, ఎవ‌రి ఇంట్ల కెళ్లి ఇస్తున్న‌రు అంటూ ప్ర‌భుత్వాన్ని, ముఖ్య‌మంత్రిని నిష్ఠూరాలాడుతూ మ‌ళ్లీ క‌నిపించ‌కుండాపోయింది. మిగ‌తా కాంగ్రెస్ నేత‌ల‌ది అదే వ్య‌వ‌హారం.

టీఆర్ఎస్ ప్ర‌జాప్ర‌తినిధులు, నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఈ చెక్కుల పంపిణీలో పాల్గొంటూ త‌మ‌కు వ‌చ్చిన చెక్కుల‌ను తిరిగి ప్ర‌భుత్వానికి అప్ప‌గిస్తున్నారు. రైతుబంధు చెక్కుల‌ను అందుకునేందుకు గ్రామాల‌కు వ‌చ్చిన ప్ర‌జ‌లు ఎండ‌లో ఇబ్బందులు ప‌డ‌కుండా టెంట్లు వేయించ‌డం, తాగునీరు, అంబ‌లి, మ‌జ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచ‌డ‌మే కాకుండా మ‌ధ్యాహ్న భోజ‌నం కూడా ఏర్పాటు చేసి ఏ లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నారు. కాంగ్రెస్ నాయ‌కులు మాత్రం అస‌లు ప‌త్తాకే లేకుండా పోయారు. ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయ రంగానికి ఆదెరువుగా నిలిచే మంచి ప‌థ‌కం ప్ర‌వేశ‌పెడితే దానికి మ‌ద్ద‌తు ప‌ల‌క‌కుండా .. రైతుబంధు పెద్ద రైతుల‌కు ఎందుకు ? కౌలు రైతుల ప‌రిస్థితి ఏంటి ? అంటూ కొర్రీలు పెడుతుంది. ప‌థ‌కాన్ని ప‌ల‌చ‌న చేసేందుకు విఫ‌ల య‌త్నాలు చేస్తుంది. అదే స‌మ‌యంలో త‌మ‌కు వ‌చ్చిన‌ రైతుబంధు చెక్కుల‌ను జేబులో వేసుకుని వెళ్తున్నారు కాంగ్రెస్ నేత‌లు.

ఎంత‌సేపు కాళ్ల సందులో క‌ట్టెలు పెట్టాల‌ని ప్ర‌య‌త్నించి తాము బొక్క‌బోర్లా ప‌డ‌డం త‌ప్పితే గ‌త నాలుగేళ్ల‌లో తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ఇన్ని వినూత్న ప‌థ‌కాల‌ను తెలంగాణ‌ను తాము పాలించిన 47 ఏండ్ల‌లో ఎందుకు ప్ర‌వేశ పెట్ట‌లేక‌పోయామ‌ని ఒక్క‌సారి అయినా ఆత్మ‌ప‌రిశీల‌న చేసుకున్న దాఖాలాలు కాంగ్రెస్ పార్టీలో క‌నిపించ‌దు. అధికారం .. ఓట్లు .. నోట్లు .. మ‌ళ్లీ అధికారం త‌ప్పితే స‌మాజంలోని వివిధ వ‌ర్గాల ప్ర‌జ‌ల అభ్యున్న‌తికి కృషిచేయాల‌న్ని క‌నీస ఆలోచ‌న కాంగ్రెస్ పార్టీలో క‌నిపించ‌దు. ప్ర‌జ‌లంతా ప్ర‌భుత్వ ప‌థ‌కంతో సంతోషంగా ఉంటే క‌నీసం వారి సంతోషాన్ని చూసే తీరిక కూడా కాంగ్రెస్ నేత‌ల‌కు లేదు. అయినా ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత మ‌ళ్లీ ఐదేళ్ల‌కు ప్ర‌జ‌ల‌కు మొఖం చూపే అల‌వాటున్న‌ కాంగ్రెస్ నేత‌లు ప్ర‌జ‌లు, రైతుల కండ్ల‌లో సంతోషం ఏం చూస్తారు.

 

 

(Visited 252 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *