విజ‌యాన్ని చూడ‌లేక‌ విషం కక్కుతున్నారు

విజ‌యాన్ని చూడ‌లేక‌ విషం కక్కుతున్నారు

నాలుగేళ్ల ప‌సిగుడ్డు తెలంగాణ అనేక కుట్ర‌ల‌ను చేధించి, అనేక స‌వాళ్ల‌ను అధిగ‌మించి, అనేక ఆంక్ష‌ల‌ను దాటుకుని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సార‌ధ్యంలో అనేక రంగాల‌లో విజ‌య‌బావుటా ఎగుర‌వేస్తుంది. దేశం దృష్టిని, ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించి అభినంద‌న‌లు అందుకుంటుంది. తెలంగాణ ప‌థ‌కాలు ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు ఆద‌ర్శం అవుతున్నాయి. తెలంగాణ ప‌థ‌కాలు అవ‌లంభిస్తామ‌ని ప‌లు రాష్ట్రాలు త‌మ త‌మ బృందాల‌ను తెలంగాణ‌కు పంపి అధ్య‌య‌నం చేయిస్తున్నాయి. అందులో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. కానీ తెలంగాణ విజ‌యాలు ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించినా ఆంధ్రా మీడియాను మాత్రం ఆక‌ర్షించ‌లేక‌పోతున్నాయి అన‌డం కంటే తెలంగాణ రాష్ట్ర విజ‌యాల‌ను ఈ ప‌త్రిక‌లు జీర్ణించుకోలేక‌పోతున్నాయి అన‌డం ఉత్త‌మం.

తెలంగాణ ఉద్య‌మంలో చివ‌రివ‌ర‌కు శ‌కుని పాత్ర పోషించిన ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి వంటి ప‌త్రిక‌లు తెలంగాణ పున‌ర్నిర్మాణంలోనూ అదే పాత్ర‌ను కొన‌సాగిస్తున్నాయి. 40 ఏళ్లు ఇండ‌స్ట్రీ అని కోత‌లు కోసిన ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్ని రంగాల‌లో విఫ‌ల‌మై ప్ర‌జ‌లు చీద‌రించుకునే స్థాయికి చేరుకున్నాడు. కానీ ఈనాడు, ఆంధ్ర‌జ్యోతిలు మాత్రం చంద్ర‌బాబుకు ఇంకా జాకీలు పెట్టి లేపుతూనే ఉన్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యంలో చంద్ర‌బాబు ఇచ్చిన ఏ హామీని నెర‌వేర్చ‌లేదు. తెలంగాణ‌లో కేసీఆర్ ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీల‌ను పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు మాట ఇవ్వ‌ని ప‌థ‌కాల‌ను ప్ర‌వేశ‌పెట్టి విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తున్నారు. ఒక మిష‌న్ భ‌గీర‌థ‌, ఒక మిష‌న్ కాక‌తీయ‌, వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల క‌రంటు, రైతుల‌కు భీమా, రైతుబంధు ప‌థ‌కంతో వ్య‌వ‌సాయానికి పెట్టుబ‌డి, ఉచితంగా చేప పిల్ల‌ల పంపిణీ, గొల్ల కురుమ‌ల‌కు గొర్రెల పంపిణీ ఇలా అనేక ప‌థ‌కాల‌తో తెలంగాణ‌లోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఆస‌రాగా నిలిచేందుకు తండ్లాడుతున్నారు.

తెలంగాణ ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తో ప‌ల్లెల్లో ఈ రోజు పండ‌గ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఇన్నాళ్లూ వ‌డ్డీ వ్యాపారులు, ఫ‌ర్టిలైజ‌ర్ వ్యాపారుల చేతుల్లో బందీలుగా మారిన రైతులు ఇప్పుడే స్వేచ్చావాయువులు పీల్చుకుంటున్నారు. రైతుకు భ‌రోసాను ఇచ్చేందుకు ఒక వైపు సాగునీరు, ఇంకో వైపు క‌రంటు, మ‌రో వైపు విత్త‌నాలు, ఎరువులు, ఇప్పుడు సాగుకు పెట్టుబడిని స‌మ‌కూరుస్తూ దేశంలోనే ఇంత వ‌ర‌కూ ఎవ‌రూ చేప‌ట్ట‌ని ప‌థ‌కానికి కేసీఆర్ శ్రీ‌కారం చుట్టారు. దేశ‌వ్యాప్తంగా న‌గ‌దు ల‌భించ‌క ఏటీఎంలు మూసి వేసి, బ్యాంకుల‌లో న‌గ‌దు చెల్లింపుల‌పై ఆంక్ష‌లు విధిస్తున్న స‌మ‌యంలో రైతుబంధు ప‌థ‌కం ఉద్దేశాన్ని కేంద్రానికి వివ‌రించి ఆరువేల కోట్ల న‌గ‌దును తెలంగాణ బ్యాంకుల‌కు తెప్పించి ప్ర‌తి రైతుబంధు చెక్కుకు వెంట‌నే చెల్లింపులు చేయాల‌ని, ఈ ప‌థ‌కం కోసం వ‌చ్చిన చెక్కుల‌ను మ‌రే ఇత‌ర అవ‌స‌రాల కోసం వినియోగించ‌కూడ‌దు అని రిజ‌ర్వ్ బ్యాంక్ నుండి ప్ర‌త్యేకంగా ఆదేశాలు ఇప్పించి మ‌రీ తెలంగాణ ప్ర‌భుత్వం రైతుబంధు ప‌థ‌కాన్ని అమ‌లుచేస్తున్న‌ది.

ఇంత చిత్త‌శుద్దితో ప్ర‌భుత్వం ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తుంటే చెక్కుల్లో ఫోటోలు త‌ప్పుగా అచ్చ‌య్యాయ‌ని ఒక ప‌త్రిక‌, భ‌గీర‌థ‌కు నీళ్లెక్క‌డ ? అని ఇంకో ప‌త్రిక‌, ఒక త‌ప్పు రెండు న‌ష్టాలు అంటూ మ‌రో ప‌త్రిక కోడిగుడ్డు మీద ఈక‌లు పీకుతున్నాయి. 56 ల‌క్ష‌ల మంది రైతులు ల‌బ్దిదారులుగా ఉన్న ప‌థ‌కంలో లోపాలు లేకుండా, త‌ప్పులు దొర్ల‌కుండా ఉంటుంద‌ని ఎవ‌రూ ఆశించ‌రు. లోటుపాట్ల‌ను స‌రిదిద్దేందుకు ప్ర‌త్యేక సెల్ లు కూడా ఏర్పాటు చేశారు. ఇక ఇన్నేండ్ల స‌మైక్య పాల‌న‌లో వానాకాలంలోనే హైద‌రాబాదులో నీటికి అష్ట‌క‌ష్టాలు ప‌డేది .. ఇక ఎండాకాలం ఆ ప‌రిస్థితి చెప్పుకోలేనిది. కానీ గ‌త రెండేళ్లుగా హైద‌రాబాదులో నీటి ఇబ్బందులే లేవు. తెలంగాణ ప్ర‌భుత్వం ముందుచూపుతో గోదావ‌రి జ‌లాలు త‌ర‌లించి ఇబ్బందులు త‌లెత్త‌కుండా చ‌ర్య‌లు తీసుకుంది. అయినా ఆంధ్రాప‌త్రిక‌ల‌కు ఎక్క‌డో ఓర్వ‌లేని త‌నం. ఎక్క‌డో తెలంగాణ విజ‌యాన్ని ఆస్వాదించ‌లేని అస‌హ‌నం. ఈ మీడియా తెలంగాణ ఉద్య‌మానికి గానీ, తెలంగాణ పున‌ర్నిర్మాణానికి గానీ ఏ మాత్రం ఉప‌యోగ‌ప‌డ‌లేదు. అలా అని తెలంగాణ మీద విషం క‌క్కి ఆంధ్రాకు అయినా ఏమ‌యినా న్యాయం చేశాయా ? అంటే అదీ లేదు. ఆంధ్రా మీడియాను తెలంగాణ ఉద్య‌మంలోనే తెలంగాణ స‌మాజం విశ్వ‌సించ‌డం మానేసింది. స‌మాజానికి, ప్ర‌జ‌ల అభ్యున్న‌తికి అవ‌స‌రం రాని ఇలాంటి మీడియాను మీడియా అనాల్సి రావ‌డ‌మే మ‌న దుర‌దృష్టం.

 

 

(Visited 447 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *