ఉద్య‌మానికి .. ఉన్మాదానికి తేడా లేదా ?

ఉద్య‌మానికి .. ఉన్మాదానికి తేడా లేదా ?

ఒక వైపు ఏండ్ల త‌ర‌బ‌డి జ‌రుగుతున్న ఉద్య‌మం .. మ‌రో వైపు అడుగ‌డుగునా ప్ర‌భుత్వ నిర్భంధం .. ఇంకో వైపు స‌మైక్య శాస‌న‌స‌భ‌లో తెలంగాణ‌కు అవ‌మానాలు .. ఒక్క రూపాయి ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సాక్షాత్తూ స‌భా నాయ‌కుడి వెక్కిరింపులు .. బ‌య‌ట ప్ర‌జాక్షేత్రంలో స్వ‌రాష్ట్రం కోసం యువ‌త బ‌లిదానాలు .. ఉద్య‌మ‌కారుల అరెస్టులు .. లాఠీచార్జీలు .. తెలంగాణ ఊసేలేద‌ని శాస‌న‌స‌భ సాక్షిగా బ‌య‌ట ప్రపంచానికి చాటాల‌న్న స‌మైక్య పాల‌కుల ఎత్తుగ‌డ‌లు

స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితుల‌లో జ‌రిగిన శాస‌న‌స‌భ స‌మావేశాల‌లో అప్ప‌టి ఎమ్మెల్యే, ప్ర‌స్తుత రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు గ‌వ‌ర్న‌ర్ మీద‌కు కాయితాలు విసిరారు. ఇంత‌టి ఆకాంక్ష‌ల నుండి సాక్షాత్క‌రించిన తెలంగాణ ప్ర‌భుత్వంలో మొన్న జ‌రిగిన గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని అడ్డుకునే నెపంతో కాంగ్రెస్ స‌భ్యులు లేని ఆక్రోషం ప్ర‌ద‌ర్శించి శాస‌న‌స‌భ‌లో పిచ్చెక్కిన కోతుల్లా వ్య‌వ‌హ‌రించారు. మ‌రో న‌లుగురు ఇంకో అడుగు ముందుకేసి ఏకంగా మైకులు విసిరి గ‌వ‌ర్న‌ర్ మీద‌కు విసిరేశారు. అందులో కోమ‌టిరెడ్డి విసిరిన మైకు శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ స్వామిగౌడ్ కంటిని బ‌లంగా తాకింది. దీంతో కాంగ్రెస్ శాస‌న‌స‌భ్యులు 11 మంది మీద వేటు వేసిన స‌భ నీచంగా వ్య‌వ‌హ‌రించిన‌ కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి, సంప‌త్ కుమార్ ల మీద బ‌హిష్క‌ర‌ణ అస్త్రం ప్ర‌యోగించింది.

వాస్త‌వంగా ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఏ పార్టీ అయినా, ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన ఏ స‌భ్యుడు అయినా ఆ త‌రువాత జ‌రిగిన పొర‌పాటును గుర్తించి క్ష‌మాప‌ణ చెప్పాలి. పార్టీ ప‌రంగా త‌మ స‌భ్యుడు చేసింది త‌ప్పు అని చెప్పాలి. ఇక స‌భ్యుడు త‌న ప్ర‌వ‌ర్త‌న‌కు చింతిస్తున్నాన‌ని, ఒత్తిడిలో తాను ఆవేశ‌ప‌డిన మాట వాస్త‌వం అని, త‌న‌ను మ‌న్నించాల‌ని కోరాలి. కానీ కాంగ్రెస్ పార్టీ సంఘ‌ట‌న‌ను స‌మ‌ర్థించుకుని ప్ర‌భుత్వాన్ని నిందించింది. గ‌వ‌ర్న‌ర్ ను కొట్టబోతే మండ‌లి స్పీక‌ర్ స్వామిగౌడ్ కు త‌గిలింద‌ని నిర్ల‌జ్జ‌గా ప్ర‌క‌టించింది. కోమ‌టిరెడ్డి వ్య‌వ‌హారం ఏకంగా మొగ‌న్ని కొట్టి మొత్తుకున్న‌ట్లుగా ఉంది. త‌న కాలికి గాయం అయింద‌ని, స్వామిగౌడ్ కు అస‌లు దెబ్బే త‌గ‌ల్లేదు .. కేవ‌లం న‌టిస్తున్నాడ‌ని చెప్ప‌డం ఆయ‌న దిగ‌జారుడుత‌నానికి నిద‌ర్శ‌నం.

కాంగ్రెస్ పార్టీ త‌మ అనైతిక‌, అవివేక చ‌ర్య‌ల‌ను గ‌త స‌మైక్య రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో హ‌రీష్ రావు ప్ర‌ద‌ర్శించిన వైఖ‌రికి ముడిపెట్ట‌డం హ‌స్యాస్ప‌దం. దానికి దీనికి పోలిక‌ను ఏ ఉద్య‌మ‌కారుడు స‌మ‌ర్ధించ‌డు. అస‌లు కాంగ్రెస్ పార్టీ అంత‌లా ప్ర‌తిఘ‌టించాల్సిన అవ‌స‌రం ఏముంది ? ప‌్ర‌జ‌ల కోసం వారు ఏద‌యినా డిమాండ్లు పెడితే ప్ర‌భుత్వం ప‌ట్టించుకోలేదా ? అంటే అలాంటి సంధ‌ర్భ‌మే లేదు. కేవ‌లం టీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని జీర్ణించుకోలేక ఈ దురహంకారానికి ఒడిగ‌ట్టారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగాన్ని వ్య‌తిరేకించి ప్ర‌భుత్వ అస‌మ‌ర్ధ‌త‌ను శాస‌న‌స‌భ సాక్షిగా ఎండ‌గ‌ట్టాలంటే కాంగ్రెస్ పార్టీకి ఆ రోజు మిన‌హాయిస్తే ఇంకా 11 రోజుల స‌మ‌యం ఉంది. నిజంగా వారికి స‌మ‌ర్ధ‌త‌, స‌రిగ్గా వాదించే ప్ర‌ణాళిక ఉంటే టీఆర్ఎస్ ప్ర‌భుత్వ లోపాల‌ను ఒక్కో స‌భ్యుడు ఒక్కో అంశం మీద నిల‌దీసి ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వ లోపాల‌ను ఎత్తి చూప‌వ‌చ్చు.

అయితే తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత జ‌రిగిన ప్ర‌తి శాస‌న‌స‌భ స‌మావేశాల‌లోనూ కాంగ్రెస్ పార్టీ ఎన్న‌డూ ఓ ప్ర‌ణాళిక‌తో వ్య‌వ‌హ‌రించిన దాఖ‌లాలు లేవు. గుడ్డి వ్య‌తిరేక‌త‌, స‌భ‌లో బ‌డిపిల్ల‌ల మాదిరిగా త‌ల‌కుమాసిన ఆరోప‌ణ‌లు చేసి స‌భ నుండి బ‌య‌ట‌ప‌డాల‌న్న అతృత త‌ప్ప స‌భా స‌మావేశాల‌ను ఉప‌యోగించుకుని ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన నాథుడే లేడు. అస‌లు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాదు ఎప్పుడూ ఓ స‌ర‌యిన నాయ‌కుడు లేడు. ఆ పార్టీ మెజార్టీ స‌భ్యులంతా గాలివాటం గెలుపు మీద స‌భ్యులుగా ఎంపిక‌వ‌డం లేదా కొద్దిమంది వ్య‌క్తిగ‌త ఇమేజ్ తో .. మ‌రికొంద‌రు డ‌బ్బు ప‌లుకుబ‌డితో చ‌ట్ట‌స‌భ‌ల‌కు వ‌స్తున్నారు. త‌ప్పితే ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌ట్ల చిత్త‌శుద్ది, ఓ ప‌ని ప‌ట్ల నిబ‌ద్ద‌త ఏ ఒక్క కాంగ్రెస్ నాయ‌కునిలో ఏ కోశానా క‌నిపించ‌వు.

కాంగ్రెస్ నాయ‌కులకు ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌ట్ల ఇంత నిబ‌ద్ద‌త ఉంటే, రాష్ట్ర అభివృద్ది ప‌ట్ల ఈ మాత్రం రంకెలు వారి ప‌దేండ్ల పాల‌న‌లో వేసి ఉంటే తెలంగాణ రాష్ట్రంలో రైతులు బోర్ల మీద ఆధార‌ప‌డి ఎందుకు బ‌తికేవాళ్లు ? క‌రంటు లేక ఎందుకు అల్లాడేవారు ? ఆక‌లిచావులు, ఆత్మ‌హ‌త్య‌లు ఎందుకు ఉండేవి ? ముఖ్య‌మంత్రి కేసీఆర్ మొన్న చెప్పిన‌ట్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటే టీడీపీ, టీడీపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ శాస‌న‌స‌భ‌లో కందిల్లు ప‌ట్టుకుని వ‌చ్చి క‌రంటు గురించి నిల‌దీస్తారు. త‌ప్పితే ఎవ్వ‌రు అధికారంలోకి వ‌చ్చినా క‌రంటు స‌మ‌స్య‌ను మాత్రం ప‌రిష్క‌రించ‌రు. మ‌రి తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్పుడు వ్య‌వ‌సాయానికి ఉచితంగా 24 గంట‌ల క‌రంటు అందిస్తుంది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఈ ప‌థ‌కం లేదు. అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల‌లోనే గృహావ‌సరాల‌కు 24 గంట‌ల క‌రంటు ఇస్తుంది. ప‌వ‌ర్ హాలిడేల‌తో ధ‌ర్నాల‌కు దిగిన పారిశ్రామిక‌వేత్త‌లు ఇప్పుడు ప‌వ‌ర్ హాలిడే అన్న మాట లేకుండా ప‌రిశ్ర‌మ‌లు న‌డుపుకుంటున్నారు. గ్రామాల‌లో రాత్రి పూట ఆరుగంట‌లు, లేదా సాయంత్రం ఆరు నుండి ఉద‌యం ఆరు వ‌ర‌కు మాత్ర‌మే క‌రంటు దిక్కు. ఎండాకాలంలో అయితే అస‌లు ఎప్పుడు క‌రంటు వ‌స్తుందో ఆ శాఖ అధికారుల‌కు, మంత్రికే తెలియ‌దు.

మ‌రి కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన ఆరు నెల‌ల్లోనే 24 గంట‌ల క‌రంటు ఎలా సాధ్యం అయింది ? అంటే కాంగ్రెస్ నేత‌ల‌కు అస‌లు ఆ శాఖ మీద ప‌ట్టు, అవ‌గాహ‌న ఎంత మాత్రం లేదు. కేసీఆర్ సంబంధిత అధికారుల‌ను పిలుచుకుని ఎక్క‌డ క‌రంటు వృధా అవుతుంది ? ఏం చేస్తే దానిని అరిక‌ట్ట‌గ‌లుగుతాం అన్నది తెలుసుకుని వారికి అవ‌స‌రం అయిన నిధులు ఇచ్చి .. భ‌రోసా అందించి క‌రంటును ప్ర‌జ‌ల‌కు అందించ‌గ‌లిగారు. గాలివాటం గెలుపులు .. అధిష్టానం ఆశీస్సుల‌తో దొరికిన మంత్రి ప‌ద‌వుల‌ను ఎంజాయ్ చేయ‌డం అల‌వాటు అయిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్ర‌భుత్వ విజ‌యాలు రుచించ‌క‌పోవ‌డం మొన్న శాస‌న‌స‌భ‌లో జ‌రిగిన దాడి నిద‌ర్శ‌నం. కాంగ్రెస్ 43 ఏండ్ల పాల‌న‌లో, టీడీపీ 17 ఏండ్ల పాల‌న‌లో సాధించ‌ని ఎన్నో విజ‌యాల‌ను కేసీఆర్ ప్ర‌భుత్వం మూట‌గ‌ట్టుకుంది. ఆ అస‌హ‌నం ఫ‌లిత‌మే ఈ దాడులు అని చెప్ప‌క‌త‌ప్ప‌దు. కాంగ్రెస్ హ‌యాంలో నీళ్ల శాఖ మంత్రికి నీటి గురించి తెలియ‌దు .. క‌నీసం చేప‌ట్టిన ప్రాజెక్టుల‌ను ప‌ద‌వీకాలంలో ఎన్న‌డూ చూసింది లేదు .. వైద్య‌మంత్రికి వైద్యం గురించి తెలియ‌దు .. రోగుల ఇబ్బందులు తెలియ‌దు .. క‌రంటు మంత్రికి క‌రంటు గురించి తెలియ‌దు. ఏదో గుడ్డెద్దు చేలో ప‌డ్డ‌ట్లు అధికారం అనుభ‌విస్తూ పోయారు. అందుకే ఇప్పుడు త‌మ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌లు గుర్తించ‌కుండా రేప‌టి ఎన్నిక‌ల్లో ఇలాంటి దాడుల‌తో ప్ర‌జ‌ల‌కు క‌నిక‌ట్టు చేసి ప్ర‌జాస్వామ్యం మంట‌గ‌లిసిపోయింద‌ని నాట‌కాలు ఆడి సానుభూతి మూట‌గ‌ట్టుకుందామ‌నే ప్ర‌య‌త్నాల‌లో కాంగ్రెస్ పార్టీ త‌ల మున‌క‌లై ఉంది. తెలంగాణ ఉద్య‌మంలో చైత‌న్యం అయిన తెలంగాణ స‌మాజానికి కాంగ్రెస్ నాట‌కాలు కొత్త కాదు. ఆ విష‌యం కాంగ్రెస్ పార్టీ ఎంత తొంద‌ర‌గా తెలుసుకుంటే అంత మంచిది.

 

(Visited 384 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *