చిత్తూరోడి ధ‌మాకా… స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బీ

చిత్తూరోడి ధ‌మాకా... స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బీ

ఏరా మామ ఈసారి సినిమా ప్రియుల‌కు గురువార‌మే వారం మొద‌లైపోయిన‌ట్లుంది?

అవున్రా బావ‌! స‌ప్త‌గిరి చూశాను.

ఎలా ఉందేంది?

హిందీలో తీసిన జాలీ ఎల్ఎల్‌బీని చెడ‌గొట్ట‌లేదు.

ఇంత‌కీ క‌థేంటి?

కోర్టులో కేసులు… అక్క‌డ నిజాల‌ను అబద్ధాల‌ని నిరూపించ‌డానికి  వేసే నాట‌కాలు. అబ‌ద్ధాల‌ను నిజాల‌ని న‌మ్మించ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలు… ఇలాంటి ఓ కేసు చుట్టూ అల్లుకున్న‌దే ఈ క‌థ‌.  ఓ డ‌బ్బున్న యువ‌కుడు తాగిన మైకంలో కారు న‌డుపుతూ  ఫ్లాట్‌ఫారంపై నిద్రిస్తున్న వారిపైకి ఎక్కిస్తాడు. ఈ ప్ర‌మాదంలో అయిదుగురు ప్రాణాలు కోల్పోతారు.  ఈ కేసులో పెద్దింటి యువ‌కుడిని ర‌క్షించ‌డానికి ఓ పేరుమోసిన‌ లాయ‌ర్‌(సాయికుమార్) రంగంలోకి దిగుతాడు.  సాక్ష్యాల‌ను తారుమారు చేసి కేసు కొట్టేస్తాడు.

మ‌రో ప‌క్క త‌న మ‌ర‌ద‌ల్ని ఇష్ట‌ప‌డుతుంటాడు స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బీ. నువ్వు ఒక్క కేసైనా గెలిస్తేనే తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు స‌ప్త‌గిరి మామ‌. దీంతో కోర్టులో ఏదైనా కేసు గెల‌వాల‌ని  నిర్ణ‌యానికి వ‌స్తాడు స‌ప్త‌గిరి. ఏదో ఎందుకు ఈ హిట్ అండ్ ర‌న్ కేసైతే పెద్ద లాయ‌ర్‌తో త‌ల‌ప‌డి ఫేమ‌స్ అయిపోవ‌చ్చు. కేసు గెలిస్తే డ‌బ్బులూ సంపాదించి సెటిలైపోవ‌చ్చ‌నుకుంటాడు. ఈ నేప‌థ్యంలో మ‌న స‌ప్త‌గిరి పెద్ద‌లాయ‌ర్‌ను ఎలా ఎదుర్కొన్నాడు? అత‌నికి ఎదురైన అనుభావాలు ఏంటి?  అస‌లు కేసేంటి?  దాన్ని గెలిచాడా? మ‌ర‌ద‌ల్ని ద‌క్కించుకున్నాడా? అదే క‌థ‌.

ఇంత పెద్ద క‌థ‌ని స‌ప్త‌గిరి మోశాడా?

ఓ వైపు సాయికుమార్ లాంటి సీనియ‌ర్‌, మ‌రోవైపు సాయిప్ర‌సాద్ లాంటి అనుభ‌వశాలి.. స‌ప్త‌గిరికి సాయం ప‌ట్టారు. దీంతో సినిమా నిల‌బ‌డింది.

స‌ప్త‌గిరి కోసం ఏవో మార్పులు చేశామ‌న్నారు?

ఆ.. చేశారు… ఆ కామెడీ, పాట‌లు కొంచెం ఇబ్బంది పెట్టాయి.

ఓయ్ మామ‌… నాలాంటోళ్ల‌కు అలాంటివేరా కావాల్సింది.

స‌రేలే..!

సంగీతం ఎలా ఉంది?

విజ‌య్ మంచి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఇక పాటలు వినే మూడ్ సినిమాలో లేదురా!

ద‌ర్శ‌క‌త్వం కథేంటి?

బాగుందిరా… సీరియ‌స్ సీన్ల‌నీ బాగా న‌డిపాడు. ఎక్క‌డ ఏ సీన్ ఎంత అవ‌స‌ర‌మో అక్క‌డే క‌ట్ చేశాడు.

మాట‌లు బాగుండాలే…!

ప‌ర‌చూరి బ్ర‌ద‌ర్స్ క‌థ‌నానికి త‌గ్గ‌ట్లు రాశారు. రైతుల గొప్ప‌త‌నం… న్యాయం అవ‌స‌రం… చ‌ట్టం బాధ్య‌త‌ల‌ను చ‌క్క‌గా చెప్పారు.

మిగ‌తా న‌టులెలా చేశారు?

ముందే చెప్పాను గా బావ‌… సాయికుమార్ త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించాడు. శివ‌ప్ర‌సాద్ ఇటు న‌వ్విస్తూనే ఆలోచింప‌చేశాడు. ఇక ష‌క‌లక శంక‌ర్ ఓకే. హీరోయిన్‌కు పెద్ద ప్రాధాన్యం ఏమీ లేదు. ఇచ్చిన కాడికి బాగానే చేసింది. మిగ‌తా వాళ్లు సపోర్ట్ చేశారు.

మొత్తానికి ఏమంటావ్‌?

చిత్తూరోడి దెబ్బ రెండో సారి గ‌ట్టిగానే ఉంది..
ఈ సినిమాకు నా రేటింగ్ 3

అయితే సాయంత్ర‌మే టికెట్ బుక్ చేసేస్తా.

–నాగరాజు చౌదరి

(Visited 115 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *