తెలంగాణ బ‌తుకే కొట్లాట‌

తెలంగాణ బ‌తుకే కొట్లాట‌

ప‌క్క‌నున్న త‌మిళ‌నాడు రాష్ట్రంల త‌మ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు చిన్న భంగం వాటిల్లినా అన్ని పార్టీలు ఏక‌మ‌వుతాయి. వేదిక‌లు వేర‌యినా వాటి ల‌క్ష్యం కేంద్రం మెడ‌లు వంచ‌డం త‌మ ప్ర‌యోజ‌నాల‌ను సాధించుకోవ‌డం. ప‌క్క‌న క‌ర్ణాట‌క‌దీ అదే ప‌రిస్థితి. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అధికార ప్ర‌తిప‌క్షాలు ఉప్పు నిప్పులా ఉన్నా త‌మ ప్రాజెక్టులు, ప్ర‌యోజ‌నాల గురించి మాత్రం ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌డం లేదు. కానీ అదేం చిత్ర‌మో తెలంగాణ‌ది నిత్యం కొట్లాట‌నే. తెలంగాణ నిల‌బ‌డాల‌ని చూసిన ప్ర‌తిసారి ప‌డ‌గొట్టాల‌ని బ‌య‌టోనిక‌న్నా ఎక్కువ‌గా ఇంటోడే ప‌నిచేస్తుంటాడు.

1947లో దేశానికి స్వాతంత్య్రం వ‌స్తే 1948 సెప్టెంబ‌రులో తెలంగాణ ఈ దేశంలో క‌లిసింది. 1948 వ‌ర‌కు ర‌జాకార్ల‌తో పంచాయితీ .. ఆ త‌రువాత 1951 వ‌ర‌కు ఇండియ‌న్ యూనియ‌న్ సైనిక బ‌ల‌గాల‌తో పోరాటాలు న‌డిచాయి. అప్ప‌టి హైద‌రాబాద్ రాష్ట్రంలో ప్ర‌జాస్వామ్య ప్ర‌భుత్వం ఏర్ప‌డ‌టానికి 1952 మార్చి 6 దాకా ఆగాల్సి వ‌చ్చింది. అప్పుడు బూర్గుల రామ‌కృష్ణారావు ముఖ్య‌మంత్రిగా ఎన్నిక‌య్యారు. ఇక అప్ప‌టి సంది తెలంగాణ‌ను ఆంధ్ర‌ల క‌ల‌పాల‌ని కుట్ర‌. ఎట్ట‌కేల‌కు తెలంగాణ‌ల కొంద‌రు మేధావుల‌ను బుట్ట‌ల ఏసుకుని విడాకులు ఎప్పుడ‌యినా తీసుకోవ‌చ్చ‌ని కాయితం ముందు పెట్టి తెలివిగా తెలంగాణ – ఆంధ్ర‌ను క‌లిపేశారు. ఇక ఆ త‌రువాత తెలంగాణ కొలువులు ఆంధ్ర‌కు పోవ‌డం మొద‌ల‌య్యాయి. పెద్ద‌మ‌నుషుల ఒప్పంద గాలికి వ‌దిలేయ‌డంతో ఉద్యోగాల పంచాయితీ మొద‌లై 1969 తెలంగాణ ఉద్య‌మం వ‌ర‌కు వెళ్లింది. దానిని ముందుకు సాగ‌నీయకుండా అణ‌చివేశారు.

ఆంధ్ర పాల‌కుల వివ‌క్ష‌తో తెలంగాణ‌లో అభివృద్ది అడుగంటడంతో తెలంగాణ యువ‌త సాయుధ పోరాటం వైపు వెళ్లిపోయింది. ఎంద‌రో ప్ర‌తిభావంతులు తుపాకి గొట్టంతోనే రాజ్యాధికారం అంటూ అడ‌వుల బాట ప‌ట్టారు. 2005 వ‌ర‌కు తెలంగాణ అనునిత్యం ఎన్ కౌంట‌ర్లు, ఎదురుకాల్పుల‌తో ర‌క్తంతో త‌డిసి ముద్ద‌యింది. కంటి మీద కునుకులేని గ్రామీణ జీవితాలు .. ఏ గుట్ట చాటున ఏ బిడ్డ శ‌వం ఎదురుప‌డుతుందోనని త‌ల్ల‌డిల్లిన బ‌తుకులు. గ్రామీణ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను నిర్వీర్యం చేసి సాగునీరు తెలంగాణ‌కు దూరం చేసి ఉపాధి లేక తెలంగాణ త‌న బిడ్డ‌ల‌ను వ‌ల‌సబాట ప‌ట్టించేలా ఆంధ్రా పాల‌కుల పాల‌న సాగింది. బొగ్గుబాయి .. దుబాయ్ .. బొంబాయి మాత్ర‌మే కాదు కాశ్మీర్ నుండి క‌న్యాకుమారి గుజ‌రాత్ నుండి అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ వ‌ర‌కు ఎక్క‌డా చూసినా తెలంగాణ కార్మికులే.

2001లో టీఆర్ఎస్ ఏర్పాటు త‌రువాత మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మం మొద‌ల‌యింది. అయ్యేదా పొయ్యేదా అని కొంద‌రు .. రాజ‌కీయ అవ‌స‌రం కోసం అని ఇంకొంద‌రు 2009 వ‌ర‌కు టీఆర్ఎస్ కు గానీ ప‌రోక్షంగా తెలంగాణ ఉద్య‌మానికి గానీ మ‌ద్ద‌తు ప‌లికిన నేత‌ల‌కంటే టీఆర్ఎస్ ఎప్పుడు మ‌రుగున ప‌డుతుందా అని ఎదురు చూసిన నేత‌లే ఎక్కువ‌. తెలంగాణ ప్ర‌జ‌లే టీఆర్ఎస్ ను కీల‌క స‌మ‌యంలో వెన్నుత‌డుతూ వ‌చ్చారు. 2009 డిసెంబ‌రు 9 ప్ర‌క‌ట‌న త‌రువాత ఆంధ్రా నాయ‌క‌త్వంలోని రాజ‌కీయ పార్టీల ముసుగులు బ‌య‌ట‌ప‌డ్డాయి. 2009 డిసెంబరు 23 ప్ర‌క‌ట‌న‌తో కేంద్రం ఇచ్చిన తెలంగాణ‌ను వెన‌క‌కు తీసుకోవ‌డంతో అప్పటివ‌ర‌కు సందేహాలున్న‌ తెలంగాణ ప్ర‌జ‌లంద‌రికి ఆంద్రా కుట్ర‌లు అర్థ‌మై ఉద్య‌మంలోకి వ‌చ్చారు.

2009 నుండి 2014లో తెలంగాణ బిల్లు పార్ల‌మెంటులో ఆమోదం పొందేవ‌ర‌కు అటు ఆంధ్రా నేత‌ల కుట్ర‌లు .. ఇటు ఇంటి దొంగ‌ల వేశాలు .. ప్ర‌జ‌లంతా ఉద్య‌మంలో ఉంటే ఇండ్ల‌లో సంత‌కాలు పెట్టిన మంత్రులు ఉన్న‌రు. ఈ మ‌ధ్య‌కాలంలో అనునిత్యం సంఘ‌ర్ష‌ణ‌నే. ఎన్నో కుట్ర‌లు దాటుకుని తెలంగాణ ఏర్ప‌డింది ఉద్య‌మంలో ముందున్న పార్టీకి ప్ర‌జ‌లు అధికార పీఠం క‌ట్ట‌బెట్టారు. ప్ర‌భుత్వం ఏర్ప‌డింది మొద‌లు దానిని బ‌ద్ నాం చేసే ప్ర‌య‌త్నాలు .. పని చేయ‌కుండా అడ్డంకులు సృష్టించడం .. కొన్నాళ్ల‌కు ఏకంగా ప‌డ‌గొట్టాల‌నే కుట్ర‌లను తెలంగాణ చేధించుకుని నిల‌బ‌డింది. 60 ఏండ్ల పాల‌న‌లో జ‌రిగిన న‌ష్టాల‌కు ఐదేండ్ల‌లో ప‌రిష్కారాలు చూపాల‌ని వితండ‌వాదాలు. ఇన్నాళ్లూ అర‌చేతిలో బెల్లంపెట్టి మోచేతులు నాకిస్తుంటే త‌మ కొలువులు భ‌ద్రంగా చేసుకుంటూ పోయిన మేధావులు ఇప్పుడు స్వ‌యం పాల‌న‌లో యువ‌త ఉపాధి గురించి ఉద్యోగాల గురించి అన్యాయం జ‌రుగుతుంది అని ప్ర‌జ‌ల‌కు అనుమానాలు రేపుతారు.

60 ఏండ్ల‌లో సాగునీరు లేక తెలంగాణ రొండు త‌రాల‌ను న‌ష్ట‌పోయింది. ఎంతో సంప‌ద‌ను కోల్పోయింది. వ్య‌వ‌సాయం మ‌రుగున ప‌డింది .. రైతులు ప‌ట్నాల‌లో వాచ్ మెన్లుగా మారారు. ఈ మేధావుల‌కు ఇప్పుడు తెలంగాణకు నీళ్లొస్తుంటే నీళ్ల కింద పోతున్న భూమి గుర్తొస్తుంది కానీ నీళ్లొస్తే మారే గ్రామీణ జీవ‌న స్వ‌రూపాలు మాత్రం గుర్తుకురావు. త‌మ పాల‌న‌లో అడ్డికి పావుశేరు ఇచ్చి భూములు గుంజుకున్న నేత‌ల‌ను వెంటేసుకుని న్యాయంగా న‌ష్ట‌ప‌రిహారం ఇస్తున్న తెలంగాణ ప్ర‌భుత్వం మీద‌, తెలంగాణ ప్రాజెక్టుల మీద కేసులు వేస్తారు. ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఈ దేశంలో గానీ .. ఈ ప్ర‌పంచంలో గానీ ఏ ప్ర‌భుత్వంలో అయినా ప్ర‌భుత్వ ఉద్యోగాల క‌ల్ప‌న ప‌రిమిత సంఖ్య‌లో మాత్ర‌మే అని తెలిసి కూడా ప్ర‌భుత్వ ఉద్యోగ‌మే జీవితం అని యువ‌త‌ను రెచ్చ‌గొడ‌తారు.

60 ఏండ్ల తరువాత వ‌చ్చిన స్వ‌యం పాల‌నకు ఊత‌మివ్వాల‌ని .. త‌మ అనుభ‌వంతో తెలంగాణ భ‌విష్య‌త్ కు పునాదులు వేసే స‌ల‌హాలు ఇవ్వాల‌ని గానీ వీరు ఆలోచించిన దాఖ‌లాలు లేవు. క‌నీసం వారి వ‌ద్ద ఉన్న ప్ర‌ణాళిక‌ను మీడియా ముందు అయినా పెట్టిన సంధ‌ర్భాలు లేవు. విమ‌ర్శ‌లు వీరి ఆస్తి .. ఆరోప‌ణ‌లు వీరి హ‌క్కు అన్న‌ట్లుగా సాగుతుంది. తెలంగాణ‌లో జ‌రుగుతున్న అభివృద్ది ప్ర‌పంచ‌మంతా క‌నిపిస్తున్నా వీరికి మాత్రం క‌నిపించ‌దు. అభివృద్ది ఫ‌లాలు ప్ర‌జ‌ల‌కు క‌నిపిస్తుంటే వీరు భ‌విష్యత్ లో దోషులుగా నిల‌బ‌డ‌తార‌న్న ఆలోచ‌న ఉండ‌దా. తెలంగాణ అప్పుడూ .. ఇప్పుడూ పోరాడుతూనే ఉంది. క‌ల‌బ‌డుతూనే ఉంది.

story by :

SandeepReddy Kothapally
(Visited 382 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *