ఈ ఊరు స‌ర్పంచి .. ప‌క్క ఊళ్లె కావ‌లికారు

ఈ ఊరు స‌ర్పంచి .. ప‌క్క ఊళ్లె కావ‌లికారు

ఈ ఊరు స‌ర్పంచి .. ప‌క్క ఊళ్లె కావ‌లికారు.. అచ్చం ఈ సామెత లాగానే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ప‌రిస్థితి త‌యార‌యింద‌ట‌. తెలుగుదేశం పార్టీలో చేరి లిఫ్ట్ ఎక్కిపోయిన‌ట్లు స‌ర్రున ఎదిగిపోయిన రేవంత్ రెడ్డి ఓటుకునోటు కేసుతో పాతాళానికి ప‌డిపోయినా చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదంటూ తెలంగాణ ప్ర‌భుత్వం మీద విషం చిమ్ముతూ మీడియాను ఆక‌ర్షించుకున్నాడు. ఓటుకునోటుతో నేత‌లంతా పార్టీని వీడ‌డంతో ఆంధ్రాలో చంద్ర‌బాబుది, తెలంగాణ‌లో రేవంత్ రెడ్డిది అన్న‌ట్లు మారింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఎల్ ర‌మ‌ణ అధ్య‌క్షుడుగా ఉన్నా మాజీ మంత్రి మోత్కుప‌ల్లి నర్సింహులు, దేవేంద‌ర్ గౌడ్, ఉమా మాధ‌వ‌రెడ్డి వంటి వారు ఉన్నా రేవంత్ ఒన్ మ్యాన్ షో నే న‌డిచింది. అయితే ఈ సారి ఎన్నిక‌ల్లో టీడీపీకి జ‌నం ఓట్లేయ‌ర‌ని గుర్తించిన రేవంత్ రెడ్డి మీడియాలో ఓ రేంజ్ ప్ర‌చారం చేయించుకుని రాహుల్ స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు.

ఆ చేర‌డానికి ముందు శాస‌న‌స‌భ్య‌త్వానికి రాజీనామా చేస్తున్న‌ట్లు సీన్ క్రియేట్ చేసి రాజీనామా లేఖ‌ను ఆంధ్రాలో ఉన్న చంద్ర‌బాబుకు, గ‌న్ మెన్ ల‌ను వికారాబాద్ లో ఎస్పీకి స‌రెండ‌ర్ చేసి త‌న‌కు ఎమ్మెల్యేగా జీతం ఇవ్వద్దు అంటూ తెలంగాణ స్పీక‌ర్ కు లేఖ రాశాడు. కాంగ్రెస్ లో చేరిన మ‌రుక్ష‌ణం రాజీనామా చేస్తే గెలిచేంత సీన్ లేద‌ని కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ కు చెప్ప‌డంతో రాజీనామా గురించి మాట్లాడ‌డం మానేశాడు. ఉప ఎన్నిక‌కు వెళ్తే ఓట‌మి జ‌రిగితే సాధార‌ణ ఎన్నిక‌లకు వెళ్తే ధైర్యం కూడా చేయ‌లేమ‌ని అధిష్టానం స్ప‌ష్టం చేసింది. దీంతో రేవంత్ మీడియాకు మొహం చాటేశాడు. ఆ త‌రువాత తాను పాద‌యాత్ర మొద‌లుపెడుతున్నాన‌ని అప్ప‌టి వ‌ర‌కు మాట్లాడ‌న‌ని త‌ప్పించుకుని తిరుగుతున్నాడు.

పార్టీలో చేరినంత వ‌ర‌కు కిక్కురుమ‌న‌ని కాంగ్రెస్ నేత‌లు రేవంత్ కాంగ్రెస్ లో చేరిన త‌రువాత త‌మ మార్కు రాజ‌కీయానికి తెర లేపారు. రేవంత్ పాద‌యాత్ర చేస్తాన‌ని అన‌డంతో కాంగ్రెస్ లో వ్య‌క్తిగ‌త పాద‌యాత్ర‌కు అవ‌కాశం ఉండ‌ద‌ని ఆ పార్టీ నేత‌లు రేవంత్ ఆశ‌ల మీద నీళ్లు చ‌ల్లారు. అప్ప‌ట్లో రాజ‌శేఖ‌ర్ రెడ్డి పాద‌యాత్ర మొద‌లుపెడితేనే అనేక మంది నేత‌లు అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేశారు. ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చిన రేవంత్ కు పార్టీలో ఆ అవ‌కాశం ద‌క్క‌నివ్వరు. కాంగ్రెస్ లో కొమ్ములు తిరిగిన నేత అయినా అధిష్టానం ముందు వంగి స‌లాములు చేయాల్సిందే. తెలుగుదేశం పార్టీలో లిఫ్టు ఎక్కి వ్య‌క్తిగ‌త ఇమేజి పెంచుకున్న రేవంత్ ను కాంగ్రెస్ లో నిచ్చెన మెట్లు కూడా ఎక్క‌నివ్వడం లేద‌ట‌. వ‌చ్చే వ‌ర‌కు ఓ మాదిరి .. వ‌చ్చాక ఇంకో మాదిరిగా ప‌రిస్థితి త‌యార‌వ‌డంతో మింగ‌లేక క‌క్క‌లేక రేవంత్ ఆందోళ‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తుంది.

(Visited 654 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *