సాధించావు కేసీఆర్

సాధించావు కేసీఆర్

రాజ‌కీయ నాయ‌కుల‌కు అవ‌కాశాలు రావ‌డం అరుదు. అదీ భార‌త్ లాంటి అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంలో, సంకీర్ణ రాజ‌కీయాల కాలంలో రావ‌డం మ‌రీ అరుదు. అలాంటిది ఒక రాజ‌కీయ నాయ‌కుని జీవిత‌కాలంలో రెండు సార్లు అవ‌కాశం రావ‌డం మరింత అరుదు. అలాంటి అవ‌కాశం ల‌భించిన అరుద‌యిన వ్య‌క్తి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్. తెలంగాణ ప్ర‌జ‌ల ప్ర‌త్యేక రాష్ట్ర క‌ల‌ను నెర‌వేర్చగ‌ల‌గ‌డం మొద‌టి అవ‌కాశం. ఆ వ‌చ్చిన తెలంగాణ‌ను అభివృద్ది ప‌థంలో న‌డిపించ‌గ‌లిగే అవ‌కాశం ల‌భించ‌డం రెండో అవ‌కాశం.

2001లో తెలంగాణ రాష్ట్ర స‌మితిని స్థాపించి మ‌లిద‌శ తెలంగాణ ఉద్య‌మానికి శ్రీ‌కారం చుట్టిన కేసీఆర్ ప్ర‌జ‌ల‌ను జాగృతం చేసే క్ర‌మంలో .. తెలంగాణ రాష్ట్ర ఆవ‌శ్య‌క‌త‌ను ప్ర‌జ‌ల‌కు చెప్పి ఒప్పించే విష‌యంలో అనేక ఎత్తుప‌ల్లాల‌ను చ‌వి చూశారు. విడిపోతే సీమాంధ్ర‌కు న‌ష్ట‌మ‌ని భావించిన సీమాంధ్ర పెట్టుబ‌డిదారులు, రాజ‌కీయ నాయ‌కులు ఏక‌మై కేసీఆర్ మీద అనేక దుష్ప్ర‌చారాల‌కు పాల్ప‌డ్డారు. తెలంగాణ అంశాన్ని త‌మ రాజ‌కీయ అవ‌స‌రాల కోసం వాడుకున్న సీమాంధ్ర నేత‌లు ఆ త‌రువాత తెలంగాణ ఉద్యమాన్ని అణ‌చివేయాల‌ని, కేసీఆర్ ను అశ‌క్తున్ని చేయాల‌ని ఎన్నో కుట్ర‌ల‌కు పాల్ప‌డ్డారు. కానీ కేసీఆర్ సంక‌ల్పం ముందు ఎలాంటి కుట్ర‌లు ప‌నిచేయ‌లేదు. కింద ప‌డ్డ ప్ర‌తిసారి కేసీఆర్ మ‌రింత శ‌క్తిని కూడ‌గ‌ట్టుకుని .. మ‌రింత ప‌క‌డ్భంధీగా ప్ర‌ణాళిక‌లు ర‌చించుకుని బెబ్బులిలా ముంద‌డుగు వేశారు.

త‌న ఆలోచ‌న‌ల‌కు ప‌దును పెట్టి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ ను, బీజేపీని తెలంగాణ‌కు అనుకూలంగా ఉండాల్సిన ప‌రిస్థితిని క‌ల్పించారు. తెలుగుదేశం పార్టీని, సీపీఐ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల‌ను తెలంగాణ‌కు అనుకూలం కాదు అని చెప్ప‌లేని ప‌రిస్థితులు క‌ల్పించారు. 2009లో వ‌చ్చిన తెలంగాణ‌ను అడ్డుకున్న టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సీమాంధ్రా కాంగ్రెస్ నాయకుల కుట్ర‌ల‌ను, అధిష్టానాన్ని ప్ర‌శ్నించ‌లేని తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుల అచేతాన‌వ‌స్థ‌ను ప్ర‌జాక్షేత్రంలోకి తీసుకువెళ్లి వారి మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టుకున్నారు. 2014లో కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితిని క‌ల్పించి తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించారు. ఇప్పుడు తెలంగాణ ఇచ్చాం అని ప్ర‌క‌టించుకునే కాంగ్రెస్ నేత‌లు వీళ్ల‌క‌న్నా ముందు కేసీఆర్ పార్ల‌మెంట్ లో తెలంగాణ బిల్లును పెట్టే స‌మ‌యంలో ఢిల్లీ వెళ్తూ ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం నుండి వెళ్తున్నా .. తిరిగి తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడ‌తా అని ప్ర‌క‌టించి వెళ్లిన విష‌యం గుర్తుకు తెచ్చుకోవాలి. ఇచ్చాం .. తెచ్చాం .. ఇప్పించాం అని ఎవ‌రు ఎన్ని చెప్పినా కేసీఆర్ చెప్పిన ఈ మాట‌లు ప్ర‌జ‌లు ఎన్న‌టికీ మ‌ర‌చిపోరు.

అయితే తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్ల‌మెంటులో ఆమోదం పొందిన మ‌రుక్ష‌ణం నుండే కేసీఆర్ ప్రాధాన్య‌త‌ను త‌గ్గించే కుట్ర‌ల‌కు ఆంధ్రా మీడియా, పెట్టుబ‌డిదారులు తెర‌లేపారు. అయినా కేసీఆర్ వెన‌క‌డుగు వేయ‌కుండా ప్ర‌జ‌ల‌నే న‌మ్ముకుని ప్ర‌జ‌ల్లోకే వెళ్లి ఒంట‌రిగా పోటీ చేసి తొలి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి అయ్యారు. ఇక ముఖ్య‌మంత్రి అయిన వెంట‌నే ఆంధ్రా ఆధిప‌త్య రాజ‌కీయ పార్టీలు కేసీఆర్ ప్ర‌భుత్వాన్ని అభాసుపాలు చేయ‌డానికి .. అస్థిర ప‌రిచే ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టారు. అన్ని కుట్ర‌ల‌ను చేధించి కేసీఆర్ తెలంగాణ‌ను అభివృద్ది ప‌థంలోకి మ‌ళ్లించారు.

ఈ రోజు తెలంగాణ వ‌చ్చిన మూడేళ్ల‌లోనే దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌క‌న్నా అనేక అంశాల‌లో ముందుంది. మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ, టీ ఎస్ ఐపాస్, టీ హ‌బ్ ల‌తో ప్ర‌పంచ దేశాల‌ను ఆక‌ట్టుకుంటుంది. దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌కు ఆద‌ర్శంగా మారింది. తెలంగాణ నీటి పారుద‌ల ప్రాజెక్టులు పూర్త‌యితేనే తెలంగాణ‌కు భ‌విష్య‌త్ అని భావించిన కేసీఆర్ ఆ విష‌యంలో ప‌ట్టుద‌ల‌గా ముందుకు వెళ్తున్నారు. ప్రాజెక్టుల నిర్మాణం అంటే ద‌శాబ్దాల పాటు ఎదురుచూపు అన్న‌ది గ‌త పాల‌కుల విష‌యంలో మనం చూసిందే కానీ ప‌ట్టుద‌ల ఉంటే కానిది లేదు అంటూ కేసీఆర్ ప్ర‌ణాళికాబ‌ద్దంగా మూడేండ్ల‌లోనే అనేక ప్రాజెక్టుల‌ను రికార్డు స్థాయిలో నిర్మించారు. మ‌రిన్ని ఈ రెండేళ్ల‌లో పూర్తి కానున్నాయి. మొత్తానికి కేసీఆర్ అప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. ఇప్పుడు అభివృద్ది విష‌యంలో చిత్త‌శుద్దితో ముందుకు వెళ్తూ తెలంగాణ భ‌విష్య‌త్ ను నిర్మిస్తున్నారు.

story by :

SandeepReddy Kothapally

 

(Visited 4,505 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *