కేంద్ర ఉద్యోగాల్లో మ‌న‌మెక్క‌డ ?

కేంద్ర ఉద్యోగాల్లో మ‌న‌మెక్క‌డ ?

మా నీళ్లు, మా భూములు, మా కొలువులు మాకేనని మర్లబడ్డ తెలంగాణ బిడ్డలకు.. పోరాటం వెన్నతో పెట్టిన విద్య! తొలిదశ తెలంగాణ పోరాటం నుంచి మలిదశ ఉద్యమంలో ప్రత్యేకరాష్ట్రం సాధించడంలో విద్యార్థులదే కీలకభూమిక! ఉద్యమమైనా, ఉద్యోగమైనా సత్తా చాటడంలో తెలంగాణ యువత ఎవరికీ తీసిపోదు. దేశవ్యాప్తంగా పోటీపడి ఐఐటీ సీట్లు, విదేశాల్లో ఐటీ కొలువులు సాధించడంలో గుత్తాధిపత్యం తెలుగోళ్లదే. ఇంత ప్రతిభ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో తడబడుతున్నారు. ఇక్కడి యువత కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురుచూస్తుంటే, ఉత్తరాది యువత కేంద్ర ఉద్యోగాలను తన్నుకుపోతున్నది. ఉదాహరణకు 2015-16 ఏడాదికి ఎస్సెస్సీ(స్టాఫ్ సెలక్షన్ కమిషన్) 24,604 ఉద్యోగాలు భర్తీచేసింది.

ఇందులో సదరన్ రీజియన్ నుంచి 1098 మందికి(4.46 శాతం) ఉద్యోగాలు వచ్చాయి. నార్తర్న్, సెంట్రల్ రీజియన్‌లో 18,730 మందికి (76.02శాతం) ఉద్యోగాలు వచ్చాయి. సదరన్ రీజియన్‌లో తెలంగాణ నుంచి ఎవరైనా ఉన్నారనేది కూడా అనుమానమే! ఎందుకంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌ను దేశవ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాలుగా విభజించారు. సదరన్ రీజియన్‌లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరితో కలిసి తెలంగాణ రాష్ట్రం ఉన్నది. 2014లోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ, 2015-16 వార్షిక నివేదికలో సదరన్ రీజియన్‌లో తెలంగాణను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పేర్కొనలేదు. ఈ లెక్కన తెలంగాణ నుంచి ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎన్నికవుతున్నారనేది అనుమానంగా ఉన్నది.

లక్షల్లో కేంద్ర ప్రభుత్వ కొలువులు

కేంద్రంలోని వివిధ మంత్రిత్వ విభాగాల్లోని ఖాళీలను నింపటానికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్‌బోర్డు, ఐబీపీఎస్ వంటి సంస్థలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. 2013 నుంచి ఇప్పటి వరకు 4,72,388 ఖాళీలను ఆయా సంస్థలు పోటీపరీక్షలు నిర్వహించి భర్తీచేశాయి. ఇవేగాక ఈ ఏడాదిలో 2.5 లక్షల రైల్వే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. 2013లో 1,22,387 ఖాళీలు, 2014లో 59,122 ఖాళీలు, 2015లో 1,70,063 ఖాళీలు, 2016లో 84,401, 2017లో 36,415 ఖాళీలు భర్తీ అయ్యాయి. వీటిలో సదరన్ రీజియన్ వాటా చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎల్డీసీ, యూడీసీ, స్టెనో, మల్టీస్కిల్డ్ ఎంప్లాయీస్ తదితర ఉద్యోగాలను, సీఐఎస్‌ఎఫ్, ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్, అస్సాం రైఫిల్స్, ఢిల్లీ పోలీస్ మొదలైన సంస్థల్లో కానిస్టేబుల్, ఏఎస్సై, ఎస్సై, కమాండెంట్ తదితర ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాయి. ఏటా ఇంటర్మీడియట్ విద్యార్హతతో కంబైన్డ్ హయ్య ర్ సెకండరీ లెవెల్ (10+2) ఎగ్జామినేషన్ ద్వారా, కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ(జీడీ) పరీక్షల ద్వారా నియామకాలు జరుపుతున్నది.

వేలల్లో ఉద్యోగాలు.. లక్షల్లో నిరుద్యోగులు

సమైక్యరాష్ట్రంలో నాటిపాలకులు ముల్కీరూల్స్‌ను బొందపెట్టి, 610 జీవోను అటకెక్కించి.. జోన్లు, ఫ్రీజోన్లతో, స్టేట్ క్యాడర్ తదితర కొర్రీలతో ఉద్యోగాలన్నీ ఆంధ్రోళ్లకే కట్టబెట్టారు. అందుకే పరాయిపాలన నుంచి వేరుపడిన స్వతంత్ర తెలంగాణలో ప్రతీ నిరుద్యోగి ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ 29వ రాష్ట్రంగా అవతరించిన చిన్నరాష్ట్రమైన తెలంగాణ ఎన్ని కొలువులను సృష్టించగలదు? ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కలిపి లక్షపై చిలుకు కొలువుల భర్తీని టీఆర్‌ఎస్ సర్కారు చేపడుతున్నది. ఇవీ భర్తీ అయ్యాక, ఒక్కో ఏడాదిలో ఖాళీ అయ్యే ఉద్యోగాల సంఖ్య నామమాత్రంగానే ఉంటుంది. మరోవైపు టీఎస్‌పీఎస్సీ వద్ద నమోదైన నిరుద్యోగుల సంఖ్య అక్షరాలా 17 లక్షలు! ఏటా మరో రెండున్నర లక్షల మంది పట్టభద్రులు బయటికివస్తున్నారు.

ఇక లక్ష ఉద్యోగాల భర్తీ పూర్తయితే మిగతావాళ్ల సంగతేమిటనేది ప్రశ్నార్థకం? దేశవ్యాప్తంగా భర్తీ అయ్యే కేంద్ర ఉద్యోగాలకు మనమూ పోటీపడి సాధించుకోవచ్చనే నిజాన్ని గుర్తిస్తే, ప్రతిభావంతులైన తెలంగాణ యువత సింహభాగం కైవసం చేసుకోవడం ఖాయం. కేంద్ర ఉద్యోగాల్లో తెలంగాణ రాష్ట్ర భాగస్వామ్యం అధ్వాన్నంగా ఎందుకు ఉన్నదని పరిశీలించినపుడు ఆసక్తికర విషయాలు తెలిశాయి. కేంద్రస్థాయిలో ఉద్యోగాలను భర్తీచేసే సంస్థలు ఉన్నాయనే విషయం తెలంగాణ నిరుద్యోగులకు తెలియకపోవడం ప్రధానకారణం. తెలిసినా ఆ ఉద్యోగాలు దక్కవనే నిరాశే ఎక్కువ. కొద్దిమందికి అవగాహన ఉన్నప్పటికీ, కోచింగ్ కోసం వేలకువేలు ఖర్చుపెట్టే తాహతు లేదు. మనచుట్టూ ఉన్న కోచింగ్ సెంటర్లు అస్తమానం పరిమితసంఖ్యలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకే ప్రచారాన్ని కల్పించడం మరో కారణం. కానీ రాష్ట్ర ఉద్యోగాల మాదిరే కేంద్ర ఉద్యోగాలకు సన్నద్ధమైతే తెలంగాణ యువత సత్తా చాటుతుందనేది అక్షర సత్యం.

భవిష్యత్‌కు బాటలువేస్తున్న సర్కారు

సమైక్యపాలనలో తెలంగాణ యువత పొట్టకొట్టిన అవినీతి ఏపీపీఎస్సీని అధికారంలోకి రాగానే టీఆర్‌ఎస్ ప్రభుత్వం విభజించింది. టీఎస్‌పీఎస్సీని ఏర్పాటుచేసి తెలంగాణవాది ప్రొఫెసర్ ఘంటా చక్రపాణికి పగ్గాలు అప్పగించి పారదర్శక నియామకాలకు శ్రీకారం చుట్టింది. టీఎస్‌పీఎస్సీ వద్ద ఇప్పటికే నమోదైన ఉద్యోగార్థుల సంఖ్య 17,00,000పైనే, దీనికితోడు ఏటా కనీసం రెండున్నర లక్షలమంది జమవుతున్నారు. అంటే నిరుద్యోగులు లక్షల్లో, రాష్ట్రప్రభుత్వం ఇవ్వగలిగిన ఉద్యోగాలు వేలల్లో ఉన్నాయి. దీనికి పరిష్కారం ప్రత్యామ్నాయ ఉద్యోగాలే. రాష్ట్రంలోనే కాకుండా కేంద్రప్రభుత్వ సంస్థల్లోని వివిధవిభాగాల్లో ఏటా భర్తీచేసే లక్షల ఉద్యోగ అవకాశాలవైపు దృష్టిసారిస్తే ప్రతిభావంతులకు కొలువులు దక్కుతాయి.

అందుకే సమైక్యరాష్ట్రంలో మూలనపడ్డ జవహర్‌నాలెడ్జ్ సెంటర్(జేకేసీ)లను తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్‌అండ్ నాలెడ్జ్ సెంటర్ (టాస్క్)గా మార్చి వేలమంది నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణను ప్రభుత్వం అందిస్తున్నది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగంలో పనిచేస్తున్న టీసాట్ సైతం నిరుద్యోగులను మేల్కొలిపే ప్రయత్నానికి శ్రీకారం చుట్టబోతున్నది. తెలంగాణ ఉన్నత విద్యామండలి,టాస్క్, డిజిటల్ మీడియా విభాగాలతో కలిసి టీ-దిశ 2020 కార్యక్రమాన్ని రూపొందిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 50 కేంద్రాల్లో కేంద్ర ఉద్యోగాలపై అవగాహన కల్పించనున్నది. ఆ పోటీ పరీక్షలను ఎదుర్కోవడానికి కావాల్సిన నైపుణ్యాన్ని దూరవిద్య ద్వారా టీ-సాట్ నిపుణ, టీ-సాట్ విద్య చానళ్ల ద్వార నిరంతరం అందిస్తున్నది. టాస్క్ ద్వారా ఆన్‌లైన్ కోచింగ్,ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నది. 2020 వరకు దేశంలోని ప్రభుత్వ సంస్థల్లో సింహభాగం ఉద్యోగాలు తెలంగాణ యువత ఉండేలా చేయడమే టీ-సాట్, టాస్క్ లక్ష్యంగా పెట్టుకొన్నాయి.

శైలేష్ రెడ్డి
న‌మ‌స్తే తెలంగాణ సౌజ‌న్యంతో

(Visited 121 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *