‘స్నేహమేరా జీవితం’ మూవీ రివ్యూ

‘స్నేహమేరా జీవితం’ మూవీ రివ్యూ

‘స్నేహమేరా జీవితం’ మూవీ రివ్యూ

నటీనటులు- శివబాలాజీ, రాజీవ్ కనకాల, సుష్మ యార్లగడ్డ, సత్య తదితరులు

సంగీతం-సునీల్ కశ్యప్

ఛాయాగ్రహణం- భరణి ధరన్

నిర్మాత: శివబాలాజీ

రచన-దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి

 శివబాలాజీ హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘స్నేహమేరా జీవితం’ సినిమా రిలీజైన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి.

80వ దశకం నేపథ్యంలో సాగే సినిమా ‘స్నేహమేరా జీవితం’. మోహన్ (శివబాలాజీ) అనే అనాథ అయిన కుర్రాడు.. చలపతి అనే కొంచెం డబ్బు, పొగరు బాగా ఉండి రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిపోవాలని చూసే మరో కుర్రాడు చలపతి (రాజీవ్ కనకాల).. వీళ్లిద్దరూ తమ మధ్య అంతరాల్ని పక్కన పెట్టేసి మంచి స్నేహితులుగా కొనసాగుతుంటారు. మోహన్.. చలపతికి చెందిన కొయ్యల డిపోలోనే పని చేస్తుంటారు. వీళ్లిద్దరి స్నేహం సాఫీగా సాగిపోతున్న సమయంలోనే మోహన్‌.. ఓ అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయికి కూడా అతడిపై ఇష్టం ఉన్నట్లే ఉంటుంది. కానీ ఆ అమ్మాయిని చలపతితో కలిపి చూడకూడని పరిస్థితుల్లో చూసి కోపం పెంచుకుంటాడు. అతడి మనసు విరిగిపోతుంది. తన స్నేహితుడిపై కోపం పెంచుకుంటాడు. మరోవైపు లేని పోని గొడవల్లో తలదూర్చడం వల్ల అతడి జీవితం కొన్ని మలుపులు తిరుగుతుంది. ఈ పరిస్థితుల్ని అతను ఎలా ఎదుర్కొన్నాడు.. నిజంగా మోహన్‌‌కు చలపతి అన్యాయం చేశాడా.. వీళ్లిద్దరూ చివరికి కలిశారా లేదా అన్నది ‘స్నేహమేరా జీవితం’ కథ.

30, 40 ఏళ్లు వెనక్కి వెళ్లి అప్పటి నేపథ్యంలో ఓ కథను ఆసక్తికరంగా చెప్పడమంటే అంత సులువైన విషయం కాదు.‘స్నేహమేరా జీవితం’ దర్శకుడు మహేష్ ఉప్పుటూరి పరిమిత బడ్జెట్ వనరులతోనే 80ల నాటి వాతావరణాన్ని అందంగా చూపిస్తూ.. మంచి ఎమోషనల్ టచ్ ఉన్న కథను ఆసక్తికరంగా చెబుతూ.. రెండు గంటలకు పైగా ప్రేక్షకుల్ని కూర్చోబెట్టగలిగాడు. స్నేహం నేపథ్యంలో అందరూ రిలేట్ చేసుకోగలిగే కథ.. జీవం ఉన్న పాత్రలు.. నటీనటుల చక్కటి అభినయం.. సాంకేతి ఆకర్షణలు కూడా తోడై ‘స్నేహమేరా జీవితం’ ప్రేక్షకులకు మంచి ఫీలింగే ఇస్తుంది.

‘స్నేహమేరా జీవితం’లో హైలైట్‌గా చెప్పుకోవాల్సిన అంశం 80ల వాతావరణాన్ని చక్కగా చూపించడమే. పరిమిత వనరులతోనే అప్పటి పరిస్థితుల్ని చక్కగా తెరమీదికి తీసుకొచ్చారు. 80ల వాతావరణం తెలిసిన వాళ్లందరికీ ఈ సినిమా నోస్టాల్జిక్‌గా అనిపిస్తుంది. ఇక సినిమాలో ప్రధాన పాత్రల్ని తీర్చిదిద్దిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. పాత్రలు ఏవీ కూడా లార్జర్ దన్ లైఫ్ తరహాలో కనిపించవు. మన చుట్టూ ఉన్న మనుషుల్నే తెర మీద చూస్తున్నట్లుంటుంది. ముఖ్యంగా శివబాలాజీ, రాజీవ్ కనకాల పాత్రలు చాలా బాగా అనిపిస్తాయి. ఇద్దరూ కూడా సహజమైన నటనతో సినిమాను తమ భుజాల మీద నడిపించారు. హీరోయిన్ సుష్మ యార్లగడ్డ ఆద్యంతం రెండు జళ్ళతో కనిపిస్తూ అచ్చమైన తెలుగందంతో ఆకట్టుకుంటుంది. అలాగే చిత్రమైన దొంగ పాత్రలో సత్య కూడా ఆకట్టుకున్నాడు. అతడి పాత్ర పంచే వినోదం సినిమాలో చెప్పుకోదగ్గ హైలైట్లలో ఒకటి. హ్యూమర్ టచ్‌తో పాటు ఎమోషనల్ యాంగిల్ కూడా ఉంటుంది ఆ పాత్రలో.

ఓవరాల్‌గా చూస్తే ‘స్నేహమేరా’ జీవితంలో ప్లస్‌లు చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉన్నాయి. 80ల నేపథ్యంలో మనల్ని పాత రోజుల్లోకి తీసుకెళ్లే సినిమా ఇది. సినిమాలోని పాత్రలు.. వాటి మధ్య సంభాషణలు చాలా సహజంగా, లైవ్లీగా అనిపిస్తాయి. చక్కటి కెమెరా పనితనం వల్ల సన్నివేశాలు ఆహ్లాకరంగా అనిపిస్తాయి. నేపథ్యానికి తగ్గట్లు మంచి మ్యూజిక్ కూడా కుదిరింది. సునీల్ కశ్యప్ పాటల్లో రెండు మూడు బాగున్నాయి. అన్నింట్లోకి మెల్లగా మెల్లగా అంటూ సాగే మెలోడీ బాగా ఆకట్టుకుంటుంది. జ్యోతి లక్ష్మి, జయమాలినిలను గుర్తు చేసే రెండు పాటలు సినిమాలో ఉన్నాయి. హీరోలిద్దరికీ తగినట్లుగా విలన్లను పెట్టలేదు సినిమాలో. అది మైనస్ అనే చెప్పాలి. అలాగే అక్కడక్కడా కథ కొంచెం నెమ్మదిస్తుంది. ప్రధాన పాత్రల మధ్య స్నేహ బంధాన్ని ఇంకొంచెం బలంగా చూపించి ఉండాల్సింది.

శివబాలాజీ, రాజీవ్ కనకాల ఇద్దరూ పోటీపడి నటించారు. నటులుగా వీళ్లిద్దరిలోని కొత్త కోణాలు చూస్తా ఈ సినిమాలో. నటనతో పాటు ఇద్దరి డైలాగ్ డెలివరీ కూడా బాగుంది.  మహేష్ ఉప్పుటూరి రచయితగా, దర్శకుడిగా తన పనితనం చూపించాడు. పాత్రల్ని తీర్చిదిద్దుకున్న తీరులో, సంభాషణల విషయంలో సహజత్వం కనిపిస్తుంది. పరిమిత బడ్జెట్లోనే 80ల వాతావరణాన్ని చక్కగా చూపిస్తూ ఉన్నంతలో మంచి క్వాలిటీలోనే సినిమా తీశాడు. కథకు కీలకమైన సన్నివేశాల్లో అతడి పనితనం కనిపిస్తుంది. సాంకేతిక విభాగాలన్నీ బాగానే పని చేశాయి. సినిమా నిడివి తక్కువే కావడం, వేగంగా సాగిపోవడం ప్లస్ పాయింట్. నిర్మాతగా శివబాలాజీ తన అభిరుచిని చాటుకున్నాడు. ఇలాంటి సినిమాను నిర్మించడం ఒక రకంగా రిస్కే. అయినా అతను చేసిన సాహసానికి మంచి ఫలితమే దక్కొచ్చు.

ట్రైలర్ చూసి ఒక అంచనాతో వచ్చే ప్రేక్షకుల్ని ఈ సినిమా నిరాశ పరచదు. స్నేహం మీద నడిచే సినిమా కావడం వల్ల ‘స్నేహమేరా జీవితం’ యూత్‌కు బాగా కనెక్టయ్యే అవకాశముంది. పెద్ద కారణాలేమీ లేకుండానే అపార్థాల వల్ల విడిపోయిన స్నేహితులెవరైనా ఈ సినిమా చూస్తే రియలైజ్ అయ్యి మళ్లీ మాట్లాడుకుని ఒక్కటి కావాలని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు శివబాలాజీ ఈ మధ్య బాగా చేరువ కావడం, ఈ చిత్రానికి వారు ముందుగానే తమ సపోర్ట్ ఇవ్వడం, మంచి టైమింగ్‌లో చక్కగా ప్రమోట్ చేసి పాజిటివ్ బజ్ మధ్య సినిమాను రిలీజ్ చేయడం వల్ల ఈ చిత్రానికి ఆదరణ బాగానే ఉండే అవకాశముంది. సినిమాలో కంటెంట్ కూడా బాగానే ఉండటంతో ‘స్నేహమేరా జీవితం’ శివబాలాజీకి సోలో హీరోగా, అలాగే నిర్మాతగా మంచి ఫలితాన్ని అందించే అవకాశముంది.

రేటింగ్- 3/5

(Visited 86 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *