సరిగ్గా పన్నేండేళ్ల క్రితం..

సరిగ్గా పన్నేండేళ్ల క్రితం..

బెంగుళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆ నిజామాబాద్ యువకుడు దసరాకు హైదరాబాద్ వద్దామని బస్ స్టాండుకు వెళ్లాడు. ఎన్ని ట్రావెల్స్ ఆఫీసుల దగ్గర చూసినా ఒక్క బస్సులో కూడా సీట్లు లేవు. తిరిగి తిరిగి ఉస్సూరుమంటూ వెనక్కి వచ్చేశాడు. ఒక ఫాస్ట్ ఫుడ్ జాయింటులో కూర్చుని ఆ రాత్రి డిన్నర్ చేస్తుంటే మెరుపులా మెరిసింది ఆ యువకుడి బుర్రలో ఆలోచన.

విమానం టికెట్లూ, రైలు టికెట్లూ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయికదా మరి బస్సు టికెట్లు ఎందుకు దొరకవు అనే ప్రశ్న ఆ వెంటనే మనమే ఒక వెబ్ పోర్టల్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్న ఆలోచన. వెంటనే తన ఇద్దరు మిత్రులకు తన ఆలోచన వివరిస్తే వారూ ఇది బాగుంది అన్నారు.

అలా మొదలైందే రెడ్‌బస్ పోర్టల్. ఆ నిజామాబాద్ పిలగాడే ఫణీంద్ర సామ

అలా మొదలైన రెడ్‌బస్ ప్రస్థానం భారత స్టార్టప్ సంస్థల చరిత్రలోనే ఒక సంచలనం. ఇంతింతై, వటుడింతై అన్నట్టు అంచెలంచలుగా ఎదిగిన ఆ సంస్థకు మూల స్థంభం ఆ సంస్థ వ్యవస్థాపకుడు, సి.ఈ.ఓ. మన తెలంగాణ బిడ్డ ఫణీంద్ర సామ.

అయితే ఈ ప్రయాణం అంత సులువుగా ఏమి జరగలేదు. అసంఘటిత రంగంగా ఉన్న బస్ టికెట్ వ్యాపారంలో ఆన్లైన్ విధానం తేవడానికి ఫణి బృందం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ నగరాల్లో ఉన్న బస్ టికెట్ అమ్మకందార్ల చుట్టూ అనేకసార్లు తిరిగిన ఫణి ఆన్లైన్ విధానం వల్ల లాభాలు వారికి వివరించి వారిని ఒప్పించాడు. పార్టనర్ లు ముగ్గురూ తమతమ ఉద్యోగాలు వదిలి ఏడాదిన్నర పాటు అష్టకష్టాలు పడ్డాక రెడ్ బస్ పోర్టల్ మెల్లగా పట్టాలు ఎక్కింది.

2013లో ఐబిబో అనే కంపెనీ రెడ్‌బస్‌ను దాదాపు 700 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకూ మనదేశంలో స్థాపించిన మరే అంకుర సంస్థకూ ఈ స్థాయిలో వాల్యుయేషన్ రాలేదంటే ఫణీంద్ర బృందం సాధించిన విజయం ఎంతటిదో తెలుస్తుంది.

సీన్ కట్ చేస్తే.

తెలంగాణ వచ్చిన తరువాత అంకుర సంస్థలకు తోడ్పాటు కొరకు ఒక ఇంక్యూబేటర్ టీ-హబ్ ను స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే టీ-హబ్ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నది. దాదాపు 13 రాష్ట్రాల ప్రతినిధులు ఇప్పటికి టీ-హబ్ ను సందర్శించి ప్రశంసించారు. మూడు నాలుగు రాష్ట్రాలు టీ-హబ్ స్ఫూర్తిగా తమ రాష్ట్రాల్లో కూడా ఇంక్యుబేటర్లను నెలకొల్పుతున్నాయి.

టీ-హబ్ ఫేజ్ 2 ప్రపంచంలోనే అతి పెద్ద ఇంక్యుబేటర్ గా రూపు దిద్దుకుంటోంది. దేశంలో అతి పెద్ద ప్రొటొటైపింగ్ ల్యాబ్ టీ-వర్క్స్ కూడా త్వరలోనే శంకుస్థాపన జరగనుంది.

అటు టీ-హబ్, ఇటు టీ-వర్క్స్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అంకుర పరిశ్రమలకు, ఔత్సాహిక పరిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ఒకదాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రానికి ఒక చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ను నియమించాలని మంత్రి కేటీఆర్ గారు దేశం మొత్తంలో మన తెలంగాణకు చెందిన వ్యక్తులు ఈ రంగంలో ఎవరున్నారు అని జల్లెడ పట్టి గాలించారు.

అదిగో అప్పుడు కనపడ్డాడు ఫణీంద్ర సామ.

మొదటి కంపెనీనే బ్రహ్మాండమైన విజయం సాధించినా ఫణీంద్ర విశ్రమించలేదు. ఐటీ రంగంలో తెలంగాణ తొలితరం సక్సెస్ స్టోరీ సియర్రా అట్లాంటిక్ అధినేత రాజు రెడ్డితో కలిసి నిజామాబాదులో కాకతీయ సాండ్‌బాక్స్ పేరిట తెలంగాణలో నూతన ఆవిష్కరణలకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు దన్నుగా ఉండే ఒక స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు. రైతులకు ఉపయోగపడే అనేక విప్లవాత్మకమైన ఆలోచనలకు కాకతీయ సాండ్ బాక్స్ సాయం చేస్తోంది

తెలంగాణ ప్రభుత్వం ఏ రంగంలోనైతే పని చేయాలనుకుంటున్నదో ఆ రంగంలోనే పనిచేస్తూ, పుట్టినగడ్డ తెలంగాణ పట్ల పావురంతో పనిచేస్తున్న ఫణీంద్ర సామనే రాష్ట్రానికి చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ గా సరైన వ్యక్తి అని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విన్నూత్న పోస్టుకు ఎంపిక చేసింది.

మన రాష్ట్రంలో స్కూలు పిల్లల స్థాయి నుండే నూతన ఆవిష్కరణల పట్ల ఆసక్తిని రేకెత్తించే విధంగా కార్యక్రమాలు రూపొందించడం, కళాశాలల్లో నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇచ్చేందుకు ఎంటర్ప్రెన్యూర్షిప్ సెల్స్ ఏర్పాటు చేయడం, స్కూలు, కళాశాల స్థాయిలో Ideas Contests నిర్వహించడం, టీ-హబ్, టీ-వర్క్స్ ద్వారా తెలంగాణాలో గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఆవిష్కరణలకు తోడ్పాటు అందివ్వడం, ఇటువంటి ఎన్నో ఆసక్తిదాయకమైన పనులు ఫణీంద్ర సామ మార్గదర్శకత్వంలో జరగనున్నాయి.

నిన్ననే మంత్రి కేటీఆర్ చేతులమీదుగా నియామక పత్రం అందుకున్నాడు ఫణీంద్ర.

సోరీ బై : దిలీప్ కొణతం
తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్

(Visited 1,051 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *