చీక‌టి నుండి వెలుగుల వైపు

చీక‌టి నుండి వెలుగుల వైపు

ప్ర‌ణాళికా లోపం .. గ‌త పాల‌కుల నిర్ల‌క్ష్యం మూలంగా తెలంగాణ వ‌చ్చే నాటికి గాఢాంధ‌కారం అలుముకుంది. ఈ రోజు తెలంగాణ‌లోని అన్ని రంగాల‌కు 24 గంట‌ల నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా అవుతుంది. తెలంగాణ ఏర్పడిన సమయానికి రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 6574 మెగావాట్లుంటే.. గడిచిన మూడున్నరేండ్లలోనే అదనంగా 7981 మెగావాట్లను సమకూర్చుకున్నాం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ఫలితంగా నేడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 14,555 మెగావాట్లకు పెరిగిందని వివరించారు. భావి అవసరాలకోసం మరో 13,752 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతున్నదని చెప్పారు.

కొత్తగా తీసుకువచ్చిన సోలార్ విద్యుత్ పాలసీ ఫలితంగా 2792 మెగావాట్ల సౌరవిద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే అగ్రగామిగా నిలిచామని కేసీఆర్ ప్రకటించారు. విద్యుత్ పంపిణీ, సరఫరా వ్యవస్థల బలోపేతానికి రూ.12,136 కోట్లతో చర్యలు తీసుకున్నామని తెలిపారు. మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని చెప్పారు. రాబోయే మూడు నాలుగేండ్లలో పంపిణీ, సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేయడానికి రూ.42 వేల కోట్ల పెట్టుబడితో సబ్‌స్టేషన్లు ఏర్పాటుచేయబోతున్నామని కేసీఆర్ వివరించారు.

విద్యుత్ సంస్థలను సంస్థాగతంగా బలోపేతం చేయడానికి 22,550 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టు వ్యవస్థనుంచి తప్పించి నేరుగా జీతాలు చెల్లిస్తున్నదని, కొత్తగా 13,357 ఉద్యోగాలను భర్తీచేస్తున్నదని చెప్పారు. రాజధాని హైదరాబాద్ నగరంలో నిరంతర విద్యుత్ సరఫరాకు వీలుగా జీహెచ్‌ఎంసీ చుట్టూ.. 142 కి.మీ. మేర 400 కేవీ రింగ్‌సిస్టం ఏర్పాటుశామని తెలిపారు. ఈ లైన్ల అనుసంధానానికి 220 కేవీ సబ్ స్టేషన్లు ఆరింటిని నిర్మించామని చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్న శుభ తరుణంలో రైతులు ఆటోస్టార్టర్లను తొలిగించుకోవాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తిచేశారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్‌ను అవసరమున్నంతమేర సరఫరా చేయడానికి ప్రభుత్వం అంకితభావంతో కృషిచేస్తుందని ప్రకటించారు. సీఎం ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి..

గత పాలకుల నిర్లక్ష్య వైఖరివల్ల, ప్రణాళికాలోపంవల్ల అన్నిరంగాల్లో గాఢాంధకారం అలుముకుంది. విద్యుత్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. అలాంటి పరిస్థితినుంచి నేడు.. ఈ సభలో నేను ఈ ప్రకటన చదువుతున్న నిమిషానికి రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటలపాటు నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని సగర్వంగా, సంతోషంగా ప్రకటిస్తున్నాను. తెలంగాణ ఏర్పడిననాడు రాష్ట్రంలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 6574 మెగావాట్లుంటే.. ఇందులో నికరంగా విద్యుత్ అందే థర్మల్ ప్లాంట్ల సామర్థ్యం 4300 మెగావాట్లు. జలవిద్యుత్ 2081 మెగావాట్లు. 2700 మెగావాట్లవరకు లోటుండేది. డిమాండ్‌కు సరిపడినంత సరఫరా జరుగలేదు అంటూ నాటి దుస్థితిని సీఎం కండ్లకు కట్టినట్టు చెప్పారు.

11,000 మెగావాట్ల సరఫరాకు సిద్ధం..

ఇటీవల రాష్ట్రంలో 9,500 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ ఏర్పడినా ఎక్కడా రెప్పపాటు సమయం కూడా కోత విధించకుండా రికార్డుస్థాయిలో 198 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేశాం. వచ్చే యాసంగి సీజన్‌లో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇవ్వడంవల్ల ఏర్పడే, 11,000 మెగావాట్ల డిమాండ్‌మేరకు సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి అని సీఎం చెప్పారు.

తెలంగాణ ఏర్పడిన రోజున తీవ్రమైన విద్యుత్ సంక్షోభం నెలకొంది. నిత్యం కరెంటు కోతలతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు. హైదరాబాద్ నగరంలో రోజూ 2-4 గంటలు, ఇతర నగరాలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామాల్లో 9 గంటలపాటు అధికారిక విద్యుత్ కోతలు అమలయ్యేవి. పరిశ్రమలకు వారానికి రెండ్రోజులు పవర్ హాలిడేలుండేవి. ఫలితంగా పరిశ్రమలు పెద్ద ఎత్తున మూతపడ్డాయి. కరెంటు కోసం ఫిక్కీ, సీఐఐ ఆధ్వర్యంలో పారిశ్రామికవేత్తలు నిత్యం ధర్నాలు చేసేవారు. అటు ఇందిరాపార్కు, ఇటు విద్యుత్‌సౌధవద్ద ఎప్పుడూ ఆందోళనలే. హైదరాబాద్‌లో పరిశ్రమలు పెట్టాలంటేనే భయపడే వాతావరణం ఉండేది.

వ్యవసాయానికి రెండు మూడు గంటలు కూడా కరెంటు అందకపోవడంతో పంటలు ఎండిపోయేవి. భూగర్భంలో నీళ్లున్నా.. తోడుకునేందుకు కరెంటు లేక చేతికొచ్చిన పంట కండ్లెదుటే ఎండిపోతున్నా రైతాంగం ఏమీచేయలేని స్థితిలో కొట్టుమిట్టాడేది. అపారమైన పంట నష్టం రైతులను ఆర్థికంగా కుంగదీసేది. చిమ్మ చీకట్లు అలుముకున్న దుస్థితి నుంచి ఇవాళ వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కరించడానికి ఎంతో కృషి జరిగింది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే, విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలు అమలుచేసింది. దాదాపు రూ.94 వేల కోట్ల వ్యయంతో తెలంగాణను మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చేందుకు కార్యాచరణ రూపొందించింది. అందులో భాగంగా.. నత్తనడకన నడుస్తున్న ప్లాంట్ల నిర్మాణాన్ని పరుగులు పెట్టించింది. కొత్త ప్లాంట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్ఠం చేసింది.

మూడున్నరేండ్లలో 7981 మెగావాట్లు

తెలంగాణ ఏర్పడే నాటికి 6574 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉంటే.. గడిచిన మూడున్నరేండ్లలో అదనంగా మరో 7981 మెగావాట్ల విద్యుత్‌ను సమకూర్చుకోగలిగింది. సింగరేణి పవర్ ప్లాంటు ద్వారా 1200 మెగావాట్లు, కేటీపీపీ ద్వారా 600, జూరాలద్వారా 240, పులిచింతలద్వారా 90, ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మెగావాట్లు, సీజీఎస్ తదితర మార్గాల ద్వారా మరో 2000 మెగావాట్లను అదనంగా సమకూర్చుకున్నాం అని సీఎం వివరించారు.

సోలార్‌లోనూ మనదే పైచేయి

గ్రీన్ పవర్ ఉత్పత్తి గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో రాష్ట్రంలో కొత్త సోలార్ పాలసీని తీసుకువచ్చాం. దీని ఫలితంగా రాష్ట్రం 2792 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తితో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది అని కేసీఆర్ తెలిపారు.

(Visited 79 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *