కాళేశ్వ‌రం రైట్ రైట్

కాళేశ్వ‌రం రైట్ రైట్

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులపై స్టే విధిస్తూ ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రధాన బెంచ్ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ చేపడుతున్న చర్యలకు అడ్డంకి కలిగించేలా ఉన్న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేస్తున్నట్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ , జస్టిస్ జే ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

ప్రధానంగా ప్రజల తాగునీటి అవసరాల కోసం చేపడుతున్న భారీ ప్రాజెక్టు పనులను ఆపివేస్తూ ఎన్జీటీ ఉత్తర్వులు ఇవ్వడం అర్థరహితమని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ప్రాజెక్టుకు కేంద్ర అటవీశాఖ ఇప్పటికే స్టేజ్ -1 అనుమతులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించింది. తుది అనుమతులు వచ్చేవరకు అటవీశాఖకు చెందిన భూముల్లో పనులు చేపట్టబోమని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇస్తున్నప్పటికీ పనుల నిలిపివేతకు ఆదేశించడం భావ్యం కాదని పేర్కొంది. అన్ని అంశాలను పరిగణనలోనికి తీసుకొని తిరిగి విచారణ చేపట్టాలని ఢిల్లీ ఎన్జీటీకి స్పష్టంచేసింది. కేసును తిరిగి ఎన్జీటీకి పంపిస్తున్నట్లు తెలిపింది. మరోసారి విచారణ చేపట్టి ఉత్తర్వులు జారీచేసేవరకు కాళేశ్వరం ప్రాజెక్ట్టులో తాగునీటి అవసరాలకు సంబంధించిన పనులను కొనసాగించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇస్తున్నట్లు హైకోర్టు వివరించింది.

రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టుపనులు జరుగుతున్నాయని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దేశాయ్ ప్రకాశ్‌రెడ్డి ఇచ్చిన హామీని పరిగణనలోనికి తీసుకొని ఆయా పనులను కొనసాగించడానికి అనుమతిస్తున్నట్లు తెలిపింది.

(Visited 216 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *