అసెంబ్లీలో అక్బ‌రుద్దీన్ క‌ల‌క‌లం

అసెంబ్లీలో అక్బ‌రుద్దీన్ క‌ల‌క‌లం

ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందే ప్ర‌తిప‌క్షాల గుండెల‌మీద బండ‌రాళ్లు విసిరాడు. రాజ‌కీయ పున‌రేకిర‌ణ అంటూ కేసీఆర్ కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ప్ర‌య‌త్నాల మీద నీళ్లు చ‌ల్లాడు. 60 ఏండ్ల పాల‌న‌లో తెలంగాణ‌కు ఎవ‌రు ఏం చేశారు ? అందులో స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమానికి ఎవ‌రు ఏం ఇచ్చారు ? అంద‌రినీ స‌మానంగా ఎవ‌రు చూశారు ? ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎవ‌రు పెద్ద పీట వేశారు ? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఎంఐఎం ఎమ్మెల్యే అక్డ‌రుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ సాక్షిగా స‌మాధానం ఇచ్చారు. ప‌నిలో ప‌నిగా ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కేసీఆర్ కు చాలా చిన్న‌దని చెప్పి ప్ర‌తిప‌క్ష పార్టీలకు ఆఖ‌రిపంచ్ ఇచ్చాడు.

2019లో తెలంగాణ‌లో మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చేది టీఆర్ఎస్ పార్టీనే అని ఢంకా బ‌జాయించి భ‌విష్య‌త్ ను ప్ర‌తిప‌క్షాల ముందు ఉంచాడు. రెండేళ్ల క్రితం పిట్ట‌క‌థ‌ల‌తో ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన అక్బ‌రుద్దీన్ తెలంగాణ‌లో ప్ర‌ణాళికాబ‌ద్దంగా అభివృద్దిని చూసి త‌న ఆలోచ‌న‌ను మార్చుకుని ప్రభుత్వాన్ని, కేసీఆర్ ను పొగిడిన తీరు రాజ‌కీయ వ‌ర్గాల‌లో క‌ల‌క‌లం రేపింది. గ‌తంలో ఎన్న‌డూ ఏ ప్ర‌భుత్వానికి ఇంత సూటిగా ప్ర‌శంస‌లు ఇవ్వ‌ని అక్బ‌రుద్దీన్ ఇలా మాట్లాడ‌డం ఎంద‌రో నేత‌ల‌కు మింగుడు ప‌డ‌డం లేదంటే అతిశ‌యోక్తి కాదు.

ముస్లింలకు రిజర్వేషన్లు ఫాస్ట్‌పుడ్ తయారుచేసినంత ఈజీ కాదు అని మాకు తెలుసు. కేసీఆర్ ప్ర‌భుత్వం రిజ‌ర్వేష‌న్లు సాధించి తీరుతుంద‌ని మాకు న‌మ్మ‌కం ఉంది. కాంగ్రెస్ 60 ఏండ్లు అధికారంలో ఉన్నా ముస్లింల‌కు చేసింది ఏమీ లేదు. గత ప్ర‌భుత్వాల చిన్న‌చూపు కార‌ణంగా మైనార్టీలు వెన‌క‌ప‌డ్డారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఎలా నామరూపాలు లేకుండాపోయాయో.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే జరుగుతుంది. ఇది సోషల్‌మీడియా జమానా. పనులు జరుగుతున్నాయా? లేదా? అని ప్రజలందరూ చూస్తున్నారు, వారికి అన్నీ తెలుస‌ని అక్బ‌రుద్దీన్ ఓవైసీ అన్నారు.

ముస్లింల సంక్షేమానికి కేసీఆర్ పాటుపడుతున్న తీరుచూస్తుంటే ఆయనపై ముస్లింలు పెట్టుకున్న ఆశలు నెరవేరుతున్నట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్ వాళ్లు 10 వేలలోపు ర్యాంకులు వచ్చిన ముస్లిం విద్యార్థులకే ఫీజు రీయింబర్స్‌మెంట్ కల్పించి పోతే, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత తాము కేసీఆర్‌ను కలిసి విషయాన్ని వివరించడంతో ర్యాంకుతో నిమిత్తం లేకుండా విద్యార్థులందరికీ రీయింబర్స్‌మెంట్ వర్తింపజేసేందుకు వెంట‌నే అంగీక‌రించారు. షాదీముబారక్, ముస్లిం విద్యార్థుల విదేశీ విద్యకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్ పథకం తదితరాలు తీసుకువచ్చారని, జామేనిజామియా ఆడిటోరియంకోసం రూ.14 కోట్లు, నాంపల్లి వద్ద అనీసుర్‌గుర్బా అనాథాశ్రమానికి 4500 గజాల స్థలం, కొత్త భవననిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరుచేశారని అక్బ‌రుద్దీన్ కొనియాడారు.

ప్రతి ఏడాది ఐఏఎస్, ఐపీఎస్ ప్రిలిమ్స్, మెయిన్స్ రాసే 100 మంది మైనార్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నారని, మక్కామసీదు ఆధునీకరణకు సీఎం ఔట్‌ఆఫ్‌ది వేలో రూ.8 కోట్ల నిధులు మంజూరు చేశారని వివరించారు. మైనార్టీ విద్యార్థులకు ఒకేసారి 204 రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటుచేసిన ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనైనా ఉందా? అని ఆయన ప్రశ్నించారు. వక్ఫ్ ట్రిబ్యునల్ ఏర్పాటు, రంజాన్‌లో ముస్లింలకు ఇఫ్తార్ విందు వంటివి కేసీఆర్ వచ్చిన తరువాత అమలవుతున్నాయన్నారు. అంతర్జాతీయ ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌కు ఐదెకరాలు కోరితే.. సీఎం ఉదారభావంతో పదెకరాలు కేటాయించార‌ని అక్బ‌రుద్దీన్ అన్నారు. నాలుగుశాతం ముస్లిం రిజ‌ర్వేష‌న్లు కాంగ్రెస్ ఇవ్వ‌లేద‌ని, అదే జ‌రిగితే మ‌రి కాంగ్రెస్ పాలిత మిగ‌తా రాష్ట్రాల‌లో అది ఎందుకు అమ‌లుకావ‌డం లేద‌ని కాంగ్రెస్ స‌భ్యుల‌ను అక్బ‌రుద్దీన్ ప్ర‌శ్నించారు.

మొత్తానికి స‌భ‌లో అక్బ‌రుద్దీన్ ప్ర‌సంగం సాగిన తీరు విప‌క్షాల‌కు కంటి మీద కునుకులేని ప‌రిస్థితి క‌ల్పించింద‌న‌డంలో సందేహం లేదు. తెలంగాణ వ‌చ్చిన తరువాత ముస్లిం మైనార్టీ రెసిడెన్షియ‌ల్ పాఠ‌శాల‌లు, షాదీ ముబార‌క్ ప‌థ‌కాలు ముస్లింల జీవితాల‌లో మార్పును తీసుకువ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్బ‌రుద్దీన్ వాస్త‌వ ప‌రిస్థితిని అంచ‌నా వేసి ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడారు. ఈ విష‌యం విప‌క్షాల‌కు గిట్ట‌ద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

 

 

 

(Visited 582 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *