మీ జాతాకాలు మా వ‌ద్ద ఉన్నాయి

మీ జాతాకాలు మా వ‌ద్ద ఉన్నాయి

అన్ని రాజ‌కీయ పార్టీల‌కు చెందిన అంద‌రి చ‌రిత్రా ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంది. భూ రికార్డుల ప్ర‌క్రియ నిరంత‌రం సాగేది అని మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సొంతూరులో ఆయన తండ్రి 15 ఏళ్ల క్రితం విక్రయించిన భూమి వివరాలే ఇప్పటి వరకు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించలేదని, ఇది నాటి కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుకు నిదర్శనం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ‘భూమి రికార్డుల శుద్ధీకరణ, నవీకరణ’ అంశంపై జరిగిన లఘుచర్చలో ఆయ‌న మాట్లాడారు.

భూ కబ్జాలకు పాల్పడిన రాజకీయ పార్టీలకు చెందిన పత్రాలు, అందరి చరిత్రలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, అసైన్ట్ భూముల అంశంపై మాజీ మంత్రి పొన్నా ల లక్ష్మయ్య చరిత్రను సభాసంఘం తేలుస్తుందని కేసీఆర్ అన్నారు. రైతులకు రెండు పంటలకు రూ.4వేల చొప్పున పెట్టుబడి అందిస్తున నేపథ్యంలో ప్రజాధనం దుర్వినియోగం కావొద్దనే ఉద్దేశంతోనే భూ రికార్డులను సర్వే చేయిస్తున్నామని కేసీఆర్ వివరించారు.

కాంగ్రెస్ సభ్యులు భట్టి విక్రమార్క మాట్లాడుతూ భూ ప్రక్షాళన తామే కొత్తగా చేస్తున్నట్లు టిఆర్‌ఎస్ చెప్పుకుంటుందని, ఇది నిరంతర ప్రక్రియ అని, గత ప్రభుత్వ హాయంలో కూడా రికార్డుల అప్‌డేషన్ జరిగేదని అన్నారు. సభలో ఉన్న ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే జోక్యం చేసుకొని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి భూమి గురించి ప్రస్తావించారు.

ఆయన తండ్రి పురుషోత్తంరెడ్డి 15 సంవత్సరాల క్రితం వారి స్వంత ఊరు సూర్యాపేట జిల్లా తాటిపాములలో 1.30 ఎకరాల భూమిని ధరావత్ హన్మంత్‌నాయక్‌కు సాదా బైనామా ద్వారా అమ్మారని తెలిపారు. ఇటీవల హన్మంత్ నాయక్ దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వాధికారులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని వాకబు చేసి అతని పేరును రికార్డుల్లో చేర్చారని వివరించారు.

భూ రికార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియ అయితే రాష్ట్రాన్ని దశాబ్ధాల కాలం పాలించిన కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్న ఉత్తమ్ తండ్రి పేరే రికార్డుల్లో ఎందుకు మార్చలేకపోయారని కేసీఆర్ ప్రశ్నించారు. తాము చేపట్టిన ప్రక్షాళనపై అనవసర విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రధాన ప్రతిపక్షం నిర్మాణాత్మక సూచనలు ఇస్తే స్వీకరిస్తామని, ఏదో విమర్శలు చేయాలని చూడడం మంచి పద్ధతి కాదన్నారు.

(Visited 444 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *