ఏం చేయ‌బోతున్నాం.. గుట్టువిప్పిన రేవంత్

ఏం చేయ‌బోతున్నాం.. గుట్టువిప్పిన రేవంత్

తెలంగాణ‌లో భ‌విష్య‌త్ లో ఏం జ‌ర‌గ‌బోతుంది ? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు విఫ‌ల‌య‌త్నాలు చేసిన ఆంధ్రా పెట్టుబ‌డిదారి వ‌ర్గాలు, కేసీఆర్ వ్య‌తిరేక వ‌ర్గాలు ఇక ముందు ఏం చేయ‌బోతున్నాయి ? తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీని చంద్ర‌బాబు నాయుడు ఎందుకొర‌కు భూస్థాపితం చేయ‌బోతున్నాడు ? అస‌లు ఆంధ్రా తెలంగాణ రాజ‌కీయాల‌లో 2019లో ఏం జ‌ర‌గ‌నుంది వంటి అనుమానాల‌కు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేర‌బోతున్న రేవంత్ రెడ్డి స‌మాధానాలు చెప్పాడు. కాంగ్రెస్ నాయ‌కుల ఆత్మీయ వేదిక మీద చంద్ర‌బాబునాయుడిని మెచ్చుకుంటూ, ఆంధ్రా అభివృద్దిని ఆకాశానికి ఎత్తుతూ తెలంగాణ మీద లేని ప్రేమ‌ను ప్ర‌క‌టించి తామంద‌రి వ్యూహం ఏంటి అన్న విష‌యాలు అంద‌రికీ అర్థం అయ్యేలా చెప్పాడు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చివ‌రి నిమిషం వ‌ర‌కు అడ్డుకున్న వ‌ర్గాల‌కు తెలంగాణ ఏర్పాటు ఏ మాత్రం మింగుడు ప‌డ‌ని అంశంగా మారింది. ఇక ఆ త‌రువాత ఉద్య‌మ‌నేత కేసీఆర్ ఒంటి చేత్తో అధికారంలోకి రావ‌డం ఈ వర్గాల‌కు సుతార‌మూ న‌చ్చ‌లేదు. అందుకే తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన మూడో రోజు నుండే ఇందుకేనా తెలంగాణ తెచ్చుకున్న‌ది అంటూ అనుకూల ఆంధ్రా మీడియాతో విషం క‌క్కించాయి. అడుగ‌డుగునా తెలంగాణ అభివృద్దికి అడ్డుపుల్ల‌లు వేస్తూ ఆఖ‌రుకు ఓటుకునోటుతో తెలంగాణ ప్ర‌భుత్వాన్ని అస్థిర ప‌రిచే వ‌ర‌కూ వెళ్లాయి.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముందు చూపు కార‌ణంగా ఓటుకునోటు కేసుతో బొక్క‌బోర్లా ప‌డ్డ ఈ వ‌ర్గాల అహం దెబ్బ‌తిని అప్ప‌టి నుండి కోర్టుల‌ను వేదిక‌గా చేసుకుని కేసీఆర్ ను, తెలంగాణ‌ను దెబ్బ‌కొట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేశాయి .. చేస్తున్నాయి. మెద‌క్ ఉప ఎన్నిక నుండి మొన్న‌టి సింగ‌రేణి ఎన్నిక‌ల వ‌ర‌కు ఈ వ‌ర్గం వ్యూహాలు కేసీఆర్ ముందు చెల్ల‌కుండా పోయాయి. సింగ‌రేణి ఎన్నిక‌ల ఓట‌మితో ఈ వ‌ర్గాలు కేసీఆర్ ను దెబ్బ‌కొట్టాలంటే ఇలా కుద‌ర‌ద‌ని కొత్త ఎత్తుకు సిద్దం అయ్యాయి. గ‌త కొన్ని నెల‌లుగా గ్రౌండ్ వ‌ర్క్ చేసుకుంటూ వ‌స్తున్న ఈ వ‌ర్గం సింగ‌రేణి ఎన్నిక‌ల ఓట‌మితో కొత్త ప్ర‌యోగానికి సిద్దం అయ్యాయి.

ప్ర‌జా వ్య‌తిరేక‌త‌ను న‌మ్ముకుని అధికారం మీద ఆశ‌లు పెంచుకున్న ఈ వ‌ర్గం తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ ఉంటే కేసీఆర్ వ్య‌తిరేక ఓటు చీలుతుంది. అప్పుడు త‌మ విజ‌యావ‌కాశాలు దెబ్బ‌తింటాయి అని చంద్ర‌బాబు నాయుడుతో మాట్లాడి తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీ మూసివేత‌కు ఒప్పించాయి. ఆ వ్యూహంలో భాగంగా రేవంత్ పార్టీ మార్పుకు రంగం సిద్దం అయింది. అయితే రేవంత్ పార్టీ మారుతూ తీసుకువెళ్తున్న వ్య‌క్తుల‌ను చూస్తే ఈ వ‌ర్గం తెర‌వెన‌క ఎంత క‌స‌ర‌త్తు చేసింది అన్న‌ది అవ‌గ‌తం అవుతుంది. రేవంత్ రెడ్డి చెప్పిన‌ట్లు తెలంగాణ‌లో కేసీఆర్ వ్య‌తిరేక‌వ‌ర్గం, కేసీఆర్ వ‌ర్గం రెండు మాత్ర‌మే ఎన్నిక‌ల్లో ఉండ‌బోతున్నాయి. కేసీఆర్ 60 ఏండ్ల‌లో సాధ్యంకాని అభివృద్దిని, సంక్షేమాన్ని గ‌త మూడేళ్ల‌లో చేసి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును కోరుతున్నారు. కేవ‌లం కేసీఆర్ మీద వ్య‌తిరేక‌త‌ను మాత్ర‌మే అవ‌త‌లి వ‌ర్గం న‌మ్ముకుంది.

ఈ వ‌ర్గం ముందుగా అనుకున్న‌ట్లు వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్, టీడిపీ పొత్తు పెట్టుకుని పోటీకి దిగుతే ప్ర‌జ‌లు దానిని ఆమోదించే అవ‌కాశం లేదు. టీడీపీ పుట్టిందే కాంగ్రెస్ కు వ్య‌తిరేకంగా అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకుంటే కేసీఆర్ కే క‌లిసివ‌స్తుంది. ఇక పొత్తులు, తిరుగుబాట్ల‌తో పార్టీ చీలిపోతుంది. అందుకే టీడీపీని అదృశ్యం చేసి కాంగ్రెస్ లో క‌లిపేస్తున్నార‌న్న‌మాట‌.

తెలంగాణ‌లో కేసీఆర్ అధికారంలో ఉండొద్దు ..ఆంధ్రాలో చంద్ర‌బాబు నాయుడు అధికారంలో ఉండాలి. అందుకే జ‌న‌సేన పేరుతో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను ఆంధ్రాలో పోటీకి దింపుతున్నారు. తెలంగాణ‌లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పోటీకి దిగ‌దు. ఒక‌వేళ‌ అప‌వాదు రాకుండా ఉండాలి అనుకుంటే ఇదే వ‌ర్గంతో ప‌దో ప‌ర‌కో సీట్ల‌తో పోటీ చేశాం అన్న క‌ల‌రింగ్ ఇస్తుంది. ఇక ఆంధ్రాలో జ‌గ‌న్ అధికారంలోకి రాకుండా ఉండాలంటే ప్ర‌భుత్వ వ్య‌తిరేక ఓట్లు చీలాలి. అందుకే జ‌న‌సేన 2019లో ఫుల్ ప్లెడ్జ్ డ్ గా ఆంధ్రాలో పోటీలో ఉండ‌బోతుంది. ఆంధ్రాలో స‌హ‌జంగా సినీగ్లామ‌ర్ కు ఉండే ఆక‌ర్ష‌ణ‌ను ఉప‌యోగించుకుని జ‌గ‌న్ ను దెబ్బ‌కొట్టాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

అయితే తెలంగాణ‌లో కేసీఆర్ గ్లామ‌ర్ ముందు ఈ వ‌ర్గం వ్యూహాలు చిత్తుకావ‌డం ఖాయం. గ‌త మూడేళ్ల పాల‌న‌లో కేసీఆర్ త‌న అభివృద్ది, సంక్షేమ కార్య‌క్రమాల అమ‌లుతో గ‌త 60 ఏండ్ల పాల‌న‌కు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో గ‌త మూడేళ్ల పాల‌న‌కు మ‌ధ్య స్ప‌ష్ట‌మ‌యిన గీత‌ను గీశారు. గ‌త ఎన్నిక‌ల్లో తెలంగాణ‌ను సాధించాను అని ప్ర‌జ‌ల‌ను ఓట్ల‌డిగిన కేసీఆర్ రాబోయే ఎన్నిక‌ల్లో ఈ మూడేళ్ల‌లో తెలంగాణ‌ను ఎలా అభివృద్ది చేశాను అన్న విష‌యాన్ని చెప్పి ఓట్లు అడ‌గ‌నున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్ పాత్ర‌ను జీర్ణించుకోలేని వ‌ర్గాల‌న్నీ ఇప్పుడు తెలంగాణ ముఖ్య‌మంత్రిగా కేసీఆర్ ను జీర్ణించుకోలేక అజీర్తితో ఒక్క‌ట‌వుతున్నారు.

(Visited 2,422 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *