కేసీఆర్ గొప్ప‌త‌నం ఇక్క‌డే బ‌య‌ట‌ప‌డింది

కేసీఆర్ గొప్ప‌త‌నం ఇక్క‌డే బ‌య‌ట‌ప‌డింది

ఎంత సింగ‌రేణి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తే మాత్రం విప‌క్షాల‌ను ఇలా తిడ‌తారా ? తెలంగాణ ఉద్య‌మంలో కోదండ‌రాం కూడా పాల్గొన్నారు ఆయ‌న‌ను లెక్క‌లేకుండా మాట్లాడ‌తారా ? బీజేపీ మ‌ద్ద‌తు లేందే తెలంగాణ వ‌చ్చిందా ? కాంగ్రెస్ ఇవ్వంది తెలంగాణ ఎలా వ‌చ్చింది ? కేసీఆర్ ముఖ్య‌మంత్రి ఎలా అయ్యారు ? టీడీపీ లేఖ ఇవ్వందే తెలంగాణ వ‌చ్చిందా ? తాజాగా కేసీఆర్ ప్రెస్ మీట్ త‌రువాత ఆయా పార్టీలు, కేసీఆర్ వ్య‌తిరేకుల ప్ర‌శ్న‌లు. ఈ ప్ర‌శ్న‌లు పాత‌వే అయినా తాజాగా సింగ‌రేణి ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రో సారి తెర మీద‌కు వ‌చ్చాయి.

అస‌లు తెలంగాణ ఉద్య‌మాన్ని నిల‌బెట్టింది .. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్. కేసీఆర్ ప‌న్నిన ఉద్య‌మ వ్యూహాల‌లో చిక్కుకుని త‌ప్ప‌నిస‌రై రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం మిగ‌తా పార్టీలు అన్నీ జై తెలంగాణ అన‌క త‌ప్పని స‌రి ప‌రిస్థితి ఏర్ప‌డింది. 2009 డిసెంబ‌ర్ 9కి ముందు ఆ త‌రువాత ఏ పార్టీ ఏం మాట్లాడింది. పార్ల‌మెంటులో తెలంగాణ బిల్లు పెడితే ఆఖ‌రు నిమిషం వ‌ర‌కు బీజేపీ ఆడిన నాట‌కాలు, సీపీఎం వేసిన ఎత్తుగ‌డ‌లు అన్నీ అంద‌రం చూసిన‌వే. ఈ పార్టీల ఇన్ని కుట్ర‌లు ఉంటాయ‌ని తెలిసినా ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుండి వెళ్తున్నా తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెడ‌తా అని ధైర్యంగా ప్ర‌క‌టించి వెళ్లిన చ‌రిత్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ది. అందుకే తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ మీద అపార‌మ‌యిన విశ్వాసం. అంతులేని న‌మ్మ‌కం.

కేసీఆర్ లెక్క‌లేకుండా తిట్టార‌ని వాపోతున్న విప‌క్షాలు, కుహానా మేధావులు ఒక విష‌యం గ‌మ‌నించాలి. కేసీఆర్ అంద‌రినీ తిట్టిన తిట్టు తిట్ట‌కుండా తిట్టిన నోటితోనే సింగ‌రేణి కార్మికులతో నిన్న ఒక మాట అన్నారు. ఇది ఇప్ప‌టి వ‌ర‌కూ ఇంత ధైర్యంగా, ఇంత బోళాత‌నంగా అన‌ని మాట‌. ఎప్పుడూ విన‌ని మాట‌నే అని చెప్పాలి.

సింగ‌రేణి కార్మికులు న‌న్ను క్ష‌మించాలి. తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత ప‌ని వ‌త్తిడిలో ప‌డి సింగ‌రేణి స‌మ‌స్య‌లు ప‌ట్టించుకోలేదు. ఈ సారి మాత్రం ఆ ప‌రిస్థితి ఉండ‌దు. గ‌తంలో టీబీజీకెఎస్ ను గెలిపించినా ప‌ని జ‌ర‌గ‌లేదు. ఈ సారి మాత్రం జ‌రుగుతుంది. ఆర్టీసి సంస్థ మీలాంటిదే .. దానికి హైద‌రాబాద్ లో న‌డుస్తున్న‌ బ‌స్సుల మూలంగా న‌ష్టం వ‌స్తుంది. ఏడాదికి రూ.200 కోట్లు కేటాయించి దాన్ని నిల‌బెడుతున్నాం. విద్యుత్ శాఖ‌లో 25 వేల మంది తాత్కాలిక ఉద్యోగులు ఉన్నారు. వాళ్ల‌కు క‌డుపు నిండ‌దు. దాని ప‌రిష్కారానికి ఆరు నెల‌లు ప‌ట్టింది. ఈ ప‌ని వ‌త్తిడిలో ఇంత‌వ‌ర‌కు ప‌ట్టించుకోనందుకు సింగ‌రేణి అన్న‌లు క్ష‌మించాలి. ఈ సారి గెలుపు నిజ‌మైన కార్మికుల గెలుపు కావాలి. లంచం ఇచ్చెటోన్ని, ఇప్పించెటోన్ని, అడిగెటోన్ని చెప్పుతో కొట్టాలి. మెడిక‌ల్ బోర్డు లంచాల‌మ‌యం. క్వార్ట‌ర్లు మారినా లంచం ఇవ్వాలట‌. ప‌రిస్థితి మారాలి. నేనే స్వ‌యంగా సింగ‌రేణిలో ప‌ర్య‌టిస్తా అని కేసీఆర్ అన్న మాట‌లు నిజంగా అనిర్వ‌చ‌నీయం.

నిజ‌మే కేసీఆర్ విప‌క్షాల‌ను అడ్డ‌గోలుగా తిడ‌తారు. కానీ త‌న‌ను న‌మ్మిన‌, న‌మ్ముకున్న ప్ర‌జ‌ల‌ను కాదు. అప్పుడు తెలంగాణ ఉద్య‌మంలో అడ్డుప‌డిన వారిని కేసీఆర్ తిట్టారు. ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వంలో అభివృద్దికి అడ్డు వ‌స్తున్న వారిని కేసీఆర్ తిడుతున్నారు. భ‌విష్యత్ లో కూడా తిట్ట‌ర‌న్న గ్యారంటీ ఏం లేదు. తెలంగాణ ప్ర‌ధానంగా ఆధార‌ప‌డ్డ రంగం వ్య‌వ‌సాయం. సాగునీరిస్తే తెలంగాణ రూపురేఖ‌లే మారుతాయ‌న్న‌ది కేసీఆర్ ఆశ‌. కానీ కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐల‌తో పాటు కోదండ‌రాం నాయ‌క‌త్వంలోని జేఏసీ తెలంగాణ‌లో ప్రాజెక్టులు కాకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తోంది. ఆంధ్రాలో ఎంత రాజ‌కీయ విభేధాలున్నా ఆ ప్రాంతానికి నీళ్లు తీసుకువ‌చ్చే ప‌ట్టిసీమ‌, ముచ్చుమ‌ర్రి వంటి ప‌థ‌కాల‌ను విప‌క్షం ఎన్న‌డూ అడ్డుకోలేదు. ఆ ప్రాజెక్టులో జ‌రిగిన అవినీతిని ఎత్తి చూపింది త‌ప్పితే ప్రాజెక్టు కాకుండా అడ్డుకోలేదు. కానీ ఇక్క‌డ విప‌క్షాలు మాత్రం అస‌లు ప్రాజెక్టు కాకుండా చ‌నిపోయిన వారి పేరు మీద‌ కూడా కేసులు వేయిస్తున్నాయి.

హైకోర్టు, సుప్రీంకోర్టు, గ్రీన్ ట్రిబ్యున‌ల్ చెన్నై, గ్రీన్ ట్రిబ్యున‌ల్ న్యూడిల్లీ ప్రాజెక్టుల‌ను అడ్డుకునే ఏ అవ‌కాశాన్ని వ‌ద‌ల‌డం లేదు. సీపీఎం, సీపీఐ, జేఏసీలు క్షేత్ర‌స్థాయిలో రైతుల నుండి భూసేక‌ర‌ణ జ‌ర‌గ‌కుండా అనేక అడ్డంకులు సృష్టిస్తుంటే .. ల‌క్ష‌ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టి కోర్టుల‌లో, ట్రిబ్యున‌ల్ ల‌లో కేసులు వేసి బీజేపీ, కాంగ్రెస్, జేఏసీలు ఏదో సాధించిన‌ట్లు సంతోషాలు వ్య‌క్తం చేస్తూ స్వీట్లు పంచుకుంటున్నాయి. అందుకే కేసీఆర్ తిడుతున్నారు. ప్ర‌జ‌ల‌కు కావాల్సింది త‌మ‌కు మేలు జ‌ర‌గ‌డం. త‌మ సంక్షేమానికి కానీ అభివృద్దికి గానీ ఈ ప్ర‌భుత్వం పాటు ప‌డుతుందా ? లేదా ? గ‌తంలో ఏం జ‌రిగింది ? ఇప్పుడు ఏం జ‌రుగుతుంది ? అన్న దాని విష‌యంలో ప్ర‌తిప‌క్షాల క‌న్నా ప్ర‌జ‌లు మంచిగా లెక్క‌లు వేసుకుంటారు. అందుకే కేసీఆర్ తిట్ల‌ను సామాన్య ప్ర‌జ‌లు ప‌ట్టించుకోరు. వారికి ఆ అంశంతో ప‌ని లేదు కూడా. అయినా కేసీఆర్ విప‌క్షాల‌ను తిట్టారు .. ప్ర‌జ‌ల‌కు మాత్రం త‌ల‌వంచి క్ష‌మాప‌ణ కోరుతున్నారు. నాకు ప్ర‌తిప‌క్షాల‌తో ప‌ని లేదు. నాకు ప్ర‌జ‌లే ప్ర‌తిప‌క్షం. వారు చెప్పిందే వింటా .. నాకు ప్ర‌జ‌లే హైక‌మాండ్ వారికి కావాల్సిందే చేస్తా అన్న కాన్సెప్ట్ కేసీఆర్ ది. అందుకే విప‌క్షాల కాకిగోల జ‌నం ప‌ట్టించుకోరు. ఈ లాజిక్ కేసీఆర్ కు తెలుసు కాబ‌ట్టే జ‌నం మెచ్చిన నేత అయ్యారు. ప్ర‌జ‌ల‌ను ప్రేమించ‌డంలోనే కేసీఆర్ గొప్ప‌త‌నం కూడా బ‌య‌ట‌ప‌డుతుంది.

Sandeepreddy Kothapally

 

(Visited 975 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *