సింగరేణి అంతా కేసీఆర్ ఫోటో పెట్టుకోవాల్సిందే!

సింగరేణి అంతా కేసీఆర్ ఫోటో పెట్టుకోవాల్సిందే!

సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో తెరాస విజయం… పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలనాత్మక వరాలను ప్రకటించేశారు. సింగరేణి కార్మికులతో ఆత్మీయంగా సమావేశమైన ముఖ్యమంత్రి వారి కష్టనష్టాలను సాకల్యంగా విని.. ఎంతబాగా స్పందించారంటే.. కార్మికులంతా ఇక ముఖ్యమంత్రి ఫోటోను తమ ఇళ్లలో పెట్టుకోవాల్సిందే అనిపించేంతగా ఆయన వారికి భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి హామీల దెబ్బకు అసలు సింగరేణిలో ఇతర కార్మిక సంఘాల ఊసు లేకుండా పోతుందేమో అనిపించే స్థాయిలో ఆయన చెప్పుకొచ్చారు. వారి క్షేత్ర స్థాయి సమస్యలను చక్కగా ప్రస్తావించారు.

కార్మికులు సొంత ఇళ్లు కట్టుకోవడానికి వడ్డీలేకుండా ఇచ్చే రుణాలను పది లక్షలకు పెంచారు. అలాగే అలియాస్ పేర్లను తొలగిస్తాం.. వారికి భద్రత కల్పిస్తాం అనే మాట ఇచ్చారు. వారసత్వ ఉద్యోగాల గురించి చాలా స్పష్టమైన హామీలు ఇచ్చారు. అన్నిటినీ మించి సింగరేణి కార్మిక లోకం మురిసిపోయేలా వారి ఇళ్లలో ఏసీలు పెట్టించి.. కరెంటును ఉచితంగా ఇస్తాం అని చెప్పడం విశేషం. సీఎం తాను స్వయంగా వారి ఇళ్లకు వచ్చి వారి పరిస్థితులు పరిశీలిస్తానని కూడా మాట ఇచ్చారు.

తెరాస రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఇన్నాళ్లలో తాను సింగరేణి మీద దృష్టి పెట్టలేకపోయినందుకు ముఖ్యమంత్రి ముందుగా వారికి క్షమాపణ చెప్పడం కార్మికులను కదలించింది. కేసీఆర్ ప్రకటించిన వరాలకు కార్మికలోకం మొత్తం సమ్మోహనులైపోయురంటే అతిశయోక్తి కాదు. మరి అలాంటప్పుడు.. ఆయన తమ కుటుంబసభ్యుడిగా భావించినా, ఇంటి దేవుడిగా భావించినా.. ఫోటోను ఇళ్లలో పెట్టుకుంటారంటే ఆశ్చర్యం ఏముంది.

(Visited 128 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *