సంద‌ట్లో స‌డేమియా

సంద‌ట్లో స‌డేమియా

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆంధ్రా మంత్రి ప‌రిటాల సునీత కుమారుడి వివాహానికి హాజ‌ర‌య్యారు. దీనికి తెలంగాణ‌లో కేసీఆర్ అంటే ప‌డ‌ని వారు ఎవ‌రి అర్థాలు వారు తీసుకుని సంతృప్తి ప‌డ్డారు. ఈ కార్య‌క్ర‌మానికి ఆంధ్ర‌జ్యోతి ఎండీ రాధాకృష్ణ కూడా హాజ‌ర‌య్యాడు. కేసీఆర్ ప‌క్క‌నే ప‌లుమార్లు కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌నం ఇచ్చారు. ఆ కార్య‌క్ర‌మానికి కేసీఆర్ ఎందుకు వ‌చ్చారు ? అక్క‌డ ఉండి ఈయ‌న ఏం గ‌మ‌నించారు ? అంటూ తాజాగా రాసుకున్న కొత్త‌ప‌లుకులో కూని రాగాలు తీసుకున్నారు.

అస‌లు కేసీఆర్ వ‌చ్చింది తెలంగాణ‌లో త‌న‌కు దూరం అయిన రెడ్ల స్థానాన్ని క‌మ్మ‌వారితో భ‌ర్తీ చేసుకునేందుకే ప‌రిటాల కుమారుడి వివాహానికి వచ్చార‌ని రాధాకృష్ణ స్ప‌ష్టం చేశాడు. అందుకే క‌మ్మ‌సంఘం అధ్య‌క్షుడు అరికెపూడి గాంధీని, మ‌రో మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావును వెంట ఉంచుకున్నార‌ని, అక్క‌డ మ‌రో క‌మ్మ‌నేత ప‌య్యావుల కేశ‌వ్ ను ప‌క్క‌కు తీసుకెళ్లి మాట్లాడి ఓ సీన్ క్రియేట్ చేశాడ‌ని త‌న పైత్యాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నాడు రాధాకృష్ణా. పెళ్లికి వ‌చ్చిన దాన్ని పెళ్లిలా చూడ‌కుండా పెడార్ధాలు తీసేశాడు. అంతే కాదు గ‌తంలో జ‌ల‌గం వెంగ‌ళ‌రావు ఫార్ములాను కేసీఆర్ పాటిస్తున్నాడ‌ని, ఇది పాత ఫార్ములానేన‌ని చెప్పుకొచ్చాడు.

ఇక త‌క్కువ ఓట్లున్న సింగ‌రేణి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ కు వ్య‌తిరేకంగా విప‌క్షాల‌న్నీ జ‌త‌క‌ట్టి త‌ప్పు చేశాయ‌ని, కేసీఆర్ తెలివిగా విప‌క్షాల‌న్నీ ఒక్క‌ట‌య్యేదాకా ఆగి ఆ త‌రువాత అస‌లు రాజ‌కీయానికి తెర లేపార‌ని రాధాకృష్ణ రాసుకొచ్చాడు. ఈ ఎన్నిక‌ల్లో గెల‌వ‌డం ద్వారా ప్ర‌తిప‌క్షాలు ఒక్క‌ట‌యినా ఎప్పుడూ టీఆర్ఎస్ కు ఎదురులేద‌ని చాటుకున్నార‌ని రాధాకృష్ణ బాధ‌ప‌డ్డాడు. ఇదే ఊపుతో న‌ల్ల‌గొండ ఉప ఎన్నిక‌కు వెళ్తున్నార‌ని, అక్క‌డా గెలిస్తే బ‌లంగా ఉన్న కాంగ్రెస్ ను దెబ్బ‌కొట్టి ఆత్మ‌స్థ‌యిర్యం దెబ్బ‌తీయ‌బోతున్నార‌ని రాధాకృష్ణ భావించాడు.

ముఖ్య‌మంత్రి కేసీఆర్ సింగ‌రేణి తీర్పు రాగానే నిర్వ‌హించిన పత్రికా స‌మావేశంలో తెలంగాణ గురించి అనేక విష‌యాలు స్ప‌ష్టంగా వివ‌రించారు. తెలంగాణ‌లో 90 శాతం బ‌ల‌హీన‌వ‌ర్గాలుంటే, మిగ‌తా వ‌ర్గాలు మిగిలిన‌వ‌ని విస్ఫ‌ష్టంగా చెప్పారు. నాకు కొంద‌రు చిల్ల‌ర‌గాళ్లు కులం అంట గ‌డుతున్నార‌ని, నా ఒక్క కులం ఓట్లేస్తే తాను గెల‌వ‌లేద‌ని అంద‌రూ ఓట్లేస్తే గెలిచాన‌ని, నా కులం తెలంగాణ అని అన్నారు.

తెలంగాణ‌లో విప‌క్షాల‌న్నీ ఒక్క‌టై అభివృద్దిని అడ్డుకుంటున్నా కేసీఆర్ గ‌త మూడేళ్లుగా ఎక్క‌డా త‌డ‌బ‌డ‌కుండా ప‌నిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. రైతాంగానికి సాగునీరు ఇస్తే ఇక వాళ్ల ప‌ని వాళ్లు చేసుకుంటార‌న్న‌ది కేసీఆర్ ఆలోచ‌న కానీ విప‌క్షాలు కోర్టుల‌లో కేసులు వేస్తూ అడుగ‌డుగునా అడ్డుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అభివృద్ది అనేది జ‌రిగితే ప్ర‌జ‌లే పాల‌కుల‌ను గుండెల్లో పెట్టుకుంటార‌న్న భావ‌న‌తో కేసీఆర్ ప‌నిచేస్తున్నారు త‌ప్పితే ఫ‌లానా కులం ఓట్ల కోసం ప‌నిచేయ‌డం జ‌ర‌గ‌దు. అస‌లు ఆ మాట‌కొస్తే పాల‌కులెవ‌రూ ఒక కులం ఓట్ల కోసం ప‌నిచేయ‌రు.

ఇక సింగ‌రేణి ఎన్నిక‌ల్లో గెలుపు ఆశామాషీగా రాలేద‌న్న‌ది రాధాకృష్ణ తెలుసుకోవాల్సిన వాస్త‌వం. ఈ విష‌యాన్ని కూడా ఎన్నిక‌ల‌కు ముందే కేసీఆర్ ముఖ్య‌మంత్రి ప్రెస్ మీట్ పెట్టి వాస్త‌వాలు మాట్లాడి కార్మికుల‌ను త‌న దిక్కు తిప్పుకున్న‌ది గ‌మ‌నించాలి. 1989 నుండి ఒక్క ఉద్యోగం సింగ‌రేణిలో వేసింది లేదు. తెలంగాణ ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత ఏడు వేల ఉద్యోగాలు వేసింది. కార్మికులు ద‌శాబ్దాలుగా ఎదురుచూస్తున్న వార‌స‌త్వ ఉద్యోగాల‌కు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తే కోర్టు కెళ్లి అడ్డుకున్న జాతీయ కార్మిక సంఘాలు స్వీట్లు పంచుకుని మ‌ళ్లీ అదే డిమాండ్ మీద ఎన్నిక‌ల‌కు వెళ్తే కార్మికులు ఎందుకు ఆద‌రిస్తారో రాధాకృష్ణ‌కే తెలియాలి. అన్ని సంఘాలు ఒక్క‌టి కావ‌డం మూలంగా ఓట్ల‌లో త‌క్కువ తేడా ఉండొచ్చు గానీ ఈ సారి ఎన్నిక‌ల‌లో ఈ సంఘాల ఊసేలేకుండా పోతుంద‌న్న‌ది వాస్త‌వం. వామ‌ప‌క్షాలు, కాంగ్రెస్, టీడీపీ మూడూ బ‌లంగా ఉన్న ఖ‌మ్మం జిల్లాలో ఒక్క డివిజ‌నూ రాలేదంటే ప‌రిస్థితి ఏంటో తెలుస్తుంది.

అస‌లు ఈ రాధాకృష్ణ కేసీఆర్ ను అంచ‌నా వేయ‌డంలో ఎన్న‌డూ స‌ఫ‌ల‌మ‌యింది లేదు. తెలంగాణ ఉద్య‌మంలో ఉద్య‌మం మీద‌, కేసీఆర్ మీద విషం చిమ్మి తెలంగాణ వ‌చ్చింద‌న్న ఆక్రోషంలో ఆ త‌రువాత కూడా ప్ర‌భుత్వం త‌ల‌తిక్క రాత‌లు రాసి రాసి అలిసిపోయాడు. ఇప్పుడు కేసీఆర్ ఏదో చేయ‌బోతున్నాడంటూ త‌న‌కు తోచిన క‌థ‌నాలు అల్లుకుంటున్నాడు. సింగ‌రేణి ఎన్నిక‌ల‌కు ముందు, ఎన్నిక‌ల త‌రువాత కేసీఆర్ ప్రెస్ మీట్లు విన్న ఏ ఎడిట‌రూ .. ఏ జ‌ర్న‌లిస్టూ ఇలాంటి త‌లా తోక లేని క‌థ‌నాలు రాయ‌డు. సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్లు పెళ్లిలో ఎంబ‌డి తిరిగే సందిస్తే రాధాకృష్ణ త‌న పైత్యాన్ని మ‌ళ్లీ బ‌య‌ట‌పెట్టుకున్నాడు. ఇక ఈ క‌థ‌నంలో చంద్ర‌బాబును కేసీఆర్ తో పోల్చ‌డం రాధాకృష్ణ అతి తెలివికి అద్దం ప‌డుతుంది. చంద్ర‌బాబు ఎన్న‌డూ కేసీఆర్ కు స‌రితూగ‌డు అది పాల‌న‌లో అయినా ప్ర‌జాభిమానంలో అయినా అన్న‌ది చివ‌ర‌గా రాధాకృష్ణ తెలుసుకోవాల్సింది. అయినా ఇలాగే నా రాత‌లు నా ఇష్టం అనుకుంటే కొత్త ప‌లుకు కాస్తా కోతి ప‌లుకు అవుతుంది.

(Visited 1,898 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *