కొంప‌ముంచిన అమిత్ షా కొడుకు

కొంప‌ముంచిన అమిత్ షా కొడుకు

బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా కొడుకు జ‌య్ షా వివాదంలో చిక్కుకున్నాడు. ఆయ‌న కంపెనీ ఆస్తులు బీజేపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ఏకంగా 16 వేల రెట్లు పెరిగాయ‌ని ది వైర్ న్యూస్ పోర్ట‌ల్ ఇచ్చిన క‌థ‌నం క‌ల‌క‌లం రేపుతోంది. తాజా క‌థ‌నంతో బీజేపీ వ‌ర్గాలు అయోమ‌యంలో ప‌డ్డాయి. న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌ల‌కు దిగింది. ఆ క‌థ‌నంలో వాస్త‌వం లేద‌ని బీజేపీ వ‌ర్గాలు అంటే ఆ మీడియా సంస్థ మీద జ‌య్ షా వంద కోట్ల ప‌రువున‌ష్టం దావా వేశారు.

జయ్‌షా, జితేంద్ర షా ఇద్దరు డైరెక్టర్లుగా 2004లో టెంపుల్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రారంభమైంది. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా సతీమణి సోనాల్‌షా కూడా ఈ సంస్థలో వాటాదారు. 2013-14లో కంపెనీకి స్థిరమైన ఆస్తులేవీ లేవు. కానీ, 2014-15 ఆర్థికసంవత్సరంలో సంస్థ రూ.50వేల వరకు ఆదాయాన్ని ఆర్జించింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి రాగానే టెంపుల్ ఎంటర్‌ప్రైజెస్ ఆస్తులు అమాంతం పెరిగిపోయాయి. నిల్వలు, మిగులు కలిపి 19లక్షల నుంచి రూ 80.2కోట్లకు చేరాయి. ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఈ వృద్ధిని సాధించినట్లు సదరు సంస్థ కంపెనీల రిజిస్ట్రార్‌కు సమర్పించిన వివరాలలో పేర్కొన్నది. రూ.51కోట్ల విదేశీ ఆదాయాన్ని వచ్చినట్లు కూడా చూపించింది.

రాజేశ్ ఖండ్వాలాకు చెందిన కేఐఎఫ్‌ఎస్ అనే ఫైనాన్స్ సంస్థ నుంచి రూ.15.78కోట్లు రుణంగా తీసుకున్నట్లు చూపించింది. రాజ్యసభ సభ్యుడు, రిలయన్స్ ఇండస్త్రీస్ ఉన్నతాధికారి పరిమళ్ నత్వానీకి వియ్యంకుడే ఈ రాజేశ్ ఖండ్వాలా. కంపెనీల రిజిస్ట్రార్‌కు సమర్పించిన వార్షిక నివేదికల్ని పరిశీలిస్తే సాధారణ కంపెనీగా ఉన్న టెంపుల్ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంత అసాధారణ వృద్ధిని సాధించిందో తెలుస్తుందని ది వైర్ తన కథనంలో పేర్కొన్నది. జయ్‌షాకు 60శాతం వాటా ఉన్న మరో సంస్థ కుసుమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంకులకు రూ.7 కోట్లు బాకీ పడి ఉన్నప్పటికీ, గుజరాత్ కోఆపరేటివ్ బ్యాంక్ రూ.25 కోట్ల లోన్‌ను ఆ సంస్థకు మంజూరు చేసింది. ఆ కంపెనీనే తర్వాత రిన్యూవబుల్ ఎనర్జీ కంపెనీగా మార్చారు. అనంతరం విద్యుత్‌శాఖ నుంచి రూ.10కోట్ల మేర కాంట్రాక్టులను సంపాదించినట్లు ది వైర్ న్యూస్ పోర్టల్ తన కథనంలో బయటపెట్టింది.

(Visited 767 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *