కేసీఆర్ ప్రెస్ మీట్ .. క‌ఠిన నిజాలు

కేసీఆర్ ప్రెస్ మీట్ .. క‌ఠిన నిజాలు

సింగ‌రేణి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకెఎస్ భారీ మెజారిటీతో గెలిచి చ‌రిత్ర సృష్టించిన నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్ర‌భుత్వం మీద విశ్వాసం ఉంచి గెలిపించిన కార్మికుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ఎన్నిక‌ల సంధ‌ర్భంగా వారికి ఇచ్చిన హామీల‌ను వంద‌కు వంద శాతం నెర‌వేర్చుతామ‌ని స్ప‌ష్టం చేశారు.

సింగరేణిలో నష్టాలు వస్తున్నప్పటికీ భూగర్భగనులను కొనసాగిస్తున్నామని, మరిన్ని ఉద్యోగాల కల్పన కోసం త్వరలో ఆరు భూగర్భ గనులు ప్రారంభిస్తామని చెప్పారు. కారుణ్య నియామకాల విధానంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని, నీచ రాజ‌కీయాలు చేస్తున్న విప‌క్షాల‌కు కార్మికులు బుద్ది చెప్పార‌ని కేసీఆర్ అన్నారు. అయితే ఈ సంధ‌ర్భంగా కేసీఆర్ మాట్లాడిన విష‌యాల‌లో క‌ఠిన నిజాలు ఉన్నాయి.

సింగ‌రేణి రికార్డు విజ‌యం

ఇప్ప‌టి వ‌ర‌కు సింగ‌రేణి గ‌నుల‌లో ఇంత భారీ విజ‌యం ఒక సంఘానికి ద‌క్కిన చ‌రిత్ర లేదు. మొత్తం 11 డివిజ‌న్ల‌కు 9 డివిజ‌న్ల‌లో విజ‌యం సాధించ‌డం మామూలు విష‌యం కాదు. ఇక ఖ‌మ్మం జిల్లాలో క‌మ్యూనిస్టులు, కాంగ్రెస్ బ‌లంగా ఉన్నాయి. దానికి తోడు అక్క‌డ ఇప్ప‌టి వ‌ర‌కూ కొన్ని చోట్ల ఐఎన్ టీయూసి, ఎఐటీయూసి మిన‌హా టీబీజీకెఎస్ గెలిచింది లేదు. ఈ సారి ఖ‌మ్మం జిల్లాలో అన్ని చోట్లా టీబీజీకెఎస్ ఘ‌న‌విజ‌యం సాధించింది.

తెలంగాణ ఎన్నిక‌ల్లో

తెలంగాణ‌లో ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత వ‌ర‌స‌గా జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ వ‌ర‌స విజ‌యాలు సాధిస్తూ వ‌స్తుంది. రెండు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు మిన‌హాయిస్తే మిగ‌తా అన్నింట్లో టీఆర్ఎస్ దే ఘ‌న విజ‌యం. ఓ అధికార పార్టీకి ఈ స్థాయి విజ‌యాలు ద‌క్క‌డం ఓ చ‌రిత్ర. మెద‌క్, వ‌రంగ‌ల్ లోక్ స‌భ‌, నారాయ‌ణ ఖేడ్ అసెంబ్లీ, వ‌రంగ‌ల్, ఖ‌మ్మం, హైద‌రాబాద్ మేయ‌ర్ ఎన్నిక‌లు, పాలేరు శాస‌న‌స‌భ ఎన్నిక‌లు ప్ర‌తీ ఎన్నిక‌ల‌లో ప్ర‌జ‌లు ప్ర‌తిప‌క్షాల‌కు గూబ‌గుయ్యిమ‌నే తీర్పు నిచ్చారు. తెలంగాణ ప్ర‌భుత్వం మీద‌, కేసీఆర్ మీద ఎన్ని విష‌పు ఆరోప‌ణ‌లు చేసినా అన్ని చోట్లా గెలుపు టీఆర్ఎస్ దే.

హైద‌రాబాద్ లో వ‌ర్షాలపై కేసీఆర్

వ‌ర్షాలు వ‌స్తే హైద‌రాబాద్ లో ట్రాఫిక్ జామ్, ప్ర‌జ‌ల ఇబ్బందుల మీద విప‌క్షాలు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను కేసీఆర్ వాస్త‌విక వ్యాఖ్య‌ల‌తో తిప్పికొట్టారు. ఇప్పుడు హైద‌రాబాద్ లో నాలాలు సెట్ చేసి అన్ని స‌రిచేయాలంటే దాదాపు 12 వేల ఇల్లు కూల‌గొట్టాలి. 13 వేల కోట్ల రూపాయ‌లు కావాలి. వానొస్తే హైద‌రాబాద్ ఏం క‌ర్మ అమెరికా, ముంబ‌యి, బెంగుళూరు అన్ని న‌గ‌రాలు మునుగుతున్నాయి. హైద‌రాబాద్ ఒక్క‌టే మునుగుతుంద‌ని రాద్దాంతం చేయ‌డం ఎందుకు అని కేసీఆర్ ప్ర‌తిప‌క్షాల‌ను ప్ర‌శ్నించ‌డం గ‌మ‌నార్హం. వాస్త‌వంగా ఒక ముఖ్య‌మంత్రి ఇలా ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడ‌డం అరుదు. చ‌ర్య‌లు తీసుకుంటున్నాం .. అధికారుల‌ను ఆదేశించాం అని చెప్పి త‌ప్పుకుంటారు. కానీ ఉన్న‌ది ఉన్న‌ట్లు మాట్లాడిన గ‌ట్స్ ఉన్న‌ది ఒక్క కేసీఆర్ కే. ఇప్పుడే కాదు గ‌తంలోనూ కేసీఆర్ ఇలాగే చెప్ప‌డం గ‌మ‌నార్హం.

నా కులం తెలంగాణ .. కులం గురించి ఎందుకు

నా కుల‌పోల్లు ఓట్లేస్తే నేను అధికారంలోకి వ‌చ్చిన‌నా .. ప్ర‌జ‌లంద‌రూ ఓట్లేస్తే అధికారం లోకి వ‌చ్చిన‌. అస‌లు తెలంగాణ బ‌ల‌హీన వ‌ర్గాల రాష్ట్రం. ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే 90.65 ఉన్నారు. మిగిలిన అగ్ర కులాలు 9.35 మాత్రమే. ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఈ విషయం తేలిందని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. కులం అనేది ఓ భ్రాంతి. నా కులం తెలంగాణ అదే అంశం మీద ప్ర‌జ‌ల్లోకి వెళ్లాం తెలంగాణ సాధించాం .. అధికారంలోకి వ‌చ్చాం. కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి సొంత ఊర్లో ఉన్న‌ ఇంటి పేరు గ‌డి. హైద‌రాబాద్ శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలో ఉన్న ఇంటి పేరు గ‌డి. ఎవ‌రు దొర .. ఎవ‌రిని కించ‌ప‌రుస్తున్నారు.

ఎవ‌ని పాల‌యిందిరో తెలంగాణ‌నా .. 14 ఏండ్లు కొట్లాడినాయిన పాల‌యింది

నేను తెలంగాణ ఉద్య‌మంలో త‌యారు చేసిన వేలు, ల‌క్ష‌ల మందిలో ఒక‌డు కోదండ‌రాం. నా శ‌క్తియుక్తులు దార‌పోసి 14 ఏండ్లు తెలంగాణ కోసం శ్ర‌మించిన‌. ఇప్పుడు నీ జేఏసీల ఎవ‌డ‌న్న ఉన్న‌డా. అమ‌రుల స్ఫూర్థి యాత్ర అని పెట్టుకున్న‌వ్ ఎన్న‌డ‌న్న తొలి అమ‌రుడు శ్రీ‌కాంత‌చారి త‌ల్లిని క‌లిసిన‌వా .. నీవు చేసింది రాజ‌కీయ యాత్ర‌. హుజూర్ న‌గ‌ర్ ఎన్నిక‌ల్లో ఆమెకు మ‌ద్ద‌తుగా ఒక్క‌నాడ‌న్న మాట్లాడిన‌వా. కోదండ‌రాం గురించి నాకు తెలుసు .. అమాయ‌కుడేం కాదు. ర‌హ‌స్యంగా కాంగ్రెస్ ను క‌లిసిండు .. కొంద‌రికి టికెట్లు ఇప్పించిండు. ఈన మాట‌లు బ‌ట్టే కాంగ్రెస్ నాశ‌నం బ‌ట్టింది. నేను కూడా ఆయ‌న‌కు ఎంపీ కావాలా ? ఎమ్మెల్యే కావాలా ? అని అడిగాను. ఆయ‌న స్ఫూర్థి యాత్ర బండికి ఎవ‌ని పాల‌య్యిందిరో తెలంగాణ .. ఎవ‌డేలు తున్నాడురో తెలంగాణ అంట .. ఎవ్వ‌డేలు తున్న‌డు 14 ఏండ్లు క‌ష్ట‌ప‌డి తెలంగాణ సాధించినాయిన చేతిల‌నే తెలంగాణ ఉంది అని కేసీఆర్ కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

రాజ‌కీయ పార్టీ అంటే వ‌సూళ్లు చేసేందుకు కాదు

రాజ‌కీయ పార్టీ అంటే నాలుగు రూపాయ‌లు వెన‌కేసుకోడానికి అనే భ్ర‌మ‌ల్లో ఉన్నారు. చిరంజీవి పార్టీ పెడితే ప్ర‌జ‌లు క‌ట్టెల మోపులా క‌ట్టి ఆ పార్టీని ప‌డేశారు. ఎవ‌రికి వారు పార్టీలు పెట్టుకుంటే న‌డ‌వ‌వు. గ‌త ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్‌తో క‌లిసి టీజేఏసీ ఛైర్మ‌న్‌ ప్రొ.కోదండ‌రామ్ కాంగ్రెస్‌కు మేనిఫెస్టో రాశారు. ఏమ‌యింది జ‌నం కాంగ్రెస్ ను తిప్పికొట్టారు. ప్రజ‌ల్లో విశ్వ‌స‌నీయ‌త సంపాదించుకోవ‌డం అంత ఆశామాషీ కాదు.

పైసా ఇవ్వనంటే ఉత్తమ్, జానా ఏం చేశారు?

తెలంగాణ రాష్ట్రం వచ్చినా లక్ష్యాలు నెరవేరడం లేదని సీఎల్పీ సమావేశంలో జానారెడ్డి అంటున్నాడు. ఆనాడు నిండు శాసనసభలో నాటి సీఎం కిరణ్‌కుమార్‌డ్డి తెలంగాణకు ఒక్క పైసా ఇయ్యనన్నడు. చీము నెత్తురు ఉందా? ఒక్క మాటైనా మాట్లాడారా? నువ్వు అవకాశవాదంతో వ్యవహరిస్తావు. అసెంబ్లీలో తెలంగాణ ఫోరం గురించి మాట్లాడదామని అప్పట్లో అన్నాడు. ఆనాడే చెప్పా, జానారెడ్డి, నీలాంటి దొంగలు పెడితే రాననిచెప్పా. విజయభాస్కర్‌రెడ్డి పిలిచి అగ్రికల్చర్ మినిస్టిర్ ఇచ్చిండు, ఫోరం యాడనోబోయింది. నీ మంత్రి పదవి కోసం ఫోరం అంటావా దరిద్రుడా? తెలంగాణ కోసం చాలా సీరియస్‌గా పని చేసింది. కేవలం టీఆర్‌ఎస్ మాత్రమే. కవులు, రచయితలు, సింగరేణి కార్మికులు 45 రోజులు సమ్మెచేసి దేశాన్ని వణికించారు. ఉద్యోగులంతా బంద్‌చేశారు. తెలంగాణ జర్నలిస్టులు ఫోరం పెట్టుకొని మీటింగ్ పెట్టారు. నా ఆమరణ దీక్ష తర్వాతే తెలంగాణ వస్తుందనే ఆశలు చిగురించాయి. నా జీవితాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ తెచ్చా. కాంగ్రెస్ హై కమాండ్ ప్రకటన వెనకకు తీసుకన్నా మాట్లడలేదు. ఆనాడు జానా, ఉత్తమ్‌లు అక్కడుండి మంత్రి పదవులు వెలగబెట్టారు. ఒక్కడన్నా ముందుకొచ్చిండా. ఇవ్వాల మీకు లక్ష్యం ఉందా. మాది అభివృద్ధి ఎజెండా. నేను దారితప్పనట్టు చూపిస్తరా? అలాచేస్తే 30 ఏండ్లుగా రాజకీయాల్లో ఉండగలనా?

దామోద‌ర రాజ‌న‌ర్సింహ అడ్డుకున్న‌ది నిజం కాదా

గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా స్టే తెస్తారా? రైతుల పేరుతో ఎవరు స్టే తెచ్చారో జనానికి తెలియదా? దీని వెనకాల మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ ఉన్నడు. రైతులు కేసులు వేస్తారా? లాయర్‌కు రోజుకు ఆరు లక్షల రూపాయ ఫీజు ఇచ్చుకోగలరా? రైతుకు ఇంత ఖర్చు పెట్టే శక్తి ఉంటుందా? ఇప్పటికైనా ఇలాంటి పిచ్చిపిచ్చి విషయాలు మానుకొని నిర్మాణాత్మకంగా రావాలి. ఎన్జీటీకి పోయి స్టే తెచ్చే అగత్యం ఎందుకు, కాంగ్రెస్ తెలంగాణ ప్ర‌జ‌ల‌కు క్షమాపణ చెప్పాలి.

రైతు సంఘాల‌ను అడ్డుకుంటారా ?

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దేశంలో ఎవరూ చేయనివిధంగా రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.8 వేలు ఇస్తామని చెప్పాం. ఎవరన్నా ఇచ్చారా? నిర్మాణాత్మకంగా ముందుకు పోతున్నాం. డబ్బులన్నీ వాస్తవంగా రైతులకే చేరాలని తలచి భూ రికార్డుల ప్రక్షాళన చేస్తున్నాం. 80 ఏండ్ల నుంచి ఎవరూ భూరికార్డుల ప్రక్షాళన చేపట్టలేదు. దాన్ని వ్యతిరేకించడం ఏమిటి? మెదడు పనిచేస్తున్నదా? మెంటల్ కేసులా! రైతు ఆత్మహత్యలు నివారిద్దామని ప్రయత్నిస్తుంటే, స్థానిక సంస్థలు నిర్వీర్యమవుతున్నాయని దుష్ప్రచారం ఏమిటి? భూమిరికార్డులకు, స్థానిక సంస్థలకు సంబంధం ఉన్నదా? మోకాలుకు బోడి గుండుకు ఏం సంబంధం? స్థానిక సంస్థలకు, రైతు సమన్వయ సమితులకు ఏమి సంబంధం? పిచ్చిగా ప్రవరిస్తున్నారు అని కేసీఆర్ అన్నారు.

అనేక విష‌యాల మీద కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన కేసీఆర్ ప్రెస్ మీట్ ను విశ్లేషించుకుంటే విప‌క్షాల తీరు మార్చుకోవాల్సిన అవ‌స‌రం ఎంత‌యినా ఉంది. అంద‌రు ముఖ్య‌మంత్రుల మాదిరిగా ఏవో ఆరోప‌ణ‌లు చేస్తే డిఫెన్స్ ప‌డ‌తారు అనుకునే విప‌క్ష రాజ‌కీయాలు కేసీఆర్ ముందు చెల్ల‌వ‌ని తాజా ప్రెస్ మీట్ తో తేట‌తెల్లం అయింది. ఇక్క‌నైనా విప‌క్షాలు తీరు మార్చుకుంటే బాగుంటుంది.

(Visited 939 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *