మోదీ బుల్లెట్ ట్రైన్ చంపేస్తుంది!

మోదీ బుల్లెట్ ట్రైన్ చంపేస్తుంది!
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇటీవ‌ల ప్ర‌క‌టించి, శంకు స్థాప‌న కూడా చేసేసిన అమ్మ‌దాబాద్‌-ముంబై బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కేంద్ర మాజీ మంత్రి, ఆర్థిక వేత్త, సీనియ‌ర్ కాంగ్రెస్ నేత చిదంబ‌రం నిప్పులు కురిపించారు. మోదీ చేప‌ట్టిన ఈ ప్రాజెక్టు జ‌నాల్ని చంపేస్తుంద‌ని హెచ్చ‌రించారు. అంతేకాదు, ఇప్ప‌టికే విఫ‌ల‌మైన నోట్ల ర‌ద్దు  ప్ర‌యోగం మాదిరిగా తాజాగా చేప‌ట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కూడా మారుతుంద‌ని చెప్పారు. ఈ ప్రాజెక్టు ప్రతి ఒక్కరినీ చంపుకుంటూ పోతుందని తీవ్ర స్థాయిలో ఆరోపించారు.
రైలు భద్రతను పెరుగుపరచకుండా.. ఈ ప్రాజెక్టుపై వంద‌ల కోట్లు  ఖర్చు చేయడం ఎందుక‌ని మోదీపై నిప్పులు చెరిగారు.  నిన్న ముంబైలోని ఎల్ఫిన్‌స్టోన్‌ రోడ్డు రైల్వే స్టేషన్‌ ఫుట్‌ ఓవర్‌బ్రిడ్జ్‌పై  జరిగిన తొక్కిస‌లాట విషాద ఘటన దేశాన్ని నివ్వెర ప‌రిచింద‌ని, అలాంటి స్టేష‌న్లు దేశంలో కొన్ని వంద‌లు ఉన్నాయ‌ని, వాటిలో మెరుగైన మౌలిక స‌దుపాయాలు క‌ల్పించ‌కుండా.. ఇలా ప్ర‌జాధ‌నాన్ని వృధా చేసే నైతిక హ‌క్కు మోదీకి లేద‌ని మండిప‌డ్డారు. “నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనలో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. భద్రతతో పాటు ప్రతి దాన్నీ బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు చంపుకుంటూ పోతుంది. ఇది అచ్చం పెద్ద నోట్ల రద్దు నిర్ణయం లాంటిదే“ అని చిదంబ‌రం పేర్కొన్నారు.
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టులపై కంటే భద్రత, మెరుగైన సదుపాయాలపై రైల్వే దృష్టిసారించాలని సూచించారు. బుల్లెట్ ట్రైన్లు సాధారణ ప్రజల కోసం కాదని, డబ్బూ, పలుకుబడి ఉన్నవాళ్ల ప్రయాణం చేయడం కోసమని అన్నారు. ఈ మేర‌కు చిదంబ‌రం త‌న ట్విట్ట‌ర్‌లో నిప్పులు చెరిగారు.  కాగా, చిదంబ‌రం వ్యాఖ్య‌లు తీవ్ర క‌ల‌కలం సృష్టిస్తున్నాయి. నిన్న‌టికి నిన్న సొంత పార్టీ నేత య‌శ్వంత్ సిన్హా.. త‌న వ్యాసంలో మోదీపై నిప్పులు పోయ‌గా.. ఇప్పుడు విప‌క్ష నేత చిదంబ‌రం తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.
(Visited 144 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *