భాషకు సేవ అంటే.. కేసీఆర్ దే!

భాషకు సేవ అంటే.. కేసీఆర్ దే!

తెలుగు భాష చచ్చిపోతోంది.. మమ్మీ డాడీల సంస్కృతి ముదురుతోంది.. అని భాషకు సంబంధించిన సమావేశాలు జరిగే అన్ని సమావేశాలు, సభల్లోను నాయకులు బట్టీ పట్టి వచ్చిన ప్రసంగాలను దంచి కొడుతుంటారు. కానీ ప్రభుత్వం పరంగా నిర్ణయాలు తమ చేతిలో ఉన్నప్పుడు భవిష్యత్ తరాల్లో తెలుగుభాషను సజీవంగా ఉంచే ప్రయత్నం ఎందుకు చేయలేరు? అలాంటి క్రియాశీల భాషా సేవకు ఇప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నడుం బిగిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలో ప్రతి పాఠశాలలోనూ 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరిగా బోధించేలా చట్టం చేయబోతున్నారు.
నిజానికి ఇది చాలా కాలంగా నలుగుతున్న ఆలోచనే. అయితే.. ప్రెవేటు పాఠశాలల ఒత్తిళ్లకు ప్రభుత్వాలు తలొగ్గుతూ వచ్చాయి. కాకపోతే.. ఇప్పుడు కేసీఆర్ నిర్దిష్టమైన ప్రణాళికతో తెలుగు భాష పరిరక్షణకు నడుం బిగిస్తున్నారు. గతంలో ప్రభుత్వాలు తెలుగు భాషా ఉత్సవాలు నిర్వహించినా నామమాత్రంగా జరిగేవి. తెలంగాణలో డిసెంబరులో తలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభలు.. భారీస్థాయిలో రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి అతిథులుగా.. 50 కోట్ల బడ్జెట్ తో నిర్వహించడానికి పూనుకోవడమే ముఖ్యమంత్రి చిత్తశుద్ధిని చెబుతోంది.
అలాగే.. తెలంగాణలో నేమ్ బోర్డులు అన్నీ కూడా తెలుగులోనే రాయాలని ఆదేశించడం, ప్రభుత్వ కార్యకలాపాలు తెలుగులోనే జరగాలని సూచించడం ఇవన్నీ కూడా భాష సజీవంగా భవిష్యత్ తరాలకు అందడానికి ఉపకరిస్తాయని పలువురు భావిస్తున్నారు. భాషా పరిరక్షణలో సరైన నిర్ణయం తీసుకుంటున్నందుకు కేసీఆర్ కు అభినందనలు దక్కుతున్నాయి.

(Visited 129 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *