తెలంగాణతో పోలిస్తే బాబు వెనకపడ్డట్లే!

తెలంగాణతో పోలిస్తే బాబు వెనకపడ్డట్లే!

చంద్రబాబునాయుడు చాలా నిర్ణయాల విషయంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరును, అనుసరిస్తున్న విధానాలను స్ఫూర్తిగా తీసుకుంటున్న సంగతి కనిపిస్తూనే ఉంది. అయితే తెలంగాణ సర్కారు అడుగుజాడల్లో నడుస్తున్నప్పటికీ కూడా.. వారి తర్వాత తాను నిర్ణయం తీసుకుంటూ.. సదరు నిర్ణయాల్లో ఉండగల లోటుపాట్లను చక్కదిద్దుకునే అవకాశం ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు మాత్రం తడబడుతున్నట్లే కాస్త వెనుకపడుతున్నట్లే కనిపిస్తోంది. ఎందుకంటే.. తాజాగా ఏపీలో చంద్రబాబునాయుడు చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా పూనమ్ కౌర్ ను నియమించారు. పూనమ్ కౌర్ సినీ హీరోయిన్ అయినప్పటికీ ప్రస్తుతం సినిమాల్లో అంత బిజీగా లేదు. యూత్ లో అంత క్రేజ్ కూడా లేదు. ఏదో తాము కూడా హీరోయిన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా పెట్టినట్లు చెప్పుకోవాల్సిందే తప్ప.. ఆమె ద్వారా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చునని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

అదే తెలంగాణ సర్కారు ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ రేంజిలో ఉన్న సమంతను చేనేత రంగానికి బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. అప్పటినుంచి సమంత అనేక చేనేత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. చేనేత గ్రామాలకు వెళుతున్నారు. తరచుగా చేనేతకు సంబంధించిన వార్తల్లో నిలుస్తున్నారు. ఏదో ఒక రీతిలో చేనేత రంగం పై ఆధునికుల దృష్టి కూడా పడేలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఆమె బ్రాండ్ అంబాసిడర్ అయినందుకు చేనేత రంగానికి ఎంతో కొంత లబ్ది జరిగే అవకాశం ఉంది.
ఆ కోణంలోంచి చూసినప్పుడు చంద్రబాబునాయుడు సర్కారు కొంత వెనకపడిందనే అనుకోవాలి.

ఎందుకంటే.. సమంత టాప్ గ్రేడ్లో ఉన్న నాయిక. అదే సమయంలో ఆమెకు సమానమైన రేంజిలోని మరో హీరోయిన్ ను వెతికి పట్టుకోవడంలో ఏపీ సర్కారు విఫలం అయింది. పూనమ్ కౌర్ ఫేడ్ అవుట్ అయిపోయిన నాయిక. చేనేత గురించి ఆమె ఏం చెప్పినా ఆ మాటలు ఎవరికి ఉత్తేజం కలిగిస్తాయన్నది సందేహమే. అయినా ఒక రంగాన్ని బాగు చేయడం అభివృద్ధిలోకి తీసుకువెళ్లడం అనేది కేవలం బ్రాండ్ అంబాసిడర్ నియామకంతో ముగిసిపోదు…. ఆ రంగంపై ప్రభుత్వం ఎంత శ్రద్ధ పెడుతుంది అనేదానిపైనే ఆధారపడి ఉంటుంది.
ఆ రకంగా తెలంగాణ సర్కారు చాలా ఎక్కువ శ్రద్ధనే పెడుతున్నట్లు తెలుసుకోవాలి. చేనేత మీద దృష్టి పెట్టిన నాటినుంచి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రభుత్వం తరఫున ఏ అతిథులకు ఏ కానుక ఇవ్వాల్సి వచ్చిన సరే.. చేనేత వస్త్రాలనే ఇస్తున్నారు. చేనేత దుస్తుల ఫ్యాషన్ షో గట్రా నిర్వహిస్తూ ఆధునిక తరానికి అందులోని సోయగాల్ని పరిచయం చేస్తున్నారు. మరి ఇలాంటి కొత్త పోకడలు ఎన్నో అనుసరిస్తే తప్ప.. ఏపీలో చేనేత రంగాన్ని ముందుకు తీసుకురావడం సాధ్యం కాదని చంద్రబాబు తెలుసుకోవాలి.

(Visited 166 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *