హైద‌రాబాద్ లో 6 వేల కోట్ల బిచ్చ‌గాడు

హైద‌రాబాద్ లో 6 వేల కోట్ల బిచ్చ‌గాడు

అత‌ను ఆరువేల కోట్ల సామ్రాజ్యానికి అధిప‌తి. బిచ్చ‌గాడు సినిమాలో హీరో త‌ల్లికోసం సాధార‌ణంగా బ‌తికితే ఇత‌ను తండ్రి ఆదేశాల మేర‌కు నెల రోజులు అత్యంత సామాన్యుడిగా తాను ఎవ‌రో తెలియ‌కుండా బ‌తికాడు. నెల రోజుల ప‌రీక్ష పూర్త‌య్యాక తాను ఎక్క‌డున్న‌ది కుటుంబ స‌భ్యుల‌కు చెప్పాడు. దీంతో ఇక్క‌డ ఐపీఎస్ అధికారి రాజీవ్‌ త్రివేదికి చెప్పి పెద‌నాన్న, పెద్ద‌మ్మ‌ల‌ స‌మ‌క్షంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు. నెల రోజులు అతిసాధార‌ణంగా మురికివాడల్లో, ఫుట్ పాత్ మీద బ‌తికిన ఆ వార‌సుడు హితార్థ్‌ ఘన్‌శ్యాం డోలాకియా. వ‌య‌సు పాతికేళ్లు. సాధార‌ణ వ్య‌క్తిగా జీవించ‌డంలో తాను ఫెయిల్ అయ్యాన‌ని, అయితే హైద‌రాబాద్ ప్రేమ‌ను మాత్రం ఎన్న‌టికీ మ‌ర‌వ‌లేన‌ని అంటున్నాడు.

గుజరాత్‌కు చెందిన హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్‌కు చెందిన ప్రముఖ నగల వ్యాపారి ఘన్‌శ్యాం డోలాకియా. ఆ సంస్థ టర్నోవర్‌ దాదాపు రూ.6,000 కోట్లు. ఈ కుటుంబాల‌కు చెందిన వారు ఎవ‌ర‌యినా ఖ‌చ్చితంగా వ్యాపారంలోకి అడుగుపెట్టే ముందు త‌మ‌కు సంబంధం లేని, ప‌రిచ‌యం లేని చోట సామాన్యుడిలా జీవించాల‌ట‌, ఇందులో భాగంగానే తండ్రి మాట మేర‌కు రూ.500 తీసుకుని హితార్థ్ భాగ్య‌న‌గ‌రంలో దిగిపోయాడు.

విమానాశ్ర‌యం నుండి సికింద్రాబాద్ చేరుకున్న హితార్ద్ ఓ రోజు అక్క‌డ‌, మ‌రో రోజు అమీర్ పేట్ లాల్ బంగ్లా, మ‌రి కొద్ది రోజులు ఓ కంపెనీలో టెలీకాల‌ర్, కొద్ది రోజులు నైకీ, త‌రువాత ఆడిడాస్ సంస్థ‌ల‌లో ప‌నిచేశాడు. ఓ రోజు రిక్షా కార్మికుడితో ఇంకో రోజు ఫుట్ పాత్ మీద‌, మురికివాడ‌ల‌లో 30 రోజుల‌లో సాధార‌ణ జీవితంలోని అన్ని పార్శాలు చూశాడు హితార్ధ్. నెల రోజుల గ‌డువు ముగియ‌డంతో త‌ల్లిదండ్రుల‌కు ఎక్క‌డున్న‌ది చెప్పాడు. వారంతా హైద‌రాబాద్ వ‌చ్చి రాజీవ్ త్రివేది స‌మ‌క్షంలో మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

అమెరికాలోని న్యూయార్క్ లో చ‌దువుకుని, పైలెట్ శిక్ష‌ణ కూడా పూర్తి చేసుకున్న హితార్ధ్ వ్యాపారంలోకి అడుగు పెట్టేందుకు తండ్రి చెప్పిన‌ట్లు 500 జేబులో పెట్టుకుని ఓ క‌వ‌ర్ చేతికిస్తె ప‌ట్టుకుని బ‌య‌ట‌కు న‌డిచాడు. దానిని తెర‌చి చూస్తే హైద‌రాబాద్ విమాన టికెట్ క‌నిపించింద‌ట‌. ఇక్క‌డ దిగాక తండ్రి ఇచ్చిన 500లు, తాను సంపాదించిన మిగ‌తా డ‌బ్బుల‌తో నెల రోజులు గ‌డిపాడు. హైద‌రాబాద్ నాకు బ‌త‌క‌డం, ఉద్యోగం సాధించ‌గ‌ల‌న‌నే న‌మ్మ‌కం నేర్పింది. ఇప్ప‌టి వ‌ర‌కు అల‌వాటు లేని వ‌రి అన్నం అల‌వాటు అయింది. ఈ నెల రోజుల జీవితం ఎన్నో పాఠాలు నేర్పింద‌ని అన్నాడు హితార్ద్.

(Visited 1,802 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *