నంధ్యాల‌లో ఏం జ‌రుగుతుంది ?

నంధ్యాల‌లో ఏం జ‌రుగుతుంది ?

ఆంధ్రా రాజ‌కీయాల్లో ఇప్పుడు నంధ్యాల ఉప ఎన్నిక ప్ర‌కంప‌న‌లు సృష్టిస్తుంది. ఈ ఎన్నిక‌లు తెలుగుదేశం పార్టీకి జీవ‌న్మ‌ర‌ణ పోరాటం అయితే .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భ‌విష్య‌త్ కు సంబంధించిన‌ది. రెండేళ్ల‌లో సాధార‌ణ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ ఉప ఎన్నిక రావ‌డం చంద్ర‌బాబుకు అగ్నిప‌రీక్ష అని చెప్పాలి. అస‌లే ప్ర‌జావ్య‌తిరేక‌త .. అందునా ఉప ఎన్నిక‌. ఇక్క‌డ ఫెయిల‌యితే పార్టీలో సంక్షోభం వ‌చ్చే అవ‌కాశం లేక‌పోలేదు. ఇక 2019లో అధికారం కావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్క‌డ త‌న స‌త్తా చాటాలి. అన్ని వ‌త్తిళ్లు దాటుకుని విజ‌యం సాధిస్తే ఆ పార్టీకి స్వ‌ర్ణ‌యుగం మొద‌ల‌యిన‌ట్లేన‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంచ‌నా వేస్తున్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున గెలిచిన దివంగ‌త ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరి అనారోగ్యంతో మ‌ర‌ణించారు. ఇప్పుడు టీడీపీ త‌ర‌పున భూమా సోద‌రుడు పోటీకి దిగాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన భూమా అఖిల‌ప్రియ టీడీపీలో చేరి ఇప్పుడు మంత్రి అయింది. ఇప్పుడు నంధ్యాల‌లో ఓడిపోతే తెలుగుదేశం పార్టీలో అమె ప‌రిస్థితి త‌ల‌కిందులు అవుతుంది. అవ‌స‌రాన్ని బ‌ట్టి వాడుకునే చంద్ర‌బాబు నాయుడు ఆమెను మంత్రి ప‌ద‌వి నుండి తొల‌గించినా ఆశ్చ‌ర్య‌పోయే ప‌రిస్థితి లేదు. అదే జ‌రిగితే ఆమె రాజ‌కీయ జీవితం ఇక్క‌డితో ముగిసిన‌ట్లే భావించాలి.

నంధ్యాల ఉప ఎన్నిక వ్య‌వ‌హారం తెర‌మీద‌కు రాగానే అధికార టీడీపీ తాయిలాలు జ‌ల్ల‌డం మొద‌లుపెట్టింది. శిల్పా సోద‌రులు టీడీపీని వీడ‌డంతో అక్క‌డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓ ఊపు వ‌చ్చింది. దీంతో గ‌తంలో శిల్పా సోద‌రుల‌కు ముస్లింల‌తో ఉన్న వైరాన్ని ప్ర‌చారంలోకి తెచ్చి టీడీపీ ప‌రిస్థితిని త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకునే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. చోటా మైనార్టీ లీడ‌ర్ల‌ను కూడా స్వ‌యంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న స‌మ‌క్షంలో పార్టీలో చేర్చుకున్నారు. అయితే ముస్లింల‌ను బుజ్జ‌గించి శిల్పా సోద‌రులు ప‌రిస్థితిని కొంత అదుపులోకి తెచ్చుకున్నారు. ఇక జ‌గ‌న్ బ‌హిరంగ స‌భ త‌రువాత ప‌రిస్థితి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొగ్గుగా మారిన‌ట్లు చెబుతున్నారు.

సొంత నియోజ‌క‌వ‌ర్గం ఆళ్ల‌గ‌డ్డ‌లో త‌ల్లి మ‌ర‌ణించిన‌ప్పుడు నిల‌బ‌డితే అఖిల‌ప్రియ ప‌దివేల ఓట్ల మెజార్టీతో నెగ్గింది. ఇప్పుడు ప‌క్క నియోజ‌క‌వ‌ర్గం నంధ్యాల‌లో ఏం ప్ర‌భావం ఉంటుంద‌ని భావిస్తున్నారు. అధికార పార్టీ యంత్రాంగం అంతా అక్క‌డ మోహ‌రించ‌డంతో ఎంత వ‌ర‌కు ప్ర‌జ‌ల మీద వ‌త్తిడి ప‌నిచేస్తుంద‌ని అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. జ‌గ‌న్ స్వ‌యంగా అక్క‌డ తిష్ట వేసి ప్ర‌చారానికి దిగ‌డంతో రానున్న ప‌దిరోజుల్లో నంధ్యాలలో ఏం జ‌రుగుతుంది ? అన్న ఉత్కంఠ నెల‌కొంది. దీనికి తోడు చంద్ర‌బాబు కూడా రెండు రోజుల ప్ర‌చారానికి వ‌స్తాడ‌న్న వార్త‌లు ఈ ఎన్నిక ఇరు పార్టీల‌కు ఎంత అవ‌స‌ర‌మో తేలుస్తుంది.

నంధ్యాల ఉప ఎన్నిక‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తే టీడీపీలో ఉన్న అసంతృప్తి వ‌ర్గం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని అంటున్నారు. జ‌గ‌న్ పార్టీలో గెలిచి టీడీపీలోకి 21 మంది ఎమ్మెల్యేలు వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు టీడీపీ ఓడిపోతే 25 మందికి పైగా ఎమ్మెల్యేలు టీడీపీని వీడ‌తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. జ‌గ‌న్ స‌భ‌తో ఆ పార్టీ నేత‌ల్లో ఉత్సాహం పెరిగింది. అధికార పార్టీ నేత‌లు కేవ‌లం త‌మ అధికార బ‌లంతోనే ఓట్లు రాబ‌ట్టే ప‌నిలో నిమ‌గ్నం అయ్యారు. నంధ్యాల ఉప ఎన్నిక ఆంధ్రా రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేస్తుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

(Visited 341 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *