క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

కల్వకుంట్ల తారక రామారావు ఆలియాస్ కేటీఆర్ సింహనాదం చేశారు. రాజకీయ సమీకరణాలు, బెదిరింపులు, పునరేకీకరణలు… ఇత్యాది అనేక అంశాలు తెలంగాణలో జోరుగా వినిపిస్తున్న తరుణంలో కీలకమైన ప్రభుత్వ వ్యవహారాలకు అన్నీ తానై వ్యవహరిస్తున్న కేటీఆర్ మీడియాతో ముచ్చటిస్తూ సింహంలాగా గర్జించారు. తమ బలం గురించి, ధీమా గురించి విస్పష్టంగా తేల్చిచెప్పారు. తెలంగాణలో ఎప్పటికీ అధికారం మీదే.. ప్రజల బలం మాకు సంపూర్ణంగా ఉంది. యాభై శాతానికి పైగా ఓట్లు మావే… అంటూ తెగేసి చెప్పిన కేటీఆర్.. ‘సింహం సింగిల్ గా వస్తుంది..’ అనే డైలాగును రిపీట్ చేస్తూ… తమకు పొత్తులతో పని లేదని..ప్రత్యేకించి.. బీజేపీతో పొత్తు కట్టే అవకాశం ఉన్నదంటూ వస్తున్న ఊహాగానాల్లో ఏమాత్రం పస లేదని కూడా అందరికీ క్లారిటీ ఇచ్చేశారు.

కొన్నాళ్లుగా రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. భాజపాతో , తెరాస అనుసరిస్తున్న పోకడల్ని బట్టి.. వచ్చే ఎన్నికలకు వీరు జట్టు కడతారా అనే సంకేతాలను పలువురు స్వీకరిస్తున్నారు. అయితే.. తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదన్నట్లుగా బీజేపీ టీఆర్ఎస్ సర్కారు పట్ల ప్రత్యర్థి వైఖరితోనే వ్యవహరిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కేంద్రంలో మాత్రం తెరాస మోడీ సర్కారుకు అనుకూలంగా ఉంటోంది. ఈ అనుకూలత అనేది కేవలం అంశాల వారీ మద్దతు మాత్రమే అని.. అంత మాత్రాన మేం వారి జేబులోకి వెళ్లిపోయినట్లు కాదని కేటీఆర్ చెప్పడం విశేషం.

అలాగే కేసీఆర్ తర్వాత ఎవరు? అనే సందేహాలకు కూడా కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. 2029 వరకు కేసీఆర్ పాలనే నడుస్తుందని, ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణే తమ బలం అని చెప్పేశారు. మా ఇద్దరి కంటె కూడా కేసీఆర్ సంపూర్ణారోగ్యంతో ఉన్నారని కేటీఆర్ చెప్పడం విశేషం. ఇక టీఆర్ఎస్ గురించి, అక్కడి వారసత్వ పోరాటాల గురించి రకరకాల పుకార్లు పుట్టించేవాళ్ల నోళ్లకు తాళాలు పడవచ్చు. కేటీఆర్ చాలా విషయాల్లో క్లారిటీ ఇచ్చిన ఈ ముచ్చట్లు ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా చెలామణీ అవుతున్నాయి.

(Visited 444 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *