తెలంగాణ‌ కొత్త బ‌డ్జెట్ అదిరిపోతుంద‌ట‌

TELANGANA-mp-agitation-for-

దేశంలో ఎఫ్‌ఆర్‌బిఎం (ద్రవ్య పరపతి ఆర్థిక నిర్వహణ) కింద అదనంగా 0.5 శాతం నిధులను అంటే దాదాపు రూ. 2915 కోట్లను తెచ్చుకునే అవకాశం పొందిన ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరసన తెలంగాణ చేరింది. ఈ నేప‌థ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముచ్చటగా నాల్గవసారి భారీ ఎత్తున సంక్షేమ ప‌థ‌కాల‌తో ఎన్నికల బడ్జెట్‌ను వచ్చే నెలాఖరు లేదా మార్చిలో ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. గత మూడు బడ్జెట్‌లలో సంక్షేమం, భారీ సాగునీటిపారుదలకు పెద్ద పీట వేసిన కేసీఆర్ సర్కార్ 2017-18 సంవత్సరానికి కూడా విపక్షాలకు ఆయుధం లేకుండా చేసే విధంగా బడ్జెట్‌ను సమర్పించేందుకు చకచకా పావులు కదుపుతోందని స‌మాచారం.

వచ్చే బడ్జెట్‌లో ప్రధానంగా ఫీజు రీయింబర్స్‌మెంట్, డబుల్ బెడ్ రూం, ఆరోగ్య పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి మొత్తం ప్రక్షాళన చేసి లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరే విధంగా చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గతంలో ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద బడ్జెట్ ప్రతిపాదనలు వివిధ శాఖలు ప్రభుత్వానికి పంపేవి. కాని ఈసారి ఈ ప్రతిపాదనలకు స్వస్తి చెప్పి, ప్రతి శాఖ తమకు అందుబాటులో ఉండే వనరులు, అమలు చేస్తున్న పథకాలు, వాటికి అవసరమైన నిధులు, గత ఏడాది ఖర్చుపెట్టిన మొత్తం వివరాలతో ప్రతిపాదనలు పంపాలని రాష్ట్రప్రభుత్వం ఆదేశించింది. ఈ నెల 10వ తేదీ లోగా జిల్లా కలెక్టర్లు కొత్త ఫార్మెట్‌లో బడ్జెట్ ప్రతిపాదనలు పంపితే, 12వ తేదీలోగా వివిధ శాఖల కార్యదర్శులు వాటిని సమీక్షించి అవసరమైన మార్పులు చేసి ఆర్థిక శాఖకు పంపాలి. రెండో సంస్కరణల కమిటీ, రంగరాజన్ కమిటీ సిఫార్సుల మేరకు ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల కింద బడ్జెట్ ప్రతిపాదనలు రూపొందించే పాత పద్ధతికి కేంద్రం స్వస్తి చెప్పింది. కేంద్రం బాటలోనే తెలంగాణ రాష్ట్రం కూడా కొత్త పద్ధతిలో బడ్జెట్ ప్రతిపాదనలు పంపాలని కోరడం విశేషం. అలాగే బడ్జెట్ ప్రతిపాదనలు పంపే సమయంలో ఆర్థిక, సామాజిక కోణాలను కూడా ప్రస్తావించాలని ఆర్థిక శాఖ కోరింది.

2015-16లో రూ. 1,15,689 కోట్లున్న బడ్జెట్‌ను 2016-17లో రూ. 1,30,436 కోట్లకు తీసుకెళ్లారు. ప్రణాళిక వ్యయం 67వేల కోట్లు, ప్రణాళికేతర వ్యయం 62 వేల కోట్లను చూపించారు. 2017-18లో కొత్త బడ్జెట్‌ను రూ.1.50 లక్షల కోట్లకు ప్రవేశపెట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తోంది. నిరుడు ఇరిగేషన్‌కు 169.1 శాతం పెంచి రూ.24,132 కోట్లను కేటాయిస్తే, ఈసారి రూ. 32 వేల కోట్లను ప్రతిపాదించనున్నట్లు సమాచారం. రాష్ట్రప్రభుత్వానికి కీలకమైన సామాజిక సంక్షేమ రంగానికి కేటాయింపులను రూ.14,617 కోట్ల నుంచి రూ.22వేల కోట్లకు పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. వచ్చే బడ్జెట్‌లో ఇరిగేషన్, సంక్షేమానికి పెద్ద పీట వేస్తే అటు తామనుకున్న ప్రాజెక్టులు కొన్ని పూర్తయి సాగునీటిని ఇవ్వవచ్చని, సంక్షేమ రంగంలో కూడా రాష్ట్రంలో 85 శాతం ఉన్న బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను సంతృప్తి పరచవచ్చనే ఆశాభావంతో ప్రభుత్వం ఉంది. సాలీనా ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద రూ. 2500 కోట్ల వరకు ఖర్చుపెట్టినా, ఆశించిన ఫలితాలు రాకపోగా, వస్తున్న విమర్శలను పరిశీలించి ఈ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలనే యోచనతో ప్రభుత్వం ఉంది. ఆరోగ్య రంగంలో కూడా ఆశించిన ఫలితాలు లేవు. గాంధీ, ఉస్మానియా, నిమ్స్, నిలోఫర్ ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపడక పోవడాన్ని గుర్తించి లోపాలను సరిదిద్దేందుకు భారీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

దేశంలో ద్రవ్య పరపతి ఆర్థిక నిర్వహణ కింద అదనంగా 0.5 శాతం నిధులను అంటే దాదాపు రూ. 2915 కోట్లను తెచ్చుకునే అవకాశం పొందిన ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల సరసన తెలంగాణ చేరింది. 2015-16లో రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి రూ. 5,83,117 కోట్లు. దీని కింద రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బిఎం కింద మూడు శాతం అంటే రూ.17,494 కోట్ల రుణాలు తెచ్చుకోవచ్చు. 14వ ఆర్థిక కమిషన్ నిబంధనలకు లోబడి తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఉండడంతో అదనంగా 0.5 శాతం నిధులు ఎఫ్‌ఆర్‌బిఎం కింద తెచ్చుకోగలిగింది. అదనంగా వచ్చే ఈ నిధులతో ఆరోగ్య, మాతాశిశు సంక్షేమ రంగాల్లో మెరుగైన సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోందని స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ప్ర‌జ‌ల‌కు మ‌రిన్ని సంక్షేమ ఫ‌లాలు అంద‌నున్న‌ట్లు చెప్తున్నారు.

NO COMMENTS

Leave a Reply