ప్ర‌ధాని ప్ర‌సంగంలో ఆ విష‌యం ఎందుకు లేదు?

modi

పెద్ద నోట్ల రద్దు జరిగి 50రోజులు ముగిసిన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. ఈ క్ర‌మంలో మధ్య తరగతి ప్రజలు, రైతులు, చిన్న పారిశ్రామికవేత్తలు, దుకాణాల వారు, గర్భిణీ మహిళలు, సీనియర్ సిటిజన్లపై వరాలు కురిపించారు. డిజిటల్ చెల్లింపులను అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కీలకమైన ఆర్థిక అంశాల జోలికి పోకుండా అన్ని వర్గాలకు తలా ఇంత అన్నట్టుగా ప్రకటనలు చేశారు. రెండు కొత్త గృహ పథకాలను ప్రకటించటంతో పాటు రైతుల రుణాలపై వడ్డీ తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాయితీలు అందించారు. గర్భిణిలకు ఆరు వేల నగదు సహాయం చేస్తామని, ఆ మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించారు.గర్భిణీలకు ప్రసవం, వ్యాక్సినేషన్, పౌహికాహారం కోసం ఈ మొత్తాన్ని ఇస్తున్నట్లు మోదీ వివరించారు. సీనియర్ సిటిజన్లకు ఏడున్నల లక్షల డిపాజిట్ల వరకు ఎనిమిది శాతం వడ్డీ చెల్లిస్తామని తెలిపారు.

దేశంలోని 125 కోట్ల మంది దేశ ప్రజలు కొత్త సంవత్సరాన్ని కొత్త నిర్ణయాలు,కొత్త ఉత్తాహంతో ఆహ్వానిస్తారన్న ధీమాను వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం 2017లో గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు కట్టుకోవాలనుకునే వారికి, ఉన్న ఇంటికి మరిన్ని గదులు జత చేయాలనుకునే వారికి బ్యాంకు రుణాల వడ్డీలో రాయితీలు ఇస్తామని చెప్పారు. రెండు లక్షల రుణం వరకు మూడు శాతం వడ్డీ రాయితీ, తొమ్మిది లక్షల వరకు రుణం తీసుకునే గ్రామీణ ప్రాంతాల వారికి నాలుగు శాతం వడ్డీ రాయితీ లభిస్తుందని, ఇదే విధంగా పనె్నండు లక్షల వరకు రుణం తీసుకునే వారికి మూడు శాతం వడ్డీ రాయితీ ఇస్తున్నట్లు మోదీ తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఇళ్ల సంఖ్యను 35 శాతం పెంచుతున్నట్లు తెలిపారు. పెద్ద నోట్ల రద్దు తరువాత వ్యవసాయ రంగం దెబ్బతిన్నదంటూ కొందరు చేసిన ఆరోపణలో ఎలాంటి నిజం లేదన్నారు. ఈ సంవత్సరం రబీ సాగు పెరిగింద్నారు. జిల్లా సహకార బ్యాంకులు, సెంట్రల్ సహకార బ్యాంకుల నుండి రబీ పంట కోసం రుణం తీసుకున్న రైతుల వడ్డీకి సంబందించి అరవై రోజుల వడ్డీని కేంద్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. నాబార్డు ద్వారా ఇరవై వేల కోట్ల రూపాయలను రైతులకు రుణంగా ఇస్తామని,రైతుల కిసాన్ క్రెడిట్ కార్డులను రుపే కార్డులుగా మారుస్తున్నామని ప్రకటించారు. రైతులు ఇక మీదట రుపే కార్డుల ద్వారా ఎక్కడి నుంచైనా తమ రుణాల మొత్తాన్ని తీసుకోవచ్చునని తెలిపారు. రానున్న మూడు నెలల్లో మూడు కోట్ల కిసాన్ క్రెడిట్ కార్డులను రుపే కార్డులుగా మారుస్తామన్నారు.

చిన్న తరహా పరిశ్రమలకు క్రెడిట్ గ్యారంటీని కోటి రూపాయల నుండి మూడు కోట్ల రూపాయలకు పెంచుతున్నట్లు మోదీ ప్రకటించారు. దీని వల్ల దుకాణాలు,చిన్న వ్యాపారస్తులకు రుణాలు లభిస్తాయన్నారు. చిన్న వ్యాపాస్తుల నగదు క్రెడిట్ పరిమితిని ఇరవై శాతం నుండి ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్టు మోదీ ప్రకటించారు.చిన్న వ్యాపారస్తులు డిజిటల్ రూపంలో లావాదేవీలు చేస్తే వారి పన్ను లెక్కింపు ఎనిమిది బదులు ఆరు శాతం ఉంటుందన్నారు. దుకాణాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ఇది తోడ్పడుతుందన్నారు. బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున నగదు వచ్చినందున బ్యాంకు అధికారులు ఎంతో జాగ్రత్తగా పని చేయాలని, బడుగు,బలహీన, దళిత వర్గాల వారికి రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ప్రధానమంత్రి ప్రసంగంలో జన్ ధన్ అకౌంట్లలో సొమ్ములు  వేస్తారని కొందరు చేసిన ప్రచారం నిజం కాలేదని కొందరు పెదవి విరవడం ఆసక్తి.

హైలైట్స్
7.5లక్షల మొత్తాన్ని పదేళ్ల డిపాజిట్‌పై సీనియర్ సిటిజన్లకు 8శాతం వడ్డీ..నెలవారీ చెల్లింపు
గర్భిణిలకు 6వేల ఆర్థిక సాయం.. ఖాతాల్లోనే జమ
చిన్న వ్యాపారస్తులకు క్రెడిట్ పరిమితి 25శాతానికి పెంపు
రెండు కోట్ల రుణాల వరకూ కేంద్రం గ్యారంటీ
గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల రుణాలపై 2లక్షల వరకూ 3శాతం వడ్డీ రాయితీ
రూ.2 లక్షల వరకు గృహ రుణాలపై 2 శాతం వడ్డీ రాయితీ
రబీ రుణాలపై 60 రోజుల వడ్డీని కేంద్రమే భరిస్తుంది
పిఎమ్‌ఎవై కింద 9లక్షల రుణాలపై 4శాతం, 12లక్షలపై 3శాతం వడ్డీ రాయితీ
రూపే కార్డులుగా కిసాన్ క్రెడిట్ కార్డులు.. మూడు నెలల్లో మార్పు

NO COMMENTS

Leave a Reply