ప్ర‌ధాన‌మంత్రిని విచార‌ణ‌కు పిలుస్తార‌ట‌

modi

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇర‌కాటంలో ప‌డే ప‌రిణామం ఇది. పెద్దనోట్ల రద్దు చేసిన నేప‌థ్యంలో ప్ర‌ధాని మోడీని పార్లమెంట్‌ ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ప్రశ్నించనుంది. నోట్ల రద్దుపై తాము రూపొందించిన ప్రశ్నావళికి ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రధానాధికారులు, ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ ఇచ్చిన సమాధానాలు సంతృప్తికరంగా లేనిచో నేరుగా ప్రధానమంత్రికే సమన్లు జారీచేయాలని పీఏసీ భావిస్తోంది. ఈ నెల 20న ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌, ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్‌ లవాస, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శశికాంత దాస్‌తో జరగనున్న సమావేశం అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.

ఆయా వ‌ర్గాల‌కు ఓ ప్రశ్నావళిని పంపామని, దానికి సమాధానాలు త్వరలోనే వచ్చే అవకాశ ముందని, అనంతరం ఈ నెల 20న దానిపై చర్చిస్తా మని పీఏసీ చైర్మన్‌, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కేవీ థామస్‌ తెలిపారు. ఒకవేళ ఆర్బీఐ, ఆర్థిక శాఖ ఇచ్చే వివరణ సంతృప్తికరంగా లేకపోతే ఈ వ్యవహారంతో సంబంధ మున్నవారెవరినైనా విచారించే అధికారం తమకు ఉందన్నారు. అయితే అది జనవరి 20 తర్వాతే తెలుస్తుందన్నారు. సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయిస్తే నోట్ల రద్దుపై ప్రధానమంత్రిని విచారిస్తామన్నారు.

నవంబర్‌ 8న నోట్లను రద్దు చేసిన అనంతరం ప్రధాని నరేంద్రమోడీని తాను కలిశానని, అయితే 50 రోజుల్ల పరిస్థితి సాధారణ స్థాయికి వస్తుందని, డిసెంబర్‌ చివరినాటికి చక్కబడుతుందని తెలిపారని థామస్‌ పేర్కొన్నారు. కానీ నేటికీ అలాంటి సూచనలు కనిపించడం లేదన్నారు. దీంతో భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్న అంశం కాబట్టి దీనితో సంబంధం ఉన్న వారిని విచారించాలని పీఏసీ నిర్ణయించిందన్నారు. ఈ వ్యవహారంలో ప్రధాని మోడీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, తన తప్పుడు నిర్ణయాన్ని ప్రజలమీద రుద్దేందుకు ప్రయత్నిస్తున్నారని , రూ.2వేల నోటును తీసుకురావడం ఆయన విచక్షణా జ్ఞానాన్ని బయటపెడుతోందన్నారు. టెలికాం సౌకర్యాలు పూర్తిగా విస్తరించని దేశంలో మొబైల్‌ ద్వారా ఈ-లావాదేవీలు జరపాలని ప్రధాని ఎలా ఆలోచిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో సరైన మౌలిక సదుపాయాలున్నాయా అని నిలదీశారు. ఇక నోట్ల రద్దుకు సంబంధించిన అన్ని విషయాలతో ఆర్బీఐ, ఆర్థిక శాఖ అధికారులకు ప్రశ్నావళిని పంపించామన్నారు. వాటిలో కొన్ని ప్రశ్నలు ఈ విధంగా ఉన్నాయన్నారు. నిర్ణయం తీసుకున్నవారిని ఈ ప్రశ్నలు సంధించినట్టు తెలిపారు. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు ఎంత నగదు వచ్చింది? ప్రజలు తమ నగదును తాము తీసుకునేందుకు పరిమితి విధించడానికి ఏమైనా చట్టం ఉందా? ఎంత నగదును విపణిలోకి విడుదల చేశారు? నల్లధనం ఎంత వచ్చింది, ఆర్థిక వ్యవస్థపై, పేద ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపింది? వంటి ప్రశ్నలున్నాయని థామస్‌ వివరించారు. అలాగే కాగ్‌ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకొని సుమోటోగా విచారించనున్నట్టు తెలిపారు.

NO COMMENTS

Leave a Reply