మూవీ రివ్యూ : ఓకే బంగారం

న‌టీన‌టులు: దుల్కార్ స‌ల్మాన్ (మ‌మ్ముట్టి త‌న‌యుడు), నిత్యామీన‌న్‌, ప్ర‌కాష్‌రాజ్‌, లీలా శామ్స‌న్‌, క‌నిక త‌దిత‌రులు
ద‌ర్శ‌క‌త్వంః మ‌ణిర‌త్నం
కెమెరా: పి.సి.శ్రీ‌రామ్‌
సంగీతం: ఏ.ఆర్‌.రెహ‌మాన్‌
రేటింగ్‌: 2.75/ 5
సింగిల్ లైన్ స్టోరి:
కెరీర్‌ని వెతుక్కుంటూ ముందుకు సాగే న‌వ‌త‌రం త‌ల్లిదండ్రుల‌కు దూర‌మై.. ప్రేమ‌, స‌హ‌జీవ‌నం అంటూ కొత్త‌దారిని వెతుకుతున్నారు. అలా వెతుక్కున్న ఓ జంట జీవితంలో ఏం జ‌రిగింది? అనేదే సినిమా. జీవితం అంటే ప్రేమ‌లోని మాధుర్యం, కుటుంబ ఉద్వేగాలు, వృత్తిలో ఒత్తిడులు, ఎంజాయ్‌మెంట్‌, బాధ, సుఖం, దుఃఖం .. ఇలా అన్ని పార్శాలు ఉంటాయ‌న్న‌దే కాన్సెప్ట్‌. వాటిని యువ‌త‌రం ఎంతగా ఆస్వాధిస్తే అంత‌గా లైఫ్ బావుంటుంద‌ని చెప్ప‌డానికి మ‌ణిర‌త్నం చేసిన ప్ర‌య‌త్న‌మిది.

ముందొక మాట‌:
మ‌ణిర‌త్నం సినిమా అంటేనే ఓ అంద‌మైన క‌విత‌. అత‌డి ప్ర‌తి సినిమాలో భావుక‌త ఉంటుంది. ప్ర‌తి పాత్ర ప్ర‌వ‌ర్త‌న ఉద్వేగాన్నిర‌గిలిస్తుంది. గీతాంజ‌లి, దిల్‌సే, రోజా, బొంబాయి, స‌ఖి .. ఒక‌టేమిటి ప్ర‌తి సినిమాలో ఆయ‌న హృద్య‌మైన ప్రేమ‌ను, అందులోని ఘాడ‌త‌ను ఆవిష్క‌రించారు. అందుకే మ‌ణిర‌త్నం నుంచి ప్రేమ‌క‌థా చిత్రం వ‌స్తోంది అంటే ఎన్నో అంచ‌నాలేర్ప‌డ్డాయి. స‌ఖి సినిమా త‌ర్వాత మ‌ళ్లీ అత‌డి నుంచి అభిమానులు ఎలాంటి సినిమాని కోరుకున్నారో అలాంటి సినిమాని ఇంత‌కాలానికి అందించ‌గ‌లిగారు. క‌డ‌ల్ సినిమాతో అనుకున్న మ్యాజిక్ చేయ‌లేక‌పోయినా మారోసారి మ‌ణి స‌ర్ త‌న‌దైన మ్యాజిక్‌ని చూపించారు ఈ చిత్రంతో. ఒకే బంగారం 100శాతం మ‌ణిర‌త్నం బ్రాండ్ సినిమా. స‌ఖి చిత్రానికి సీక్వెల్ అని చెప్పారు. చెప్పిన‌ట్టే తీసి చూపించారు.
క‌థ క‌మామీషు: ఆది – తార ఉద్యోగ రీత్యా బొంబాయ్ వ‌చ్చి అక్క‌డ అనుకోని రీతిలో ఓ పెళ్లిలో క‌లుసుకుంటారు. అక్క‌డ ప‌రిచ‌యం స్నేహంగా మారుతుంది. అస‌లే అల్ల‌రిచిల్ల‌రి వ‌య‌సు. ఏం చెప్పినా విన‌ని వ‌య‌సు. తొలిచూపు.. తొలి ప‌రిచ‌యంలోని తీయ‌ని మాధుర్యం ఎలా ఉంటుందో తెలుసుకునేలోపే ప్రేమ‌లో ఉన్నామ‌ని గ్ర‌హిస్తారు. క‌లిసి శికార్లు, లేట్‌నైట్ పార్టీలు, కాఫీ టీలు మామూలే. అయితే ప్రేమ వ‌ర‌కూ అయితే ఓకే గానీ, పెళ్లి అంటే తార‌కు నాట్ ఓకే. చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రులు విడాకులు తీసుకోవ‌డం చిన్నారి హృద‌యాన్ని ఎంత‌గానో గాయ‌ప‌రిచింది. అందుకే పెళ్లికంటే క‌లిసి ఉన్న కొద్దికాలం సంతోషంగా ఉండ‌డ‌మే ముఖ్యం అనుకుంటుంది. ఆ త‌ర్వాత ప్యారిస్ వెళ్లిపోవాల‌నుకుంటుంది. అయితే ఈలోగానే ఆది వీడియో గేమ్ డిజైన‌ర్‌గా అమెరికా వెళ్లే ఛాన్స్ కొట్టేస్తాడు. ఇంకా ప‌ది రోజులే గ‌డువు. ఈలోగా ఆకాశ‌మే హ‌ద్దుగా ఎంజాయ్ చేయాలి. దూరం అవుతున్నామ‌న్న బాధ‌ను ఎవ‌రూ చూపించ‌కూడ‌దు. సంతోషంగా విడిపోవాలి. కానీ సాధ్య‌మా!? స‌్వ‌చ్ఛ‌మైన ప్రేమ అది. ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేని స్థితి. అందుకే అమెరికా వెళ్లే ముందే, ఆ ప‌దిరోజుల్లోనే రియ‌లైజేష‌న్‌. పెళ్లితో ఒక‌ట‌వుతారు. ప్రియుడి మీద ధ‌న‌బ‌లం చూపించాల‌నుకున్న త‌ల్లి కూడా నిత్యా ఆనందాన్ని కోరుకుని అక్షింత‌లు వేస్తుంది. చివ‌రికి క‌థ సుఖాంతం అవుతుంది.

బ‌లం:
ఎంత ఎక్కువ ప్రేమ ఉంటే అంతగా అల‌క‌లు, గొడ‌వలు, అపార్థాలు ఉంటాయ‌ని చివ‌రి 10నిమిషాల్లో అద్బుతంగా చూపించారు. అలాగే పేయింగ్ గెస్టుగా తెలిసిన వారి ఇంట్లో ఉన్నా.. అన్నంపెట్టిన‌వారితో పిల్ల‌ల అనుబంధం ఎలా ఉంటుందో గ‌ణ‌ప‌తి (ప్ర‌కాష్‌రాజ్ ), భ‌వాని (లీలా) పాత్ర‌ల్లో ఆవిష్క‌రించిన తీరు అమోఘం. కొత్త‌జంట క‌ల‌త‌లు మాని ఎలా జీవించాలో ఆ ముస‌లాళ్ల అన్యోన్య జీవ‌నంలో చూపించారు. న‌వ‌త‌రం అమ్మాయిలు ఎలాంటి ఆనందాన్ని కోరుకుంటున్నారో నిత్యా పాత్ర‌తో చూపించారు.
న‌టీన‌టులు: మ‌మ్ముట్టి త‌న‌యుడు దుల్కార్‌స‌ల్మాన్ చ‌క్క‌ని న‌ట‌న‌, అభిన‌యం క‌న‌బ‌రిచాడు. తెలుగులో అత‌డికి స‌రైన ఎంట్రీ ఈ చిత్రంతో దొరికిన‌ట్టే. అలాగే నిత్యామీన‌న్ ఏ సినిమాలో న‌టించినా ఆ సినిమాకి త‌నే ప్ర‌ధాన బ‌లం. ఈ చిత్రంలో మ‌రో మైండ్ బ్లోవింగ్ పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకుంది. ప్ర‌కాష్‌రాజ్‌, లీలా త‌మ పాత్ర‌ల్ని ప‌రిధిమేర పండించారు.

సాంకేతికాంశాలు:
మ‌ణిర‌త్నం సినిమా అంటే మూడు విభాగాలు హైలైట్‌గా ఉంటాయి. పి.సి.శ్రీ‌రామ్ కెమెరా ఈ చిత్రానికి జీవం పోసింది. అలాగే ఏ.ఆర్‌.రెమాన్ సంగీతం ప్ర‌ధాన ఆయువు. క‌థ‌లోని ఫీల్‌ని డ్రాగ్ చేయ‌డంలో ఆర్‌.ఆర్ వ‌ర్క‌వుటైంది. అయితే పాట‌ల్లో సాహిత్యం కాస్త నిరాశ‌ప‌రిచింద‌నే చెప్పాలి. స‌ఖి, దిల్‌సే, బొంబాయి వంటి సినిమాల‌కు వేటూరి సాహిత్యం పెద్ద అస్సెట్‌. ఇప్పుడు ఆయ‌న లేరు కాబ‌ట్టి ఆ ప్ర‌భావం లిరిక్‌లో ఉప‌యోగించిన ప‌దాల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. దాని ప్ర‌భావం వ‌ల్ల‌నో ఏమో! పాట‌లు మ‌రీ అంత కిక్కివ్వ‌లేద‌నే అనిపించింది. పి.సి.కెమెరా ప‌నిత‌నం వ‌ల్ల స‌హ‌జంగా క‌నిపించాయంతే. అలాగే ఈ చిత్రానికి సోల్ ఏది ? అని చెప్పాలంటే సంభాష‌ణ‌లు అనే చెప్పాలి. ఘాడ‌మైన ప్రేమ‌, ఆప్యాయ‌త‌లు, ప్రేమికుల భాష‌ను చ‌క్క‌గా ఆవిష్క‌రించారు.
ముగింపు: ఒక అంద‌మైన ప్రేమ‌క‌థా చిత్రం. ఆహ్ల‌ద‌క‌ర‌మైన మ‌ధుర‌మైన ప్రేమ‌క‌విత లాంటి సినిమా.

రేటింగ్: 2.75

NO COMMENTS

Leave a Reply