కేటీఆర్ ప్ర‌సంగంతో క‌ళ్లు తేలేశారు

ktr

హైద‌రాబాద్ అభివృద్ది మీద శాస‌న‌స‌భ‌లో విప‌క్షాలు చేసిన విమ‌ర్శ‌ల‌ను ఆధారాల‌తో స‌హా మంత్రి కేటీఆర్ తిప్పికొట్ట‌డంతో నివ్వెర‌పోయాయి. ఏదో విమ‌ర్శ చేయాలి .. విమ‌ర్శ‌కు విమ‌ర్శ అన్న త‌ర‌హాను ప్ర‌తిప‌క్షాలు మార్చుకోవాల‌ని .. వాస్త‌వాల‌ను ముందుపెట్టాల‌ని .. హైద‌రాబాద్ ను తామేదో రాత్రికి రాత్రే మార్చామ‌ని చెప్ప‌డం లేద‌ని, అది సాధ్యంకూడా కాద‌ని .. ప్ర‌తి స‌మ‌స్య‌ను ఓ ప్ర‌ణాళిక ప్ర‌కారం ప‌రిష్క‌రిస్తూ ముందుకు వెళ్తున్నామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఈ సంధ‌ర్భంగా స‌భ‌లో కేటీఆర్ మాట్లాడుతూ ‘జీహెచ్‌ఎంసీలో చాలా సంస్కరణలు తెచ్చాం. హైదరాబాద్‌ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. రాత్రికి రాత్రే విశ్వనగరంగా అభివృద్ధి చేయలేం. హైదరాబాద్‌లో నీటి సమస్యను పరిష్కరించింది మేమే. నగరంలో పేకాట క్లబ్‌లు, గుడుంబాను నియంత్రించాం. కేవలం ఇవే కాకుండా ఇంకా చాలా పనులు చేపడుతున్నాం. కళ్ల ముందు జరిగిందే అభివృద్ధి తప్ప మిగతాది కాదన్నట్లు చెబుతున్నారు అని అన్నారు.

సంస్కరణల్లో భాగంగా డీపీఎంఎస్‌ వ్యవస్థ తీసుకువచ్చాం. ప్లాస్టిక్‌ రోడ్లతో ప్రయోగాలు చేస్తున్నాం. వైట్‌ టాపింగ్‌ చేస్తున్నాం. వర్షాకాలంలోపే సమస్యలు గుర్తించి పరిష్కరిస్తాం. నాలాల ఆక్రమణలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. జీహెచ్‌ఎంసీలో తవ్వకాలపై ఇకపై కఠిన చర్యలు తీసుకుంటాం. రహదారి టెండర్‌ పూర్తయితేనే తవ్వకానికి అనుమతి ఇస్తాం. అవసరమైతే ఇందుకు చట్టంలో మార్పు చేసేందుకు వెనుకాడం. ముందుగా ఒప్పందం జరిగితేనే తవ్వకాలకు అనుమతి ఇస్తాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

నగరంలో 9.60లక్షలు నీటి కనెక్షన్లు ఉంటే 1.60లక్షలకు మాత్రమే మీటర్లు ఉన్నాయి. 20వేలు మాత్రమే కమర్షియల్‌ కనెక్షన్లు ఉన్నట్లు తెలిసింది. కోటిమంది జనాభా ఉన్న నగరంలో 20వేల కమర్షియల్‌ కనెక్షన్లు ఉన్నాయంటే ఆశ్చర్యమేసింది. ఇందుకు డ్రైవ్‌ నిర్వహిస్తే ఆ సంఖ్య 38వేలకు చేరింది. దీని వల్ల ప్రభుత్వ ఆదాయం రూ.5కోట్లు పెరిగింది. హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా ఉండేందుకు కృషి చేస్తామని, 2017లో నగరంలో ప్రతిరోజు నీటి సరఫరా చేసేలా ప్రణాళికలు రూపొందించామని… 2018 నాటికి శివారు ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేస్తామని తెలిపారు. నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. హుస్సేన్‌సాగర్‌లోకి వచ్చే మురుగునీటిని మళ్లించే కార్యక్రమం జరుగుతోందని.. మూసీనది పొడవునా నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. నాలాలపై ఉన్న 938 అక్రమ నిర్మాణాలతో పాటు శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నట్లు కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోని సీసీ కేమేరాలతో పర్యవేక్షణ చేపడతాం. సీసీ కెమేరాల ద్వారా చెత్త రోడ్లపై వేసే ప్రాంతాలను గుర్తిస్తాం అని .. తెలంగాణ వ‌స్తే శాంతిభ‌ధ్ర‌త‌ల గురించి గ‌తంలో పెద్ద పెద్దోళ్లు చాలా మాట్లాడార‌ని .. ఇప్పుడు హైద‌రాబాద్ లో శాంతిభ‌ద్ర‌త‌ల‌ను చూసి వారేం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. మొత్తానికి తెలంగాణ ప్ర‌భుత్వం విశ్వ‌న‌గ‌రం కోసం ఏఏ ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ది .. వివిధ సంస్క‌ర‌ణ‌లు .. వాటి మూలంగా వ‌స్తున్న ఇబ్బందులు .. ప‌లుమార్లు విప‌క్ష నేత‌లే ప‌నుల‌కు అడ్డంప‌డుతున్న తీరును వివ‌రించ‌డంతో స‌భ‌లో ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించిన నేత‌లు నోరెత్త‌లేక‌పోయారు.

NO COMMENTS

Leave a Reply