కేటీఆర్ మళ్లీ చేత‌ల్లో చూపించారే

ktr-assembly-clothes-2

ఇబ్బందుల‌కు గుర‌వుతున్న రంగాన్ని ఆదుకోవాల‌ని నామ్ కే వాస్తీగా పిలుపునివ్వ‌డం వేరు. దాన్ని ఆచ‌ర‌ణ‌లో చూపించి ఆద‌ర్శంగా నిల‌వ‌డం వేరు. రాష్ట్ర ఐటీ, చేనేత‌, ప‌రిశ్ర‌మ‌ల శాఖామంత్రి కేటీఆర్ ఇపుడు రెండోది చేశారు. వారంలో ఒకరోజు చేనేత వస్త్రాలనే ధరించాలని ఇటీవల కేటీఆర్‌ పిలుపునిచ్చిన సంగ‌తి గుర్తుండే ఉంటుంది. ఆ పిలుపులో భాగంగా చేనేత రంగానికి చేయూతనిచ్చేందుకు వీలుగా కేటీఆర్‌ చేనేత వస్త్రాలను ధరించారు. అంతేకాదు త‌న పరిధిలోని చేనేత, పరిశ్రమలు, గనులు, పురపాలకశాఖల సిబ్బంది, అధికారులూ ఇలాంటి వస్త్రాలనే ధరించి, విధులకు హాజరయ్యేలా చూశారు

ఈ క్రమంలో నేత కార్మికులు రూపొందించిన వస్త్రాలను అధికారులు మంత్రికి అందజేయగా, వాటిని ధరించి ఆయన సచివాలయానికి వచ్చారు. బదిలీ అయిన పరిశ్రమలశాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌, ఐటీశాఖ కార్యదర్శి జయేష్‌ రంజన్‌, చేనేత సంచాలకురాలు శైలజా రామయ్యర్‌లు నేత వస్త్రాలను ధరించి మంత్రిని సచివాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… ఈ వస్త్రాల ప్రాధాన్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నామనీ, తెలంగాణ చేనేత సహకార సంస్థ (టెస్కో) ద్వారా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడతామని మంత్రి అన్నారు. సంస్థ ఆన్‌లైన్‌ విక్రయాల వెబ్‌సైట్‌ను నవీకరిస్తామన్నారు. మరిన్ని విక్రయ కేంద్రాలను ప్రారంభించాలని శాఖ సంచాలకురాలు శైలజా రామయ్యర్‌ను ఆదేశించామన్నారు. చేనేత వస్త్రాలను ధరించాలని తనను కలిసేందుకు వచ్చిన అధికారులు, సందర్శకులను ఆయన కోరారు. సచివాలయంలో పంచాయతీరాజ్‌ ఇంజినీర్ల సంఘం దైనందిని, గోడపత్రికల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి ఇంజినీర్లంతా చేనేత వస్త్రాలను ధరించి రావడంపట్ల ఆ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సంతోషం వ్యక్తంచేశారు. తాను మొదట్నుంచీ నేత వస్త్రాలనే ధరిస్తున్నాననీ, ప్రతి సోమవారం అందరూ చేనేత వస్త్రాలనే ధరించాలని కోరారు.

NO COMMENTS

Leave a Reply