స‌భ‌లో క్ష‌మాప‌ణ చెప్పిన కోమ‌టిరెడ్డి

komatireddy venkat reddy

సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అసెంబ్లీలో క్ష‌మాప‌ణ చెప్పారు. శాసనసభ స‌మావేశాల సంద‌ర్భంగా స్పీకర్ స్థానంలో కూర్చున్న డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు మధ్య జ‌రిగిన సంవాదంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం, విద్యార్థులకు స్కాలర్‌షిప్ అంశంపై కొనసాగుతున్న స్వల్పకాలిక చర్చ సందర్భంగా కోమటిరెడ్డి బెల్లు కొడితే.. కూర్చోవాలా? అని తన వైపు వేలు చూపి మాట్లాడిన తీరుపై డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.చర్చ సందర్భంగా బెల్లుకొట్టే అధికారం చైర్‌కు ఉంటుందని, దానిని ప్రశ్నించడం సబబు కాదన్నారు.

అంతలోనే సభ్యుడు కోమటిరెడ్డి ఆవేశంతో తన చేతిలో పేపర్‌ను చింపి స్పీకర్‌వైపు విసిరారు. దీంతో మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుని డిప్యూటీ స్పీకర్ ఒక మహిళ కావడంతో వారి పట్ల దురుసుగా ప్రవర్తించారని, అందుకు సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి క్షమాపణ చెప్పాలన్నారు. సీఎల్పీ నేత జానారెడ్డి జోక్యం చేసుకుని స్వల్పకాలిక చర్చలో పాల్గొనడానికి సభ్యుడికి కొంత సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ స్పీకర్ బెల్లు కొట్టడం అంటే కూర్చోమనడం కాదని, ముందస్తు హెచ్చరికలు చేయడం అని వివరించారు. దీంతో కోమటిరెడ్డి చర్చలో పాల్గొనడానికి అవకాశం ఇస్తూ.. డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. జరిగిన ఘటనపై కోమటిరెడ్డి క్షమాపణ చెప్పడంతో గందరగోళానికి తెరపడింది.

NO COMMENTS

Leave a Reply