వాళ్లకు ఆఖ‌రి మాట చెప్పిన కేసీఆర్‌

kcr
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రోమారు త‌న ఉగ్ర‌రూపం చూపించారు. అక్ర‌మాల విష‌యంలో తానెంత ప‌క‌డ్బందీగా వ్య‌వ‌హ‌రిస్తానో తేల్చిచెప్పారు. ఢిల్లీ నుంచి వ‌చ్చిన వెంట‌నే రాష్ట్రంలో వరద పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. అనంతరం సీఎం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. నగరంలో వెలిసిన అక్రమ కట్టడాలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు. 1908 తర్వాత హైదరాబాద్‌ మహానగరంలో ఇంత పెద్ద వర్షం ఎప్పుడూ పడలేదన్నారు. నగరంలో సాధారణ వర్షపాతం కంటే 448 శాతం అధికంగా నమోదైనట్లు చెప్పారు. హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాలను ఖాళీ చేయించినందునే నష్టం తక్కువ జరిగిందన్నారు. హైదరాబాద్‌లో పరిస్థితి మెరుగు కోసం శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడతామని కేసీఆర్‌ వెల్లడించారు.
హైదరాబాద్‌లో 28 వేల అక్రమ కట్టడాలు ఉన్నాయని మూసీపై నిర్మించిన అక్రమ కట్టడాలన్నీ తొలగిస్తామని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. అక్రమ కట్టడాల కూల్చివేతకు 25 ఫ్లయింగ్‌ బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమ కట్టడాల కూల్చివేత సమయంలో ఎవరూ ధర్నాలు చేయొద్దని సూచించారు. అక్రమ కట్టడాల కూల్చివేతలో పేదలు ఉంటే వారికి రెండు పడక గదుల ఇళ్లు కేటాయిస్తామన్నారు. హైదరాబాద్‌ బాగు కోసం ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని కోరారు. అక్రమ కట్టడాలపై సమాచారం ఇచ్చిన వ్యక్తులకు రూ.10 వేల బహుమతి ఇస్తామని కేసీఆర్‌ ప్రకటించారు.
వర్షప్రభావిత ప్రాంతాల్లో అధికారులెవరూ సెలవులు పెట్టవద్దని కేసీఆర్‌ ఆదేశాలు జారీచేశారు. వర్షాల వల్ల ఇప్పటివరకు ఐదారుగురు మృతిచెందినట్లు సమాచారం వచ్చిందన్నారు. వర్షాల వల్ల విద్యుత్‌కు పెద్దగా అంతరాయం కలగలేదన్నారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోగల్గే పరిస్థితుల్లో ఉన్నామని స్ప‌ష్టం చేశారు.విశ్వనగరంగా మార్చేందుకు జీహెచ్‌ఎంసీకి రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల రుణం ఇప్పిస్తామని పేర్కొన్నారు. 30 ఏళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీ వ్యవస్థ రూపొందిస్తామని వెల్లడించారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టిన తర్వాత యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడతామని చెప్పారు.  ఈ వర్షాలకు నాగార్జున సాగర్‌ మినహా దాదాపు అన్ని మధ్యతరహా ప్రాజెక్టులన్నీ నిండిపోయాయన్నారు. రేపటిలోగా నిజాంసాగర్‌ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండుతుందన్నారు. మరో నాలుగైదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో శ్రీశైలం నిండుతుందని, తద్వారా గేట్లు ఎత్తితే సాగర్‌లోకి నీరు రానుందని వివరించారు. రాష్ట్రానికి ఈ వర్షాలు శుభసూచికమని, రెండేళ్ల వరకు నీటి కష్టాలు ఉండబోవన్నారు. మిషన్‌ కాకతీయ పథకం ఫలితాలు కనబడుతున్నాయన్నారు. దీంతో రైతాంగమంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఈ వర్షాలతో రాష్ట్రంలో స్వల్ప నష్టం వాటిల్లిన మాటవాస్తవేనన్నారు. 46 వేల చెరువులకు గాను 25వేల చెరువులు అలుగు పోస్తున్నాయని చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 71 చెరువు కట్టలు మాత్రమే తెగాయన్నారు.

NO COMMENTS

Leave a Reply