కేసీఆర్ స్కెచ్ వేస్తే ..!

tt

తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చి కొత్త రాష్ట్రం అయిన తెలంగాణ‌కు గ‌ట్టి పునాదులు వేశారు. ఇది ఎవ‌రు ఒప్పుకున్నా .. ఒప్పుకోక‌పోయినా నికార్స‌యిన నిజం. కేసీఆర్ ప్ర‌ణాళికాను చూసి ప‌రేషాన్ అయిన విప‌క్షాలు కాంగ్రెస్, టీడీపీలు ఏక‌మై కోదండ‌రాంను ముందు పెట్టి కేసీఆర్ మీద, కేసీఆర్ పాల‌న మీద బుర‌ద‌జ‌ల్లే కార్య‌క్ర‌మాలు పెట్టార‌న్న‌ది కూడా అంతే నిజం.

దేశంలోనే వినూత్నంగా భారీ సంక్షేమ ప‌థ‌కాలు చేప‌ట్టిన కేసీఆర్ అదే స‌మ‌యంలో విద్య‌కు, ఆరోగ్యానికి పునాదులు వేస్తున్నారు. ఇక మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ‌, టీ ఐపాస్, నూత‌న పారిశ్రామిక విధానంతో అభివృద్దిని కొత్త‌పుంత‌లు తొక్కిస్తున్నారు. తెలంగాణ వారికి పాల‌న రాదు .. తెలంగాణ రాష్ట్రం వ‌స్తే అంధ‌కారం అవుతుంద‌న్న ఆంధ్ర పాల‌కులు వేసిన అంచనాల‌ను 24 గంట‌లు క‌రంటు ఇచ్చి తిప్పికొట్టారు. రాజ‌కీయ అవినీతిని నివారించి పార‌ద‌ర్శ‌కంగా ముందుకు వెళ్తున్నారు. గ‌త అర‌వై ఏండ్ల పాల‌న‌కు .. ఈ రెండున్న‌రేళ్ల పాల‌న‌కు స్ప‌ష్ట‌మ‌యిన వ్య‌త్యాసం ఉంద‌న్న‌ది అంద‌రూ ఒప్పుకుంటున్న నిజం.

అయితె తెలంగాణ ఉద్య‌మంలో కేసీఆర్ ప‌డిన క‌ష్టానికి స‌ర‌యిన గుర్తింపు రాకుండా ఆంధ్రా మీడియా విజ‌య‌వంతం అయింద‌న్న‌ది ఒప్పుకోవాల్సిన నిజం. త‌న ప్రాణాల‌నే కాకుండా రాజ‌కీయ భ‌విష్య‌త్ ను .. త‌న‌ను న‌మ్ముకున్న వారి రాజ‌కీయ భ‌విష్య‌త్ ను కూడా ప‌ణంగా పెట్టి తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ సాధించారు. కానీ ఆంధ్రా మీడియా మాత్రం కేసీఆర్ ప్ర‌తి ప‌ని మీద అనుమానాలు పెంచుతూ పోయింది. అందుకే అర‌వైఏండ్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ను .. క‌ల‌ను సాకారం చేసిన వ్య‌క్తిగా నీరాజ‌నాలు అందుకోవాల్సిన కేసీఆర్ బంగారు తెలంగాణ సాధ‌న‌లో తీవ్రంగా క‌ష్ట‌ప‌డుతున్నా రావాల్సిన గుర్తింపును ఆంధ్రా మీడియా రాకుండా అడ్డుప‌డుతోంది. ఇక తెలంగాణ‌లోని టీఆర్ఎస్ వ్య‌తిరేక రాజ‌కీయ పార్టీలు, మేధావి వ‌ర్గం ఆంధ్రా మీడియాకు కావాల్సినంత స‌హ‌కారాన్ని అందిస్తూ పోతున్నారు.

అయితే 14 ఏండ్ల ఉద్య‌మంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న కేసీఆర్ తెలంగాణ ప్ర‌భుత్వం మీద జ‌రుగుతున్న దాడిని తేలిక‌గా తీసుకుని ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ ఉద్య‌మంలో మాదిరిగానే తెలంగాణ పార్టీల‌ను, నేత‌ల‌ను న‌మ్మ‌డం మానేసి ప్ర‌జ‌ల మీద న‌మ్మ‌కంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌జ‌ల దృష్టికి వాస్త‌వాల‌ను తీసుకువెళ్లేందుకు న‌మ‌స్తే తెలంగాణ ప‌త్రిక, టీ న్యూస్ ఛాన‌ల్ లు ఉండ‌గా .. త‌న పాల‌న, త‌న ప్ర‌భుత్వ ప‌థ‌కాల గొప్ప‌ద‌నం ప్ర‌పంచానికి చాటేందుకు తెలంగాణ టుడే ఆంగ్ల ప‌త్రిక‌ను కూడా ప్రారంభించారు. తెలంగాణ ప్ర‌భుత్వ పాల‌న జాతీయ స్థాయిలో తెలియాలంటే ఆంగ్ల మీడియా ఒక్క‌టే మార్గం.

అస‌లు ఈ ప‌త్రిక ఇంత తొంద‌ర‌గా వ‌స్తుంద‌ని .. 2016లో రావ‌డం అసాధ్య‌మ‌ని అంతా భావించినా దానిని మార్కెట్లోకి తీసుకొచ్చారు. న‌మ‌స్తె తెలంగాణ వ‌స్తున్న అన్ని కేంద్రాల నుండి తెలంగాణ టుడే కూడా వ‌స్తోంది. ఇక ఇప్పుడు ముస్లిం వ‌ర్గాల‌కు చేరువ అయ్యేందుకు ఆదాబ్ తెలంగాణ పేరుతో ఇంకో ఉర్దూ ప‌త్రిక తీసుకురాబోతున్నార‌ని తెలుస్తుంది. ఉప ముఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ అలీ కుమారుడు అజం అలీ ఆధ్వ‌ర్యంలో ఈ ప‌త్రిక రాబోతుంద‌ని స‌మాచారం. హైద‌రాబాద్ తో పాటు తెలంగాణ‌లోని మెజార్టీ ముస్లింల‌కు ప్ర‌భుత్వ పాల‌న గొప్ప‌ద‌నం తెలియ‌డ‌మే దీని ల‌క్ష్యం అని స‌మాచారం. ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఆంగ్లం, ఉర్దూ భాష‌ల‌ను అనర్గ‌ళంగా మాట్లాడ‌గ‌ల‌రు. ఆంధ్రా మీడియా ఎంత దుమ్మెత్తి పోసినా .. ప్ర‌తిప‌క్షాలు ఎన్ని అడ్డ‌గోలు ఆరోప‌ణ‌లు చేసినా ప్ర‌జ‌ల్లోకి అస‌లు విష‌యం వెళితే వారు తీసుకోవాల్సిన నిర్ణ‌యం వారు తీసుకుంటార‌న్న‌ది కేసీఆర్ న‌మ్మ‌కం. అందుకే అన్ని భాష‌ల మీడియాతో ప్ర‌జ‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లేందుకు ఈ ప్ర‌య‌త్నం అని చెబుతున్నారు. మొత్తానికి కేసీఆర్ స్కెచ్ తో విప‌క్షాలు విల‌విల‌లాడ‌డం ఖాయం.

NO COMMENTS

Leave a Reply