ఒకే ఒక్క‌డు ..బ‌హుముఖుడు

kcr11
పటిష్టమైన వ్యూహాలను రచించడమే కేసీఆర్‌ విజయాలకు సోపానం… విధానాల రూపకల్పనలో ఆయనకు ఆయనే సరిసాటి… పదునైన ఆలోచనలే అభివృద్ధికి మార్గాలు… ముందుచూపు ప్రణాళికలే అణగారిన వర్గాలకు భరోసా… గతంలో కొన్ని దశాబద్ధాల పాటు అణచివేతకు గురైన తెలంగాణ ప్రాంతంలో సర్వతోముఖాభివృద్ధి సాధించేందుకు కేసీఆర్‌ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. పేద ప్రజలను, అణగారిన వర్గాలను ఆర్థికంగా, సామాజికంగా ముందుకు నడిపించేందుకు ఎంచుకున్న లక్ష్యాల్లో ఒక్కొక్కటీ అధిగమిస్తున్నారు. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా భవిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకుని భారీ అంచనాలతో కార్యాచరణను రచిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత అనేక విజయాలు సాధిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2016 సంవత్సరంలో తానంటే ఏమిటో నిరూపించుకున్నాడు. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కేసీఆర్‌ ఆలోచనా విధానాలు, కీలక నిర్ణయాలపై ‘ఆంధ్రప్రభ’ ప్రత్యేక కథనం…

రెండు దశాబ్ధాల పాటు ఉద్యమ నేతగా క్షేత్రస్థాయి జన జీవన శైలిపై విశేష అనుభవం గడించిన కేసీఆర్‌ ప్రభుత్వాధినేతగా తనదైన శైలిలో పరిపాలన సాగిస్తున్నారు. ఇదివరకు ఉన్న పరిపాలనా విధానాలలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తూనే రాష్ట్రాభివృద్ధి కోసం కొత్త నిర్ణయాలు, సరికొత్త వ్యూహాలు రచిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఉద్యమంలో కీలక భాగస్వామ్యం పంచుకున్న ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చి పరిపక్వత చెందిన పాలనాధినేతగా పేరు తెచ్చుకున్నారు. గోల్కొండ కోటలో ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించి తెలంగాణ పూర్వవైభవానికి పునాది వేశారు. అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూనే అన్ని రంగాల్లో ప్రక్షాళన చేపట్టి పురోగతికి చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ప్రత్యేకతను, ప్రతిష్టను ప్రపంచం నలుమూలలా చాటి చెప్పేందుకు సరికొత్త తరహాలో పరిపాలనను కొనసాగిస్తున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్‌ వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని చేపట్టి 31 జిల్లాలను వివాదరహితంగా ఏర్పాటు చేసి ఘనత దక్కించుకున్నారు.
రాష్ట్రంలో ఉన్న కోటి మూడు లక్షల కుటుంబాల్లో నూతన వెలుగులు నింపాలన్న సంకల్పంతో ఇదివరకు ఎన్నడూ లేనివిధంగా ఒకేరోజు సామాజిక సర్వేను చేపట్టి రికార్డు సృష్టించారు. 90 లక్షల కుటుంబాలలో ఉన్న పేదరికాన్ని గుర్తించి వారి ఆర్థికాభ్యున్నతికి సరికొత్త పథకాలను ప్రారంభించారు. అన్ని సంక్షేమ పథకాల్లో నిబంధనలను సడలించి సాధ్యమైనంత మేర ఎక్కువమంది లబ్ధిదారులకు న్యాయం జరిగేవిధంగా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలతోపాటు సామాజికంగా గుర్తింపు లేని అనేక కులాలను, వర్గాలను చేరదీసే ప్రయత్నం మొదలుపెట్టారు. అన్ని కులాలు, మతాల ఆత్మగౌరవాన్ని పరిరక్షిస్తూ వారికి వేర్వేరు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు. ముందుగా దళితులు, గిరిజన వర్గాల కోసమే ప్రారంభించిన కళ్యాణలక్ష్మి పథకాన్ని తర్వాత వెనుకబడిన వర్గాలకు కూడా వర్తింపజేశారు.
అణగారిన వర్గాల ఆర్థిక అవసరాల కోసం…kcr3
క్షేత్రస్థాయిలో ఈ పథకానికి పెరుగుతున్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు కళ్యాణలక్ష్మి పథకాన్ని అమలు చేశారు. ముస్లింలకు ప్రత్యేకంగా షాదీ ముబారఖ్‌ పేరుతో పథకాన్ని ప్రారంభించారు. అవినీతి అక్రమాలకు దూరంగా సంక్షేమ కార్యక్రమాలను లబ్ధిదారులకు చేరవేర్చాలన్న సంకల్పంతో అనర్హులను తొలగించే ప్రక్రియను మొదలుపెట్టారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఇదివరకు ఉన్న పెన్షన్లను రూ.1000 నుంచి రూ.1500లకు పెంచడంతోపాటు కొత్తగా కల్లు గీత కార్మికులకు, చేనేత కార్మికులకు, ఎయిడ్స్‌ పేషంట్లకు, బీడీ కార్మికులకు, పేద వృద్ధ కళాకారులకు కూడా పెన్షన్లు అందజేస్తున్నారు. అందరినీ కలుపుకుని మొత్తం 35.87 లక్షల మందికి దేశంలో ఎక్కడా లేనివిధంగా పెన్షన్లను పంపిణీ చేస్తూ ఘనత సాధించారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీల్లోనూ రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు.
ఆహార భద్రత దిశగా…
పరిమితి లేకుండా పేద కుటుంబాల్లోని ప్రతి వ్యక్తికి ఆరు కిలోల చొప్పున రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. దారిద్య్ర రేఖకు దిగువనున్న కుటుంబాలను గుర్తించి వారికి ఆహార భద్రత కల్పించేందుకు ఆధార్‌కార్డు లింకేజితో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రతి కుటుంబానికి డిజిటల్‌ రేషన్‌కార్డులను మంజూరు చేస్తూ బయోమెట్రిక్‌ విధానం ద్వారా సరుకులను సరఫరా చేస్తున్నారు. ఈ విధానంతో బ్లాక్‌మార్కెట్‌ను దాదాపు 90 శాతం అరికట్టగలిగారు. నిరుద్యోగ యువతకు జీవోనోపాధి కల్పించాలన్న సదుద్దేశంతో ఎకనామిక్‌ సపోర్ట్‌ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం ద్వారా రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు రుణ సదుపాయాన్ని కల్పించి స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్నారు.
దళిత వర్గాల అభ్యున్నతి కోసం…

KCR pension
అన్నింటికీ మించి పేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల భూమిని పంపిణీ చేయాలన్న సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటివరకు 2860 కుటుంబాలను గుర్తించి 7485 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేకంగా 180 రెసిడెన్షియల్‌ పాఠశాలలను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంబేద్కర్‌ ఓవర్సిస్‌ పథకం ద్వారా విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు సైతం స్కాలర్‌షిప్‌లను అందజేస్తున్నారు. ఉప ప్రణాళిక నిధులను ఇతర పథకాలకు మళ్లించకుండా నిర్దేశించిన వర్గాలకే ఖర్చు చేయాలని నిర్దిష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అణగారిన వర్గాలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు పరిశ్రమల శాఖ ద్వారా ప్రత్యేకంగా 50 శాతం వరకు పెట్టుబడి రాయితీలను అందిస్తున్నారు.
గిరిజన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా…
గిరిజన వర్గాల ఆర్థిక ఎదుగుదల కోసం, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఎస్టీ కమిషన్‌ను ఏర్పాటు చేశారు. గిరిజన తండాలను గ్రామపంచాయితీలుగా మారుస్తూ మరో విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఆ వర్గాల కోసం 120 రెసిడెన్షియల్‌ పాఠశాలలు మంజూరు చేశారు. విద్యావ్యవస్థలో మొదటి ఆప్షన్‌గా ఉర్దూ భాషకు ప్రాధాన్యత కల్పించారు. తెలంగాణ రాష్ట్రానికి వక్ఫ్‌ బోర్డును ఏర్పాడు చేయడంతోపాటు మైనారిటీ కమిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో రంజాన్‌, క్రిస్మస్‌ పండుగలను అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించారు. అంగన్‌వాడీ వర్కర్ల జీతాలను దాదాపు రెట్టింపు చేశారు. డ్వాక్రా రుణాల రుణ పరిమితిని ఐదు నుంచి పది లక్షల రూపాయలకు పెంచారు. గర్భిణీ స్త్రీలు, శిశువులు, బాలింతల సంక్షేమం కోసం ఆరోగ్యలక్ష్మి అనే సరికొత్త పథకాన్ని అమలు చేస్తున్న సీఎం కేసీఆర్‌కే దక్కింది.
మహిళా సాధికారత దిశగా…
వంట కోసం కిరోసిన్‌ను వాడని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలని భావించిన ప్రభుత్వం అర్హులందరికీ దీపం కనెక్షన్లు మంజూరు చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి 19.84 లక్షల దీపం కనెక్షన్లు ఉండగా, కొత్తగా మరో 9.37 లక్షల మందికి మంజూరు చేశారు. మహిళల రక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ అత్యాచారాలు, అఘాయిత్యాలు నివారించేందుకు మహిళా పోలీసులతో షీ టీమ్‌లను ఏర్పాటు చేశారు. సంక్షేమ హాస్టళ్లన్నింటికీ సన్నబియ్యాన్ని సరఫరా చేసి పేద విద్యార్థుల మన్ననలు పొందారు. నాయీ బ్రాహ్మణుల సంక్షేమంలో భాగంగా క్షౌరశాలలకు ఉచిత విద్యుత్‌ను అందజేయాలని నిర్ణయించారు. పుట్‌పాత్‌ వ్యాపారులకు కూడా భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు.
రైతు సంక్షేమ ప్రభుత్వంగా…
రైతు సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా లక్ష రూపాయల్లోపు పంట రుణాలను మాఫీ చేయడంతోపాటు దురదృష్టవశాత్తూ ఆత్మహత్యలు చేసుకునే రైతు కుటుంబాలకు చెల్లించే నష్ట పరిహారాన్ని లక్షన్నర నుంచి ఆరు లక్షలకు పెంచారు. వ్యవసాయోత్పత్తుల నిల్వ కోసం కొత్తగా రాష్ట్రంలో 330 గోదాములను నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రైతుబంధు పథకం ద్వారా వడ్డీలేని రుణాలను ఇచ్చి వ్యవసాయరంగ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. రాజధాని నగరంలో అమలు చేస్తున్న ఐదు రూపాయల భోజన పథకాన్ని వ్యవసాయ మార్కెట్లలో ప్రవేశపెట్టి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కేసీఆర్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకానికి సద్దిమూట అనే పేరు కూడా పెట్టారు.kcr14

సామాజిక బాధ్యతతో పనిచేస్తున్న వారికీ ధీమా…
అన్ని రంగాలతోపాటు న్యాయవాదుల సంక్షేమానికి కూడా ప్రాధాన్యత ఇస్తూ వారికోసం వంద కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. వివిధ రంగాల్లో పని చేస్తున్న డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు రూ.5లక్షల ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికులకు ఉన్న ప్రమాద బీమా పథకాన్ని రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచారు. జర్నలిస్టుల సంక్షేమానికి పాటుపడుతూ ఏటా బడ్జెట్లో వంద కోట్లు సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. క్రీడాకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఒలంపిక్స్‌లో స్వర్ణపతకం సాధిస్తే రూ.2 కోట్లు, రజతానికి రూ.కోటి, కాంస్యానికి రూ.50 లక్షలు, ప్రాతినిధ్యం వహించినందుకు రూ.5 లక్షల చొప్పున చెల్లిస్తున్నారు. ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించే విజేతలకు రూ.25 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందించే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.

ఆంధ్ర‌ప్ర‌భ నెట్ ఎడిష‌న్ సౌజ‌న్యంతో

NO COMMENTS

Leave a Reply