అలాగైతే బిర్యానీ నిషేధించాలంటున్న క‌మ‌ల్‌

kamal

ప్రముఖ నటుడు కమల్‌హసన్ త‌న‌దైన శైలిలో మ‌రోమారు కామెంట్లు చేశారు. తమిళనాడులో నిషేధించిన సంప్రదాయ జల్లికట్టు క్రీడకు బాసటగా నిలవ‌డంలో భాగంగా బిర్యానీపై ఆయ‌న స్పందించారు. జల్లికట్టుపై ప్రస్తుతం కొనసాగుతున్న నిషేధంపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ.. ఒకవేళ జల్లికట్టు క్రీడపై నిషేధం విధించాలనుకుంటే దాంతోపాటు బిర్యానీపై కూడా నిషేధం విధించాలి అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరుగుతున్న ఇండియా టుడే సౌత్ కాంక్లేవ్‌లో మాట్లాడుతూ క‌మ‌ల్ ఈ విధంగా రియాక్ట‌య్యారు.

స్పెయిన్‌లో జరిగే బుల్‌ఫైట్ క్రీడలా ఈ ప్రాచీన క్రీడను అపార్థం చేసుకోవద్దని, దాంతో ఈ క్రీడను ముడిపెట్టవద్దని క‌మ‌ల్ హాస‌న్ సూచించారు. స్పెయిన్‌లో నిర్వహించే క్రీడలో పశువులను గాయపరచడం వల్ల కొన్ని సందర్భాల్లో అవి చనిపోతాయని అన్నారు. అయితే తమిళనాడులో ఎద్దులను భగవంతుడిలా పూజిస్తారని, కుటుంబంలో ఒకరిగా ప్రేమిస్తారని తెలిపారు. ఈ క్రీడ ముఖ్య ఉద్దేశం ఎడ్లను లొంగదీసుకోవడమే త‌ప్ప వాటి కొమ్ములను విరవడం, ఇతర అవయవాలను గాయపరచడం కాదని క‌మ‌ల్ హాస‌న్‌ స్పష్టం చేశారు. సంప్రదాయ జల్లికట్టు క్రీడ అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆ క్రీడకు బిగ్ ఫ్యాన్ అని పేర్కొన్నారు. దక్షిణాది నటుల్లో జల్లికట్టు ఆడిన అతికొద్ది మంది తాను ఒకడినని, ఇది మా సంస్కృతి అని చెప్పుకోవడానికి తమిళుడిగా గర్వపడుతానని క‌మ‌ల్‌ అన్నారు.

కాగా క‌మ‌ల్ హాస‌న్‌ గతంలో కూడా పలుమార్లు జల్లికట్టు క్రీడను సమర్థించారు. తమిళనాడులో జల్లికట్టును నిషేధిస్తూ 2014లో సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించింది. అయితే గతేడాది ఈ నిషేధాన్ని ఎత్తివేయాలంటూ చేసిన అభ్యర్థనలను దేశ అత్యున్నత కోర్టు తోసిపుచ్చింది.

NO COMMENTS

Leave a Reply