ప్ర‌తిపక్షాల‌కు షాకిచ్చిన హైకోర్టు

Palamuru lift irrigation project

న్యాయ‌స్థానాల ఆధారంగా తెలంగాణ ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేయాల‌ని చూస్తున్న‌ ప్ర‌తిప‌క్షాల‌కు మ‌రో షాక్ త‌గిలింది. దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు యథావిధిగా కొనసాగించడానికి హైకోర్టు అనుమతించింది. అటవీ సంరక్షణ, పర్యావరణ విభాగాల అనుమతులు లేని కారణంగా ప్రాజెక్టు పనులను ఈ నెల 17 వరకు నిలిపివేయాలంటూ చెన్నైలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సదరన్ రీజియన్ బెంచ్ జారీచేసిన ఏకపక్ష (ఎక్స్‌పార్టీ) మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసింది. అయితే ఈ నెల 17 వ తేదీన చెన్నై ఎన్జీటీ బెంచ్ ఎదుట జరుగబోయే విచారణకు హాజరై ప్రాజెక్టుకు అనుమతుల విషయంలో వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షరతు విధించింది.

ప్రాజెక్టు పనులను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయాలంటూ హర్షవర్ధన్ అనే వ్యక్తి దాఖలు చేసిన అప్లికేషన్‌పై ప్రతివాది అయిన తెలంగాణ రాష్ట్రానికి నోటీసులు జారీచేయకుండా, రాష్ట్ర వాదనలు వినకుండానే ప్రాజెక్టుకు సంబంధించిన ఎటువంటి పనులను కొనసాగించడానికి వీల్లేదంటూ గత ఏడాది డిసెంబర్ 13 వ తేదీన ఎన్జీటీ ఏకపక్షంగా నిషేధపు ఉత్తర్వులు (యాడ్ ఇంటెరిమ్ ఇన్‌జెంక్షన్) జారీచేయడం తగదని హైకోర్టు అభిప్రాయపడింది.
సహజ న్యాయసూత్రాల ఆధారంగా అవతలిపక్షం వాదనలు వినాల్సిందేనని తెలంగాణ రాష్ట్రం చేసిన వాదనలతో ఏకీభవిస్తున్నట్టు హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే తాము ఎన్జీటీ జారీచేసిన ఏకపక్ష ఉత్తర్వులను మాత్రమే రద్దు చేస్తున్నామని ధర్మాసనం పేర్కొన్నది. ప్రాజెక్ట్ నిర్మాణం కోసం పర్యావరణ శాఖ అనుమతులు, అటవీ సంరక్షణ , వన్యప్రాణి సంరక్షణ నిబంధనల ప్రకారం తీసుకోవాల్సిన అనుమతులపై న్యాయసమీక్ష చేపట్టే అధికారం ఉన్న ఎన్జీటీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివరణ సమర్పించాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ జనవరి 17 వ తేదీన ఎన్జీటీ ఎదుట తెలంగాణ ప్రభుత్వం వివరణను సమర్పిస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయకుంటే, తదుపరి చర్యలను చేపట్టే అధికారం ఎన్జీటీకి ఉంటుందని తేల్చిచెప్పింది. తాము జారీచేసిన ఆదేశాలు జనవరి 17 వరకే వర్తిస్తాయని, తదనంతరం వాస్తవాల ఆధారంగా ఆదేశాలు జారీచేసే స్వేచ్ఛ ఎన్జీటీకి ఉంటుందని స్పష్టం చేసింది. అనుమతుల విషయమై జనవరి 17 నాటికి వివరణను సమర్పిస్తూ ప్రమాణపత్రం దాఖలు చేయాలని తెలంగాణ రాష్ట్రానికి ఎన్జీటీ స్పష్టం చేసింది.

ఎన్జీటీలో పాలమూరు ప్రాజెక్ట్‌కు అనుమతులపై అప్లికేషన్ దాఖలైన విషయం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేంతవరకు తెలియలేదని, ఏదైనా వ్యక్తి లేదా సంస్థపై ఫిర్యాదు అందితే తప్పనిసరిగా వారి వాదనలను పరిగణనలోనికి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంటూ తెలంగాణ రాష్ట్రం హైకోర్టును ఆశ్రయించింది. ఎన్జీటీ జారీచేసిన ఏకపక్ష ఉత్తర్వులు రద్దు చేయాలని, ప్రాజెక్ట్ పనులు గత ఏడాది మేలో ప్రారంభమయ్యాయని, ఆరునెలల తర్వాత ఏకపక్ష ఉత్తర్వులు జారీచేయడమేమిటని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ రిట్ పిటిషన్‌పై హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ శంకరనారాయణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ (ఏజీ) కే రామకృష్ణారెడ్డి వాదించారు. సుమారు మూడున్నర గంటలపాటు వాదనలు జరిగిన తర్వాత ఎన్జీటీ జారీచేసిన ఏకపక్ష మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.
విచారణ సందర్భంగా ఏజీ వాదనలు వినిపిస్తూ.. దక్షిణ తెలంగాణ ప్రాంతంలోని పూర్వపు మహబూబ్‌నగర్, నల్లగొండ , రంగారెడ్డి జిల్లాల్లో కరువుకాటకాల కారణంగా తాగునీటి వసతి లేదని, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలకు సురక్షిత తాగునీటిని అందించాలనే ఉద్దేశంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని వివరించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా సుమారు 1134 గ్రామాలలోని 50 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పిస్తామని వివరించారు. మొదట తాగునీటి ప్రాజెక్ట్‌గానే పాలమూరు -రంగారెడ్డిని ఎంచుకున్నామని , తర్వాత నీటిలభ్యత ఆధారంగా సాగునీటి ప్రాజెక్ట్‌గా మార్పులు చేయనున్నట్టు వివరించారు. ఆరునెలల నుంచి ఏడాది వరకు తాగునీటి ప్రాజెక్ట్‌గానే పాలమూరు-రంగారెడ్డిని పరిగణించాలని వివరించారు. పర్యావరణ శాఖ నిబంధనల ప్రకారం తాగునీటి ప్రాజెక్ట్‌లకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని వివరించారు. తాము ప్రాజెక్ట్‌పై ఆనకట్ట నిర్మించడం లేదని, శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుండి లిప్ట్‌ల ద్వారా నీటిని తరలించి పంప్‌హౌజ్‌ల ద్వారా సరఫరా చేయనున్నట్టు తెలిపారు.

ఆనకట్టలు నిర్మిస్తే పర్యావరణ అనుమతులు అవసరం అవుతాయని చెప్పారు. ఇక అటవీశాఖ అనుమతుల విషయానికొస్తే అమ్రాబాద్ టైగర్ జోన్‌లోని కోర్ ఏరియాకు 11.95 కిలోమీటర్ల దూరంగా ప్రాజెక్ట్ కాలువ పనులు జరుగుతున్నాయని అన్నారు. రిజర్వ్ ఫారెస్ట్‌గా ప్రకటించిన ప్రాంతంలో ప్రాజెక్ట్ పనులు చేపట్టడం లేదని స్పష్టం చేశారు. ఈ దశలో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. రిజర్వ్ ఫారెస్ట్‌కు చెందిన భూమిలో ఒక్క అంగుళం భూమిని తాకడం లేదని కోర్టుకు హామీ ఇస్తారా? అని పదేపదే ఏజీని ప్రశ్నించారు. దీంతో అధికారుల వివరణను తీసుకున్న ఏజీ.. హామీ ఇస్తున్నట్టు కోర్టుకు నివేదించారు. గతంలో అటవీ ప్రాంతంలో ప్రాజెక్ట్ పనులు జరిగిన మాట వాస్తవమేనని, కానీ అటవీశాఖ అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేసిన తర్వాత ప్రాజెక్ట్ డిజైన్‌ను మార్చి పనులు చేపడుతున్నట్టు తెలిపారు. గత ఏడాది జూలై 18న అటవీ ప్రాంతంలో పనులను నిలిపివేశామని ఏజీ వివరణ ఇచ్చారు. పంప్‌హౌజ్‌ను వేరేచోటికి బదలాయించినట్టు చెప్పారు.అయితే ఈ విషయాలను దాచిపెట్టి ఎన్జీటీలో ఉత్తర్వులు తెచ్చే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు.

పర్యావరణ, అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ అనుమతులపై న్యాయసమీక్ష చేపట్టే అధికారం ఉన్న ఎన్జీటీకి ప్రభుత్వం తరపున వివరణ సమర్పిస్తామని హైకోర్టుకు నివేదించారు. తమకు కనీసం నోటీసులు సైతం జారీచేయకుండా, వాదనలు వినకుండా ఎక్స్‌పార్ట్‌గా మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. మధ్యంతర ఉత్తర్వులు జారీచేసిన విషయం పత్రికా వార్తలతోనే తెలిసిందని, మధ్యంతర ఉత్తర్వుల ప్రతులు సైతం చాలారోజుల తర్వాత అందాయని అన్నారు. ఎన్జీటీ జారీచేసిన ఉత్తర్వులతో ప్రాజెక్ట్ నిర్మాణ పనులు పూర్తిగా స్తంభించిపోయాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై రోజుకు రూ.10 కోట్ల వృధాభారం పడుతున్నదని, కాంట్రాక్టర్లకు డబ్బులు కట్టించాల్సిన పరిస్థితి నెలకొన్నదని తెలిపారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన మొదటిదశ పనులపై అభ్యంతరాలు వస్తే పూర్తిగా 18 దశల పనులను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులను ఎన్జీటీ జారీచేసిందని వివరించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను 18 దశలుగా విభజిస్తే, కేవలం నాలుగు దశలు మాత్రమే అటవీ ప్రాంతం సమీపం నుంచి వెళ్తున్నాయని చెప్పారు. కానీ ఏకంగా ప్రాజెక్ట్ పనులను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశాలు ఇవ్వడం అసంబద్ధమని వాదనలు వినిపించారు. మొదటిదశ పనులకు సంబంధించిన భూమి సరిహద్దుల విషయంలో నిర్ధ్దారణ లేకుండానే అటవీభూమిగా అటవీశాఖ అధికారులు పేర్కొన్నారని వివరించారు. ఒక్క సర్వే నంబర్‌లోనే 440 ఎకరాల భూమి ఉందని, సర్వే నంబర్ సరిహద్దులు నిర్ధ్దారించలేదని అన్నారు. అయినప్పటికీ అభ్యంతరాలు రావడంతో పంప్‌హౌజ్‌ను ఇతర ప్రాంతంలో నిర్మిస్తున్నామని తెలిపారు. అటవీశాఖ అధికారులు రాసిన లేఖను ఆధారంగా చేసుకొని ప్రాజెక్ట్‌ను ఆపాలనే ప్రధాన ఉద్దేశంతో, రాజకీయ కారణాల నేపథ్యంలో ఎన్జీటీని హర్షవర్ధన్ ఆశ్రయించారని హైకోర్టుకు ఏజీ తెలిపారు.
ఎన్జీటీలో అప్లికేషన్ దాఖలు చేసిన హర్షవర్ధన్ తరఫు న్యాయవాది రచనారెడ్డి కోర్టులో వాదనలు వినిపిస్తూ ఎన్జీటీకి ఎక్స్‌పార్ట్ ఉత్తర్వులు జారీచేసే అధికారముందని అన్నారు. ఎన్జీటీ ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటు తెలంగాణ ప్రభుత్వానికి లేదని తెలిపారు. ఎన్జీటీ చట్టంలోని సెక్షన్ 22 ప్రకారం, ట్రిబ్యునల్ జారీచేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులోనే అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏజీ సమాధానమిస్తూ.. ఎన్జీటీ ఉత్తర్వులు జారీచేయలేదని, ఇప్పుడు హైకోర్టులో దాఖలు చేసింది అప్పీల్ కాదని తెలిపారు. సివిల్ ప్రొసీజర్ కోడ్‌ను అనుసరించి సివిల్ కోర్టుల మాదిరిగా ఎన్జీటీ జారీచేసిన ఏకపక్ష మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టును ఆశ్రయించే వెసులుబాటు ఉంటుందని వివరణ ఇచ్చారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను సాగునీటి ప్రాజెక్ట్‌గా రూపకల్పన చేశారని చెప్పారు.

సుమారు 12 లక్షల ఏకరాలను ప్రభావితం చేసేవిధంగా ఆయకట్టు పనులు చేపడుతున్నట్టు కోర్టుకు తెలిపారు. అందుకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి అవసరమవుతాయని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రస్తుతం ఏడాదివరకు తాగునీటి ప్రాజెక్ట్‌గానే పరిగణిస్తున్నామని, నీటిలభ్యత ఆధారంగా తదనంతరం సాగునీటి ప్రాజెక్ట్‌గా మార్పు చేస్తామని కోర్టుకు ఏజీ హామీ ఇచ్చినందున.. తాగునీటి ప్రాజెక్ట్‌గా ప్రస్తుతం తాము భావిస్తున్నామని తెలిపింది. అయినా తాము పర్యావరణ అనుమతులు, అటవీ, వన్యప్రాణి సంరక్షణ చట్టాల జోలికి వెళ్లదల్చుకోలేదని అన్నారు. ఈ వ్యవహారాలపై న్యాయసమీక్ష చేపట్టడానికి జాతీయ హరిత ట్రిబ్యునల్‌లను ఏర్పాటు చేసినందున, ఆ విషయం అక్కడే తేల్చుతారని పేర్కొన్నది. ప్రస్తుతానికి తెలంగాణ ప్రభుత్వం పేర్కొంటున్నట్టుగా ఏకపక్ష ఉత్తర్వులను ఎత్తివేసే విషయంపై అభ్యంతరాలను చెప్పాలని రచనారెడ్డికి ధర్మాసనం సూచించింది. దీనిపై ఆమె వివరణ ఇస్తూ.. తాము చెన్నైలోని ఎన్జీటీలో తెలంగాణ తరఫున వాదనలు చేసే స్టాండింగ్ కౌన్సిల్ యాసిన్ అలీకి ఈ మెయిల్ ద్వారా గత ఏడాది డిసెంబర్ 10 న తమ అప్లికేషన్ విషయాలను పంపించినట్టు కోర్టుకు నివేదించారు. అయితే దీనిపై ఏజీ సమాధానమిస్తూ… తమ స్టాండింగ్ కౌన్సిల్ ఫోన్ చేశారని, ఈ అప్లికేషన్‌పై ఎలాంటిపత్రం తమకు అందలేదని వివరణ ఇచ్చారని కోర్టుకు నివేదించారు. రచనారెడ్డి వాదనలు చేస్తూ.. ఎన్జీటీ విధించిన గడువు ఈ నెల 17 న ముగుస్తుందని, కేవలం రెండు వారాలు మాత్రమే గడువు ఉన్నందున ఎన్జీటీ ఉత్తర్వులను రద్దు చేయాల్సిన అవసరం లేదని రచనారెడ్డి అన్నారు. రోజుకు రూ.10 కోట్ల నష్టం వాటిల్లుతున్నదని ప్రభుత్వం చెప్తున్నదని, పదికోట్ల నష్టాన్ని అయినా పూడ్చవచ్చని.. అటవీభూమిలోని చెట్లను, వన్యప్రాణుల నష్టాన్ని పూడ్చలేమని అన్నారు.

NO COMMENTS

Leave a Reply