కేసీఆర్ నిర్ణ‌యంతో వేల కోట్లు వ‌చ్చేస్తాయ‌ట‌

telangana-education
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో విశిష్ట నిర్ణ‌యం తీసుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు. కేంద్ర ప్రభుత్వాలు ఆదేశించినా అమలు కాని పనులపై సీఎం కేసీఆర్‌ దృష్టి సారించారు. గత పాలకులు విస్మరించిన కేంద్ర నిర్ణయాన్ని అమలులోకి తెచ్చేందుకు కార్యాచరణ చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయబోతోంది. 1976లో అమలులోకి తెచ్చిన మిగులు భూముల చట్టాన్ని ఎన్డీఏ సర్కార్‌ 1999లో రద్దు చేసింది. అయినా కొన్ని రాష్ట్రాలు ఇంకా సదరు యూఎల్సీని కొనసాగిస్తూ ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్నాయి. అదే కోవలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కూడా దీనిని కొనసాగించింది. దీన్ని ఎత్తివేయ‌డం ద్వారా రాష్ట్ర ఖ‌జానాకు మేలు చేసేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్న‌ట్లు స‌మాచారం.
1976లో అమలులోకి వచ్చిన ఈ చట్టాన్ని 1999లో అప్పటి ఎన్డీఏ సర్కార్‌ రద్దు చేసింది. పట్టణాలు, నగరాల్లో ఒక్కో వ్యక్తికి 1000 చదరపు మీటర్లకు మించి భూమి ఉండకూడదన్న నిబంధనలతో అప్పటి ప్రధాని ఇంధిరాగాంధీ హయాంలో యూఎల్సీ చట్టాన్ని అమలులోకి తెచ్చారు. 1999లో ఎన్డీఏ సర్కార్‌ ఈ చట్టాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలు కూడా కేంద్ర నిర్ణయాన్ని అమలు చేస్తూ చట్టాన్ని రద్దు చేయాలని కేంద్రం కోరింది. చట్టం రద్దుతో నిరుపయోగమైన భూమి వినియోగంలోకి వస్తుందని, తద్వారా రాష్ట్రాల ఆర్ధిక స్థితిగతులు మెరుగవుతాయని అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆశించింది. అయినా ఫలితం లేకపోవడంతో షరతులను కూడా విధించింది. తాము అందజేస్తున్న జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులను పొందాలంటే యూఎల్సీని చేయకతప్పదని కీలక మెలిక పెట్టింది. అయినా అప్పట్లో చట్టం రద్దు అమలు లోకి రాలేదు. గత ఏడాది రాష్ట్రంలోని మిగులు, ప్రభుత్వ భూములపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో యూఎల్సీపై కఠిన నిర్ణయాలు తీసుకోనున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ నేపథ్యంలో త్వరగా పెండింగ్‌ పనులను పూర్తిచేసి దీని రద్దుకు ముందుకు వెళ్లాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగానే అక్రమాలకు చెక్‌ పెట్టేందుకు హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోని యూఎల్సీ భూములపై ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. యూఎల్సీ భూములకు ఎన్‌ఓసీలను ఇచ్చే అధికారం కలెక్టర్లకు కట్టబెట్టింది.
పట్టణ భూ గరిష్ట పరిమితి(యూఎల్సీ) చట్టం కింద ఉన్న మిగులు భూములను వేలం వేయాలని సర్కార్‌ యోచిస్తోంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసేందుకు కార్యాచరణ చేస్తోంది. గతంలో మిగులు భూముల క్రమబద్దీ కరణకు 2008లో జీవో 747ను అప్పటి ప్రభుత్వం జారీ చేసింది. అయితే అప్పట్లో ఈ జీవో కింద క్రమబద్దీకరణకు పలువురు ముందుకు వచ్చినా అది ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని అధికారులు నివేదించారు. మిగులు భూముల క్రమబద్దీకరణ ద్వారా రూ. 1500 కోట్ల రాబడి రానుందని అధికారులు ఇచ్చిన అంచనా కూడా సర్కార్‌కు కలిసివచ్చింది. ఫలితంగా కొత్త జీవోతో క్రమబద్దీకరణకు మార్గం రూపొందించేపనిలో అధికారులను సిద్దం చేస్తోంది. ఈ మేరకు ఇప్పటికే వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించిన రెవెన్యూ ముఖ్య కార్యదర్శి తాజాగా వివరాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించారు. హైదరాబాద్‌, రంగారెడ్డిలలోని 3800 ఎకరాల మిగులు భూములతోపాటు వరంగల్‌ జిల్లాలోని భూములను కూడా క్రమబద్దీకరణ చేయాలని….అందుకు అనువుగా ఉత్తర్వులు సిద్దం చేయాలని సీఎస్‌ ఆదేశించినట్లు తెలిసింది. మిగులు భూముల్లో ప్రధానంగా హైదరాబాద్‌ జిల్లాలో 2600 ఎకరాలకుపైగా వివాదరహిత భూములుండగా, మరో 500 ఎకరాల్లో పలు న్యాయపరమైన వివాదాలున్నాయని గుర్తించారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలో కోర్టు వివాదాల్లో 1369 ఎకరాలుండగా, 2083 ఎకరాల భూమి వివాదరహితంగా ఉందని ప్రభుత్వానికి అందిన నివేదికలో స్పష్టమైంది. వీటిని బ‌హిరంగ వేలం వేయ‌డం ద్వారా ఖ‌జానాకు మేలు చేసేందుకు సీఎం కేసీఆర్ సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.

NO COMMENTS

Leave a Reply