నేత‌న్న‌ల‌కు న్యూ ఇయ‌ర్ గిఫ్ట్

power-loom-chenetha

నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా నేత‌న్న‌ల‌కు భ‌రోసాగా ఉండేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది. కొత్త సంవత్సరం కానుకగా పవర్ లూం కార్మికులకు చేతినిండా పని కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రంలో తెల్లకార్డున్న అడపడుచులకు బతుకమ్మ బహుమతిగా చీర జాకెట్ అందించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నది. వీరికి ఐదు కోట్ల మీటర్ల వస్త్రం అవసరం కానుంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సరఫరా చేసే ఉచిత యూనిఫాంలకు కోటి మీటర్ల వస్త్రం అవసరం. ఈ రెండు వర్గాలకు కలిపి అవసరమైన ఆరు కోట్ల మీటర్ల వస్ర్తాన్ని పవర్ లూం ద్వారా తయారు చేయించాలని ప్రభుత్వం భావిస్తున్నది.

రాష్ట్రంలో ఉన్న పవర్ లూం మగ్గాల్లో 95 శాతానికిపైగా సిరిసిల్లలోనే ఉన్నాయి. 10వేల పవర్ లూంల ద్వారా చీరలను తయారు చేయించాలని, మిగిలిన వాటిని విద్యార్థుల యూనిఫాం క్లాత్ తయారీకి ఉపయోగించుకోవాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ నెలలోనే ఆర్డర్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి టెస్కో ప్రతిపాదనలు పంపింది. పది రోజుల్లో వీటికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడుతాయని టెస్కో అధికారులు అంచనా వేస్తున్నారు. ఉత్తర్వులు అందగానే నూలు పంపిణీ చేసే ప్రక్రియను చేపట్టనున్నారు. ఆ తరువాత వస్త్రాల‌ తయారీ ప్రారంభం కానుంది. కాగా చేనేత, జౌళి శాఖ మంత్రిగా కే తారక రామారావు బాధ్యతలు చేపట్టాక ఈ శాఖ ప్రక్షాళనపై దృష్టిసారించారు. హ్యండ్లూమ్‌తో పాటు పవర్ లూం ఉత్పత్తులను కూడా ఉపయోగించుకునేందుకు కృషి చేస్తున్నారు. కార్మికులకు చేతి నిండా పని కల్పించడంతోపాటు ఉత్పత్తులకు మార్కెటింగ్ వనరులను కూడా సమకూర్చుతున్నారు. కార్మికులు కూడా ఉత్పత్తి సామర్థ్యానికి అనుగుణంగానే ఆర్డర్లు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచిస్తున్నారు.

NO COMMENTS

Leave a Reply