ప్ర‌భుత్వాన్ని కొత్త‌గా టార్గెట్ చేస్తున్న‌ కాంగ్రెస్‌

telangana-water-projects

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని వీలైనంత‌గా ఇర‌కాటంలో ప‌డేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంది. అయితే క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌ల వ‌ద్ద ఈ ఎత్తుగ‌డ‌ ఫలితం ఇవ్వ‌క‌పోవ‌డంతో కొత్త ఆలోచ‌న మొద‌లుపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రప‌తిని క‌లిసింది. శాసనసభ ఆమోదించిన 2016 భూసేకరణ పునరావాస, సహాయ, పరిహార హక్కు పారదర్శకత సవరణ బిల్లును ఆమోదించవద్దని కాంగ్రెస్‌ నేతలు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీని కోరారు. 2013 కేంద్ర చట్టాన్ని సవరిస్తూ రూపొందించిన ఈ బిల్లులో అనేక అభ్యంతరకర అంశాలున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా వాటిని ప్రతిపాదించిందని ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఈ బిల్లును తిరస్కరించాలన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, సీఎల్పీ నేత జానారెడ్డి, మండలి విపక్ష నేత షబ్బీర్‌అలీలు శుక్రవారం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయనను కలిసి విన్నవించారు. నిర్వాసితుల హక్కులు, ప్రయోజనాలకు ఇందులో ఎలాంటి రక్షణలు లేవని అన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులే గాకుండా పరిశ్రమలు, ఇతర సంస్థలకు పెద్దఎత్తున భూమిని ధారాదత్తం చేసేందుకే ప్రభుత్వం ఈ బిల్లును తెచ్చిందని అన్నారు. సవరణలతో రాష్ట్ర ప్రభుత్వం మాఫియాగా మారుతుందని చెప్పారు. ఎలాంటి పునరావాసం, సహాయ చర్యలు లేకుండానే భూసేకరణ జరిపేందుకు అధికారాలను కల్పిస్తుందని చెప్పారు. కాగా శ‌నివారం ఉద‌యం త‌న రాష్ట్రప‌తి ఢిల్లీ తిరిగివెళ్లారు.

NO COMMENTS

Leave a Reply